అభివృద్ధి పథంలో... తెలుగు నేల

26 Oct, 2021 00:58 IST|Sakshi

సందర్భం

తెలుగు ప్రజలకు రెండురాష్ట్రాలు ఏర్పడి ఏడేళ్లు దాటింది. ఏడేళ్లకు ముందు ఒకే రాష్ట్రంగా ఉన్న తెలుగు నేలపై 58 ఏళ్లుగా ప్రత్యక్ష, పరోక్ష దాయాదుల పోరే. హైదరాబాద్‌   దక్కన్, ఆంధ్ర రాష్ట్రంగా స్వాతంత్య్రానంతరం రెండు రాష్ట్రాలుగా ఉన్నది అతి స్వల్పకాలమే. ఇంకా ముందు మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఆంధ్రప్రాంతం, నైజాం పాలనలో తెలంగాణ ప్రాంతం ఉండేవి.

అటు ఆంగ్లేయులు, తమిళుల ఆధిపత్యం కింద ఆంధ్ర ప్రజలు, ఇటు ముస్లిం ప్రభువులు, ఉర్దూ ఆధిపత్యం కింద తెలంగాణ ప్రజలుండేవారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలు కొన్ని తెలుగు జిల్లాలను కోల్పోయి ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పడినా అది బలవంతపు కలయికే అయింది. రోజూ పోట్లాడుతూ కలిసుండటం కంటే, విడిపోయి కలిసుండటమే మంచిదన్న భావంతో రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడ్డాయి.

తెలుగు సమాజంలో తమ భాష, ప్రాంత, సాంస్కృతిక, చారిత్రక, భౌగోళిక, అభిరుచుల కనుగుణంగా పాలనా రంగంలో, అభివృద్ధి నమూనాలో గుణాత్మక మార్పులు తీసుకు రావడానికి రెండు రాష్ట్రాల ఏర్పాటు దోహదం చేసింది.  తెలంగాణలో ఈ గుణాత్మక మార్పులకు ఏడేళ్ళ క్రితమే పునాది రాళ్ళు పడి శరవేగంతో పరుగులు తీస్తుంది.  కె.సి.ఆర్‌. లాంటి తెలంగాణ ఆత్మ నెరిగిన పాలకుని చేతుల్లోకి రాష్ట్రపాలనా పగ్గాలు పోవడం వల్ల  ఇది నిరంతరం సాగుతూనే ఉంది.  

ఆంధ్రప్రదేశ్‌ లో ఈ మార్పులు వై.ఎస్‌. జగన్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాతే మొదలై రాకెట్‌ వేగంతో పరుగులు తీస్తున్నాయి. చంద్రబాబునాయుడు తన ఐదేళ్ల పాలనా సమయాన్ని తెలంగాణలో గిల్లికజ్జాలు పెట్టుకోవడం, ప్రతిపక్షాన్ని అణగదొక్కడం, హైదరాబాద్‌పై తన ఆధిపత్యాన్ని నిలుపుకోవడం, ఆత్మస్తుతి పరనిందలతోనే గడిపేశాడు. కేసీఆర్, వైఎస్‌ జగన్‌ ఇరువురూ తమ తమ రాష్ట్రాలను గుణాత్మక మార్పుల దిశగా పయనింప జేస్తున్నారు. 

ఏడేళ్లుగా తెలంగాణలో, రెండేళ్లకు పైగా ఆంధ్రప్రదేశ్‌లో తమదైన అభివృద్ధి నమూనాను నిర్ణయించుకొని ముందుకు సాగుతున్నారు. రెండు రాష్ట్రాల్లోనూ అంతవరకున్న నేల విడిచి సాము చేయడం, ప్రాధాన్యతా క్రమాలను నిర్ణయించుకోవడంలో సరైన పద్ధతి లేనితనం వల్ల జరిగిన నష్టాన్ని గుర్తించారు. వ్యవసాయ ప్రధాన రాష్ట్రాలైన తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయడం ఎంత ప్రమాదకరమో ఇప్పుడు సీఎంలు ఇద్దరూ గుర్తించారు.  

వ్యవసాయ సంక్షోభాన్ని గట్టెక్కించడానికి, అన్నదాత నాదుకోవడానికి, రైతును రాజు చేయడానికి కేసీఆర్, జగన్‌ తీసుకున్న చర్యల వల్ల ఎన్నో మేళ్లు జరిగాయి. రైతుల గురించి తీసుకున్న పథకాలు, నీటిపారుదల సౌకర్యాలు, రుణమాఫీ, విత్తనాల సరఫరా, ఆర్థిక సాయం లాంటి అనేక చర్యల వల్ల ఇద్దరూ రైతుబంధులయ్యారు. వ్యవసాయం దండుగ అనే స్థితి నుండి వ్యవసాయం పండుగ అనే స్థితి వచ్చింది. భూమిపై ప్రేమ పెరిగింది. వ్యవసాయం దండుగ అనే స్థితి పోయి పండుగ కావడమే అతిపెద్ద మార్పు.

ఇటీవలి కాలంలో అన్ని వార్తాపత్రికల్లో ఓ వార్త వచ్చింది. అదేంటంటే ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరడానికి సీట్లు లేవని, హౌస్‌ఫుల్‌గా సీట్లు భర్తీ అయ్యాయని!  అలాగే తెలంగాణలో సాంఘిక సంక్షేమ ప్రభుత్వ పాఠశాలల్లోనూ సీట్లు లభించడం కష్టమవుతోంది. ఇది చాలా గొప్ప పరిణామం. ప్రైవేట్, కార్పొరేట్‌ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల వైపు దృష్టి మరలడం గణనీయమైన మార్పే.

ఇందుకు కారణం గ్రామీణ పేదలు, బహుజనులు చిరకాలంగా కోరుకుంటున్న ఇంగ్లిష్‌ మాధ్యమ చదువులు ప్రభుత్వ రంగంలో ప్రవేశపెట్టడం. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలలపై దృష్టి పెరిగింది. వేలు, లక్షలు పెట్టి ఆంగ్లమాధ్యమం చదివేవారికి ఆ భారం తప్పింది. ప్రజలు కోరుకుంటున్న నాణ్యమైన చదువు ఇంగ్లిష్‌ మాధ్యమమేననే విషయాన్ని ప్రభుత్వం మన్నించి నట్టయింది. కార్పొరేట్‌ విద్య, కార్పొరేట్‌ చదువుల వ్యాపారధోరణికి ఈ విధానం తప్పకుండా అడ్డుకట్ట వేస్తుంది.

బహుజన కులాల వారికి మంత్రివర్గంలో ముఖ్యమైన శాఖలివ్వడం రెండు రాష్ట్రాల్లోనూ జరుగుతుంది. తెలంగాణలో రైతుబంధు, దళితబంధు, షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి తదితర అనేక సంక్షేమ ప«థకాల వల్ల బహుజన కులాలు లబ్ధి పొందుతున్నారు. తరతరాలుగా నిర్లక్ష్యానికి గురవుతున్న బహుజన కులాల సమస్యలను గణనలోకి తీసుకొని అమ్మ ఒడి, గ్రామవలంటీర్ల పథకాలు ఏర్పరచడం చెప్పుకోదగిందే. అలాగే తెలంగాణ సంక్షేమ ప«థకాలు ప్రతి గడపనూ తాకుతున్నాయి. వృత్తి పనులు చేసుకునే బహుజన కులాలవారికి వృత్తి సంబంధ ఆర్థిక వనరులిచ్చి ప్రోత్సహించడం తెలంగాణలో విస్తృతంగా జరుగుతుంది.

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, పర్యావరణం, ప్రకృతి రక్షణకు ప్రాధాన్యమిస్తూ పట్టణాల నుండి గ్రామాల వైపు దృష్టి మరలేట్టు చేయడం గొప్ప పరిణామం. హ్యుమానిటీస్‌ చదవడం దండగ అనే స్థాయి నుండి ఇంగ్లిష్‌ మీడియంలో హాయిగా చదువుకొనే స్థితి వచ్చింది. ఇలా తెలుగు రాష్ట్రాలు కేసీఆర్, జగన్‌ పాలనలో గుణాత్మక మార్పుల దిశగా పయనించడం మంచి పరిణామం.
-డా. కాలువ మల్లయ్య
వ్యాసకర్త కథా, నవలా రచయిత. 
మొబైల్‌: 91829 18567

మరిన్ని వార్తలు