సీమవాసుల గోడు వినరా?

25 Mar, 2022 12:08 IST|Sakshi

ప్రభుత్వం తలపెట్టిన మూడు రాజధానుల ఏర్పాటుకు అడుగడుగునా అవాంతరాలు ఏర్పడుతుండటంతో ఇక రాయలసీమకు న్యాయం జరగదా అనే అనుమానం సీమవాసుల్లో నెలకొంటున్నది. తెలంగాణను ఆదర్శంగా తీసుకొని రాయలసీమ ప్రత్యేక ఉద్యమం మాటా తరచుగా వినిపిస్తోంది. ఉన్న తెలుగు జాతి ఐక్యంగా సాగేందుకు అనువైన పరిస్థితులను, నమ్మకాన్ని కేవలం ప్రభుత్వమే కాక కొన్ని జిల్లాల కోస్తాంధ్ర సోదరులూ కలిగించాలి.  ఈ అసెంబ్లీ సమావేశాల సాక్షిగా సమగ్రంగా, వెనుకబడిన ప్రాంతానికి ప్రయోజనాలు కలిగే విధంగా కొత్త వికేంద్రీకరణ బిల్లును తక్షణమే అసెంబ్లీలో ప్రవేశ పెట్టాలి. వాటితోపాటు ఇతర రాయలసీమ అభివృద్ధి అంశాలపై కూడా అసెంబ్లీ సాక్షిగా విధాన నిర్ణయం తీసుకోవాలి.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని మూడు ఉప ప్రాంతాలలో మూడు పాలనా వ్యవస్థలు (శాసనసభ, సచివాలయం, న్యాయస్థానం) ఉండేలా తక్షణమే అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాలి. ఒక ప్రాంతంలో ఒక ప్రధాన వ్యవస్థ ఏర్పాటు చేస్తే అనుబంధంగా ఇతర వ్యవస్థలుండాలి. రాయలసీమలో రాజధాని కావాలనే ప్రజల ఆకాంక్షలను కాదని హైకోర్టు ఏర్పాటే అంతిమ ఉద్దేశం అయితే... కర్నూలులో హైకోర్టుతో పాటు సీమలోని వివిధ కేంద్రాలలో ఒక మినీ సెక్రటేరియట్, ఒక సెక్షన్‌ అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసేలా కొత్త వికేంద్రీకరణ చట్టంలో పేర్కొనాలి.

కృష్ణా యాజమాన్య బోర్డు పరిధిలో అనుమతించిన ప్రాజెక్టులుగా విభజన చట్టంలో పేర్కొన్న హంద్రీ–నీవా, గాలేరు–నగరి, తెలుగుగంగ, వెలిగొండ తదితర కరువుపీడిత ప్రాంత ప్రాజెక్టులతో పాటు, ఇప్పటికే అమలులో ఉన్న ముచ్చుమర్రి, గురు రాఘవేంద్ర, సిద్దాపురం ప్రాజెక్టులను చేర్చాలి. ఈ ప్రాజెక్టుల నిర్మాణాలు  పూర్తి చేసేందుకు ఈ బడ్జెట్‌ సెషన్‌లో నిధులు కేటాయించాలి. కృష్ణా యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయాలి. తుంగభద్ర సమాంతర కాలువ, గుండ్రేవుల, వేదవతి ప్రాజెక్ట్‌లు, సిద్దేశ్వరం అలుగు, రాయలసీమ ఎత్తి పోతల పథకం నిర్మాణానికి చర్యలు తీసుకోవాలి. 

విభజన చట్టంలో పేర్కొన్న వెనుకబడిన ప్రాంతాల ప్రత్యేక ప్యాకేజీని కోరాపుట్‌–బుందేల్‌ ఖండ్‌ తరహాలో రూ. 30 వేల కోట్లతో అమలు చేయాలి. గుంతకల్లులో రైల్వే జోన్‌ ఏర్పాటు చేయాలి. విభజన చట్టంలోని ఎయిమ్స్, అగ్రికల్చర్‌ యూనివర్సిటీలను రాయలసీమలో నెలకొల్పాలి. అనంతపురంలో సెంట్రల్‌ యూనివర్సిటీ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి. 

విభజన చట్టంలోని కడప ఉక్కు కర్మాగారం నిర్మాణం పూర్తి చేయాలి. ఇప్పటికే శ్రీశైలంలో ఉన్న తెలుగు విశ్వవిద్యాలయ చరిత్ర, పురావస్తుశాఖ క్యాంపస్‌కే యూనివర్సిటీ ప్రధాన కార్యాలయాన్నీ మార్చాలి. రాయలసీమ సాంస్కృతిక, చారిత్రక, సాహిత్య, కళారంగాల అభివృద్ధికీ, అధ్యయనానికీ ఒక ప్రత్యేక సంస్థను నెలకొల్పాలి. పరిశ్రమల స్థాపనలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఉపాధి అవకాశాలు కల్పించాలి. లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌ను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకు రావాలి. రాయలసీమ అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేసి స్వతంత్ర ప్రతిపత్తి కలిగించాలి. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా అదనంగా కర్నూలు జిల్లాలో ఆదోని జిల్లా, ప్రకాశం జిల్లాలో మార్కాపురం జిల్లాలు ఏర్పాటు చేయాలి. (క్లిక్‌: ఈ వర్గపు ఆగడాలకు అంతం లేదా?)

శ్రీ బాగ్‌ ఒప్పందం, శ్రీ కృష్ణ కమిటీ, శివరామన్‌ కమిటీ, జీయన్‌ రావు కమిటీ, బోస్టన్‌ కన్సల్టెన్సీ తదితర నివేదికలు వికేంద్రీకరణ విషయమై చేసిన సూచనలు పరిగణనలోకి తీసుకొని మూడు ప్రాంతాల సమాన అభివృద్ధికి తోడ్పడాలి. (క్లిక్‌: బాబు బ్రాండ్‌ రాజకీయాలు)
 

- డా. అప్పిరెడ్డి హరినాథరెడ్డి 
సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత

మరిన్ని వార్తలు