కాలుష్యంపై పోరుకు ‘తుక్కు’ సంకల్పం

27 Mar, 2021 00:26 IST|Sakshi

విశ్లేషణ

మెరుగైనది అందిపుచ్చుకోవాలి. తరుగైనది వదిలించుకోవాలి. వాహనాలకు సంబంధించి ఇది అత్యావశ్యం. బీఎస్‌–1 ప్రమాణాల వాహనంతో పోలిస్తే బీఎస్‌–6 ప్రమాణాల వాహనం 36 రెట్లు తక్కువ కాలుష్యాన్ని వెదజల్లుతుంది. అలాంటప్పుడు లక్షలాది పురాతన వాహనాలను వదిలించుకోవడమే శరణ్యం. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన స్క్రాపేజీ పాలసీ ముసాయిదా కీలకమైనదేగానీ, ఇంకా ప్రభావవంతమైన ఆలోచనలతో రావాల్సి వుంది. వాహనశ్రేణిని మార్చే బాధ్యత రాష్ట్రాల మీద ఉంచడం ఇందులో లోటు. కొత్త వాహనాలు కొనడానికీ, విద్యుత్‌ వాహనాల వినియోగాన్ని పెంచడానికీ ప్రోత్సాహకాలు కల్పించాల్సి వుంది. విష ఉద్గారాలను తీవ్రంగా తగ్గించుకునే ప్రయత్నం చేస్తేనే కాలుష్య రహిత ప్రపంచాన్ని సాధించుకోగలం.

ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న స్క్రాపేజ్‌ విధాన ముసాయిదా ఎట్టకేలకు అందుబాటు లోకి వచ్చింది. వాయుకాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో 20 ఏళ్ల పైబడ్డ వాహనాలను తుక్కు కింద ఇచ్చేసి కొన్ని ప్రోత్సాహకాలతో కొత్త వాహనాల కొనుగోలుకు వీలు కల్పించే ఈ విధానం కీలకమైందే. కానీ ఈ విధానం ద్వారా గరిష్ట ప్రయోజనాలు పొందడం కష్టసాధ్యం. కాలం చెల్లిన వాహనాలను వదిలించుకున్న వారికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలూ, కంపెనీలే ప్రోత్సాహకాలు ఇవ్వాలన్న కేంద్ర ప్రభుత్వ ‘సలహా’, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన భారీ వాహనాల మార్పిడికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయమూ లేకపోవడం విధాన లోపాలుగా చెప్పుకోవచ్చు.

వాస్తవానికి కోవిడ్‌ అనంతర పరిస్థితుల్లో ఆర్థిక ఉద్దీపనలో భాగంగా కేంద్రం తగిన సాయం చేయడం ద్వారా వాయుకాలుష్యాన్ని గణనీయంగా తగ్గించేందుకు ఈ విధానం ఆలంబనగా నిలిచే అవకాశం ఉండేది. విద్యుత్‌ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు లేదా భారత్‌–4 ప్రమాణాలున్న వాహనాల స్థానంలో కొత్తవాటిని ప్రవేశపెట్టేందుకు ఈ విధానాన్ని ఉపయోగించుకుని ఉంటే మెరుగైన ఫలితాలు ఉండేవి. వాహనశ్రేణి ఆధునికీకరణ లేదా స్క్రాపేజీ పాలసీగా కేంద్రం చేస్తున్న ప్రతిపాదన ఏమిటంటే, దశలవారీగా కాలుష్యకారక వాహ నాల స్థానంలో కొత్తవాటిని ప్రవేశపెట్టాలి.

ఇంధన సామర్థ్యం పెంపు, రహదారులపై ప్రమాదాలను తగ్గించడం, స్క్రాపింగ్‌ పరిశ్రమను అసంఘటిత రంగం నుంచి తప్పించడం, ఆటోమోటివ్, స్టీల్, ఎలక్ట్రానిక్‌ రంగాలకు అవసరమైన పదార్థాలను తుక్కు నుంచి తక్కువ ఖర్చుతో సేకరించడం వంటివి కూడా ఈ విధానపు లక్ష్యాలు.  వ్యక్తిగత వాహనాల స్క్రాపేజీకి 25 శాతం, వాణిజ్య వాహనాలకు 15 శాతం రోడ్‌ట్యాక్స్‌ మాఫీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసు కోవాలని కేంద్రం సలహా ఇచ్చింది. రిజిస్ట్రేషన్‌ చార్జీల మాఫీని కూడా ప్రతిపాదించింది. స్క్రాపేజీ సర్టిఫికెట్‌ ఆధారంగా కొత్త వాహనం ధరలో ఐదు శాతం డిస్కౌంట్‌ ఇవ్వాలని కంపెనీలకు సూచించింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యంలో అధీకృత స్క్రాపింగ్‌ సెంటర్లు, వాహనాల జీవిత కాలాన్ని నిర్ణయించే ఫిట్‌నెస్‌ సెంటర్ల ఏర్పాటుకే సహకరిస్తామని కేంద్రం పేర్కొంది. 

ఈ ఏడాది అక్టోబరుకు స్క్రాపింగ్‌ నిబంధనల రూపకల్పన, 15 ఏళ్లకంటే పురాతనమైన ప్రభుత్వ రంగ సంస్థల వాహనాలను వచ్చే ఏడాది అక్టోబరుకల్లా తుక్కుగా మార్చాలని కేంద్రం సంకల్పించింది. 2023 అక్టోబరు కల్లా హెవీడ్యూటీ వాహనాలన్నింటికీ ఫిట్‌నెస్‌ టెస్టింగ్‌ను తప్పనిసరి చేయనున్నారు. వాహన్‌ డేటాబేస్‌ ఆధారంగా స్క్రాపింగ్‌ కేంద్రాలన్నీ వాహనాల రికార్డులు, యజమానుల వివరా లను ఎప్పటికప్పుడు నమోదు చేస్తుంటాయని కేంద్రం చెబుతోంది. అగ్ని ప్రమాదాలు, ఆందోళనలు, ఇతర ప్రమాదాలు, లోపాలున్నవిగా తయారీదారులు ప్రకటించినవి, పోలీసు, తదితర వర్గాల వారు జప్తు చేసిన వాహనాలన్నింటినీ తుక్కుగా మార్చేస్తారు.

దేశవ్యాప్తంగా 20 ఏళ్ల కంటే పురాతనమైన తేలికపాటి వాహనాలు దాదాపు 51 లక్షల వరకూ ఉన్నాయనీ, 15 ఏళ్ల కంటే పురాతనమైనవి మరో 34 లక్షలు ఉన్నాయనీ కేంద్రం అంచనా వేసింది. మధ్యతరహా, భారీ వాహనాల విభాగాల్లో 15 ఏళ్లు దాటినవి 17 లక్షల వరకూ ఉన్నాయి. ఇతర వాహనాలతో పోలిస్తే ఇవి పది నుంచి 12 రెట్లు ఎక్కువ విష ఉద్గా రాలను వెలువరిస్తాయి. 
వాహనాలను తుక్కుగా మార్చేందుకు ప్రస్తుతం ఉపయోగిస్తున్న పద్ధతులు నేల, నీరు, గాలిని కలుషితం చేస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అన్ని రకాల సౌకర్యాలు, పరికరాలతో, తగిన రక్షణ చర్యలు తీసుకుంటూ వాహనాలను వ్యవస్థీకృతంగా తుక్కుగా మార్చే కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కొత్త విధానం సాయపడుతుంది కూడా.

కానీ ఈ విధానం ద్వారా వాయుకాలుష్య పరంగా గరిష్టమైన లబ్ధి మాత్రం చేకూరే అవకాశాలు తక్కువ. వాహనశ్రేణిని మార్చే బాధ్యత మొత్తం రాష్ట్ర ప్రభుత్వాలపై మోపడం, రోడ్‌ట్యాక్స్, రిజిస్ట్రేషన్‌ ఫీజుల్లో అధిక శాతాన్ని మాఫీ చేయాలన్న సిఫారసు అంత ప్రోత్సాహకరంగా ఏమీ లేవు. ఈ రెండింటి ఆదాయంపై ఆధారపడ్డ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధానంపై ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి. కోవిడ్‌ తదనంతర పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఉద్గారాల తగ్గింపు లక్ష్యంగా పలు ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నాయి. కేంద్రం కూడా వాహనాలను మార్చుకునే వారికి జీఎస్‌టీలో సబ్సిడీ ఇవ్వడం ద్వారా ఈ విధానాన్ని మెరుగ్గా ఉపయోగించుకోవచ్చు.

కాలుష్యం ఎక్కువగా వెదజల్లే వాహనాల స్థానంలో బీఎస్‌–6 ప్రమా ణాలతో కూడిన వాహనాలు కొనేవారికి నేరుగా ప్రోత్సాహకాలు ఇచ్చే విషయాన్ని కూడా కేంద్రం పరిగణించాలి. బీఎస్‌–1 ప్రమాణాల వాహనంతో పోలిస్తే బీఎస్‌–6 ప్రమాణాలున్న వాహనం 36 రెట్లు తక్కువ కాలుష్యాన్ని వెదజల్లుతుంది. కొత్త వాహనాలను కొనకుండా పాతవాటిని తుక్కుగా మార్చేందుకు మాత్రమే ఇష్టపడే వారికి స్క్రాపేజీ కేంద్రాలిచ్చే సర్టిఫికెట్ల ఆధారంగా రిబేట్లు కల్పించడం, తుక్కుగా మార్చడంతోపాటు కొత్త వాహనాలను కొనేవారికి ఎక్కువ స్థాయిలో ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా ఎక్కువ ప్రయోజనం జరుగుతుంది. మొత్తమ్మీద పాత వాహనం స్థానంలో బీఎస్‌–6 ప్రమాణాలున్న వాహనాన్ని కొనుగోలు చేసే వినియోగదారుడికి వాహనం ధరలో కనీసం 15 శాతం ప్రయోజనం కలిగేలా చూడటం ముఖ్యం.

