చిరస్మరణీయుడు పొట్టి శ్రీరాములు

1 Nov, 2020 07:29 IST|Sakshi

ఆంధ్రరాష్ట్ర అవతరణకు  ప్రాణ త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు తెలుగు వారందరికీ చిరస్మరణీయుడు. 1953, అక్టోబర్‌ 1న కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా నవంబర్‌ 1, 1956న హైదరాబాద్‌ రాజధానిగా ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడింది. ఈ రాష్ట్ర అవతరణకు జరిగిన రాజకీయ పోరాట నేప«థ్యాన్ని తలంచుకున్నప్పుడు అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగం గుర్తుకు రాక మానదు. 2014లో ఆంధ్రప్రదేశ్‌ విభజన జరిగి తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్‌ తన బ్రాండ్‌ ఇమేజ్‌ను కోల్పోకుండా వుండాలంటే గతంలో లాగానే నవంబర్‌ 1నాడే ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవాన్ని నిర్వహించుకోవాలని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. 

అయితే నాడు ముఖ్యమంత్రిగా వున్న చంద్రబాబునాయుడు తెలుగు ప్రజల ఆకాంక్షలను తుంగలో తొక్కాడు. సంప్రదాయంగా వస్తున్న మన రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని చరిత్రతో పనే లేదని చంద్రబాబు పక్కన పెట్టేశాడు. తెలంగాణ ఏర్పడిన జూన్‌ 2ను ఏపీ చరిత్రలో చీకటిరోజుగా అభివర్ణిస్తూ నవనిర్మాణ దీక్షల పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడు. 2014 జూన్‌ 2న తెలంగాణ ఏర్పాటు తేదీని ఆ రాష్ట్రం అవతరణ దినోత్సవంగా జరుపుకుంటోంది. అయితే, 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర అవతరణ దినోత్సవం అయిదేళ్ల పాటు నిర్వహించలేదు. ఎంతో చరిత్ర ఉన్న ఏపీకి రాష్ట్ర అవతరణ దినోత్సవం జరపాలని అనేక మంది ప్రముఖులు, సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి.  (నేడు ఘనంగా రాష్ట్ర అవతరణ ఉత్సవాలు)

అయినా స్పందన లేదు. ఇక, ఏపీలో వై.ఎస్‌. జగన్‌మోహన్‌ రెడ్డి  ప్రభుత్వం ఏర్పాటైన తరువాత దీనిపై కేంద్ర ప్రభుత్వంతో కసరత్తు చేసింది. కేంద్రం సైతం తాము గతంలోనే సూచనలు చేసామంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సమాధానం ఇచ్చింది. ఫలితంగా అయిదేళ్లుగా రాష్ట్ర అవతరణ దినోత్సవం లేని ఏపీ 2019 నుండి నవంబర్‌ 1న ఏపీ అవతరణ దినోత్సవంగా జరుపుకుంటున్నది. ఆంధ్ర అవతరణ దినోత్సవం అంటే ఒక సంస్కృతి. అది మన పూర్వీకులకు మనం ఇచ్చే గౌరవం. తెలుగు ప్రముఖులను గౌరవించుకోవడానికి, ఆంధ్రుల చరిత్రను స్మరించుకోవడానికి, రాబోయే కాలంలో దిశానిర్దేశాలు ఎంచుకోవడానికి అవకాశం దొరుకుతుంది.

దాదాపు 58 సంవత్సరాల తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన జరిగి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు రెండు తెలుగు రాష్ట్రాలుగా 2014 జూన్‌ 2 నుంచి అమలులోకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా హైదరాబాద్‌ 2014 జూన్‌ 2 నుండి మూడు సంవత్సరాల వరకు కొనసాగింది. అమరావతిలో కొత్త రాజధానికి 2015 అక్టోబరు 23న శంకుస్థాపన జరిగింది. 2017 మార్చి 2న శాసనసభ ప్రారంభమై పరిపాలన మొదలైంది. సమీకృత అభివృద్ధి. పరిపాలన వికేంద్రీకరణ కొరకు, అమరావతిని కేవలం శాసనరాజధానిగా పరిమితం చేసి, విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం మార్పులు చేసిన చట్టానికి 2020 జూలై 31 న గవర్నర్‌ ఆమోదముద్ర పడింది.

ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించి, అమరజీవి అయిన మహాపురుషుడు, పొట్టి శ్రీరాములు, ఆంధ్రులకు ప్రాతఃస్మరణీయుడు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైనవాడు. మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాలకోసం జీవితాంతం కృషిచేసిన మహనీయుడు. మద్రాసు రాజధానిగా వుండే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు మద్రాసులో 1952 అక్టోబర్‌ 19న బులుసు సాంబమూర్తి ఇంట్లో నిరాహారదీక్ష ప్రారంభించాడు. చాలా మామూలుగా ప్రారంభమైన దీక్ష, క్రమంగా ప్రజల్లో అలజడి రేపింది. ఆంధ్ర కాంగ్రెసు కమిటీ మాత్రం దీక్షను సమర్థించలేదు. ప్రజలు మాత్రం శ్రీరాములుకు మద్దతుగా సమ్మెలు, ప్రదర్శనలు జరిపారు.

ప్రభుత్వం మాత్రం రాష్ట్రం ఏర్పాటు దిశగా విస్పష్ట ప్రకటన చెయ్యలేదు. చివరికి 1952 డిసెంబర్‌ 15 అర్ధరాత్రి పొట్టి శ్రీరాములు, తన ఆశయసాధనలో ప్రాణాలర్పించి అమరజీవి అయ్యాడు. ఆగ్రహావేశులైన ప్రజలు హింసాత్మకచర్యలకు పాల్పడ్డారు. మద్రాసులో జరిగిన ఆయన అంతిమ యాత్రలో నినాదాలతో ప్రజలు ఆయన త్యాగనిరతిని కొనియాడారు. ఈ మహనీయుని జ్ఞాపకార్థం రాష్ట్రప్రభుత్వం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం స్థాపించింది.  నెల్లూరు జిల్లా పేరును 2008లో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మార్చారు. తెలుగు ప్రజల, వాసవి సంఘాల ఆకాంక్షల ఫలితంగా నవంబర్‌ 1నే ఆంధ్రప్రదేశ్‌ అవతరణ రెండో ఏడాది జయప్రదంగా జరుపుతున్నందుకు ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డికి అభినందనలు.
(నేడు రాష్ట్రావతరణ దినోత్సవం)
దింటకుర్తి వీర రాఘవ ఉదయ్‌ కుమార్‌
అధ్యక్షులు, వాసవీ విద్యార్థ్ధి ఫెడరేషన్‌ 

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు