అందరివాడు ప్రథమ పౌరుడు

24 Jul, 2021 12:48 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఒడిశాకు చెందిన స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. 1962లో ఒడిశా హైకోర్టులో న్యాయవాదిగా తన వృత్తిని ప్రారంభించారు. 1975లో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జేపీ చేపట్టిన ఉద్యమంలో భాగస్వామి అయ్యారు. ఐదుసార్లు ఒడిశా శాసనసభకు ఎన్నికై, నాలుగుసార్లు మంత్రిగా పనిచేశారు. 2000లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో తన ప్రత్యర్థిపై 96 వేల ఓట్ల తేడాతో విజయం సాధించి ఒడిశాలో మునుపటి రికార్డులు అన్నింటినీ తిరగరాశారు. 

రాష్ట్ర మంత్రిగా ఎమర్జెన్సీ అనంతరం నిత్యావసర వస్తువుల ధరలు మండిపోకుండా బ్లాక్‌ మార్కెట్‌ విక్రేతలపై కఠిన చర్యలు తీసుకున్నారు. రెవెన్యూ మంత్రిగా భూరికార్డుల కంప్యూటరీకరణ, రెవెన్యూ చట్టాల సరళీకరణ–క్రోడీకరణకు ప్రాధాన్యతనిచ్చారు. 1956 రెగ్యులేషన్‌–2ను సవరించడం ద్వారా అనధికార ఆక్రమణలో ఉన్న ఆదివాసీల భూమిని పునరుద్ధరించేలా చర్యలు తీసుకున్నారు. సహాయ, పునరావాస విధాన సృష్టికర్త హరిచందన్‌. కేబినెట్‌ సబ్‌కమిటీ చైర్మన్‌గా ఈ విధానానికి ఒక ఆకృతిని తెచ్చారు. అప్పటికి దేశంలో ఇదే అత్యుత్తమ సహాయ, పునరావాస పాలసీగా నిలిచింది. మిగులు భూములను విక్రయించాలన్న ప్రతిపాదనకు అప్పటి ఒడిశా రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలుపగా, దానిని తీవ్రంగా వ్యతిరేకించి ఆ నిర్ణయం నుంచి ప్రభుత్వం వెనకడుగు వేసేలా చేయడంలో హరిచందన్‌ విజయం సాధించారు. భూ యజమానిలా కాకుండా, ధర్మకర్తలా వ్యవహరించేలా ఆలోచనా విధానాన్ని మార్చగలిగారు. 

రాజకీయాల్లో క్షణం తీరిక లేకపోయినా తనకు ఇష్టమైన రచనా వ్యాసాంగాన్ని ఎప్పుడూ విడిచి పెట్టలేదు. 1817 పైక్‌ విప్లవ సారథి బుక్సీ జగ బంధుపై ఆయన రాసిన నాటకం ‘మహా సంగ్రామర్‌ మహానాయక్‌’ అత్యంత ప్రశంసలు పొందింది. మరుభతాష్, రానా ప్రతాప్, శేష్‌ ఝలక్, మేబార్‌ మహారాణి పద్మిని, అస్తా సిఖా రాశారు.  ‘సంగ్రామ్‌ సరి నహిన్‌’ హరిచందన్‌ ఆత్మ కథ. ప్రజా జీవితంలో ఆయన చేసిన పోరాటాన్ని ఇది వివరిస్తుంది.

రాష్ట్ర విభజన అనంతరం జూలై 24, 2019న ఆంధ్రప్రదేశ్‌ మొదటి గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ రెండేళ్లు రాష్ట్రమంతటా పర్యటించారు. షెడ్యూల్డ్‌ ప్రాంతాల పాలనాధికారిగా  విజయనగరం, కర్నూలు జిల్లాల్లోని గిరిజన ప్రాంతాలను సందర్శించి అక్కడి ఆదివాసీ సమూహాలతో సంభాషించారు. సామాన్యులు సైతం గవర్నర్‌ను కలుసుకునేందుకు వీలుగా రాజ్‌భవన్‌ తలుపులు ఎప్పుడూ తెరిచి ఉంటాయి. కోవిడ్‌–19 మహమ్మారి మొదటిదశలో వలస కార్మికులు పడుతున్న వెతలకు చలించి ప్రభుత్వం నుండి పలు చర్యలు తీసుకునేలా చేశారు. అలహాబాద్‌లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యాత్రికులు, పంజాబ్‌లో చిక్కుకున్న విద్యార్థులు సురక్షితంగా స్వస్థలాలకు చేరుకునేలా చేయడంలో గవర్నర్‌ అధికారులను సమన్వయ పరిచారు.

పర్యావరణ పరిరక్షణ, రక్తదానం అంశాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. ఈ సందేశ వ్యాప్తికి విద్యా సంస్థలను సందర్శించినప్పుడు మొక్కలను నాటడం, స్వచ్ఛంద రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలు తప్పనిసరిగా నిర్వ హించేలా చూస్తుంటారు. చిన్నారుల మధ్య చిన్నారిలా కలిసిపోయి వారితో సమయాన్ని గడిపేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. తన క్షేత్రస్థాయి పర్యటనలకు అధికారులు భారీ స్వాగత తోరణాలు ఏర్పాటు చేయడం, పెద్దఎత్తున పుష్పగుచ్ఛాలు అందించడం, రెడ్‌ కార్పెట్‌ వేయడం వంటివి గమనించి అతిగా ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేయొద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

కోవిడ్‌–19 కారణంగా క్షేత్ర సందర్శనలను చాలా వరకు తగ్గించినప్పటికి, ఎప్పటికప్పుడు రాష్ట్రంలోనూ, రాష్ట్రం వెలుపల వివిధ సంస్థలు నిర్వహించిన కార్యక్రమాలకు, విశ్వవిద్యాలయ సమావేశాలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా తన సందేశాన్ని వినిపిస్తున్నారు.

హరిచందన్‌ నిరాడంబర జీవితాన్ని కోరుకుంటారు. రాజ్‌భవన్‌ పచ్చిక బయళ్ళలో నడక, యోగా సాధనతో ఆయన దినచర్య మొదలవుతుంది. పుస్తకాలను చదివేందుకు ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తారు. నియమబద్ధమైన జీవనాన్ని గడిపే గవర్నర్‌ హరిచందన్‌ ఎందరికో ఆదర్శంగా, భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

– ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌
రాష్ట్ర అధికార భాషా సంఘం చైర్మన్‌

(ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా బిశ్వ భూషణ్‌ హరిచందన్‌ నేటితో రెండేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకోనున్నారు) 

మరిన్ని వార్తలు