పాతబడినప్పటికీ ఆర్థికంగా విలువ ఉన్న వాహనాలకు ఎక్కువ ప్రయోజనాలు కల్పించాలి. వ్యక్తిగత వాహనాల విషయంలో విధానం వేరుగా ఉండాల్సిన అవసరముంది. ద్విచక్ర వాహనాలతోపాటు కార్లకూ స్వచ్ఛంద విద్యుత్‌ వాహనాల కొనుగోలుకూ మధ్య లింకు ఏర్పరచడం మేలు.  వ్యక్తిగత వాహనాల సంఖ్య చాలా ఎక్కువ. భారీ వాహనాల మాదిరి గానే వీటికీ రాయితీలిస్తే కేటాయించిన బడ్జెట్‌ వీటికే ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకే స్వచ్ఛందంగా విద్యుత్తు వాహనాలు కొనుగోలు చేసేవారికే రాయితీలు ఇవ్వడం మేలు. ఇలా చేయడం ద్వారా వాయు కాలుష్యం తగ్గింపులో గరిష్ట ప్రయోజనాలు పొంద వచ్చు. ఇంటర్నేషనల్‌ కౌన్సిల్‌ ఆన్‌ క్లీన్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ జరిపిన ఒక అధ్యయనం ప్రకారం, పురాతన వాహనాల స్థానంలో కొత్త విద్యుత్తు వాహనాల వాడకం ద్వారా ఉద్గారాల తగ్గింపు ఎక్కువ ఉంటుంది.

వ్యక్తిగత వాహనాలకు ఇచ్చే ప్రోత్సాహకాలను పరిమితం చేయడం ద్వారా ప్రజలు స్వచ్ఛందంగా విద్యుత్తు వాహనాల కొనుగోలుకు ముందుకొచ్చే అవకాశాలు పెరుగుతాయన్నమాట. 2030 నాటికి వ్యక్తిగత వాహనాల్లో 30–40 శాతం విద్యుత్తు వాహనాలు ఉండాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరేందుకూ ఇది దోహద పడుతుంది. తుక్కుగా మార్చేసే వాహనాల నుంచి అత్యధిక ప్రయోజనం పొందేందుకు తయారీదారులపై బాధ్యత మోపేలా కొత్త పాలసీ ఉండాలి. 2015లో తయారు చేసిన ఆటోమోటివ్‌ ఇండస్ట్రియల్‌ స్టాండర్డ్‌–129 (ఏఐఎస్‌–129)ను కంపెనీలు సమర్థంగా అమలు చేసేలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

ఏఐఎస్‌–129 ప్రకారం వాహన తయారీలో ఎంత మోతాదులో పదార్థం ఉపయోగించారో అందులో 89–85 శాతం రికవరీ, రీసైకిల్, రీయూజ్‌ చేయాల్సి ఉంటుంది. సీసం, పాదరసం, కాడ్మియం, హెక్సావెలెంట్‌ క్రోమియం తదితర భార లోహాల వాడకంపై కూడా ఈ ఏఐఎస్‌–129 పరిమి తులు విధిస్తుంది. స్క్రాపేజీ విధానంలో దీన్ని తప్పనిసరి చేసి, గూడ్స్‌ వాహనాలను ఎన్‌1 కేటగిరీకి చేర్చడం ద్వారా ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. రీసైకిల్‌ చేయాల్సిన పదార్థాలను 85–95 శాతానికి చేర్చడం, వాడేసిన ఆయిళ్లు, రబ్బర్‌ల నుంచి ఇంధనాలను ఉత్పత్తి చేయడం, యూరోపియన్‌ నిబంధనల్లాగే తయారీదారులపై ఎక్స్‌టెం డెండ్‌ ప్రొడ్యూసర్‌ రెస్పాన్సిబిలిటీ ఉండేలా చూడటం అవసరం. 


అనుమిత రాయ్‌ చౌదరి
వ్యాసకర్త సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ శాస్త్రవేత్త 

మరిన్ని వార్తలు