మరీ ఇంత రుసుమా.. ఉద్యోగాలకు అప్లై చేయాలా వద్దా?

5 May, 2022 12:49 IST|Sakshi

నిరుద్యోగులకు తీపి కబురంటూ తెలంగాణ ప్రభుత్వం అనేక ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయడం శుభపరిణామం. కానీ దరఖాస్తు రుసుమును భారీగా పెంచడంతో నిరుద్యోగులపై పిడుగుబడినట్లయింది. ముఖ్యంగా గ్రామీణ యువత ఎక్కువగా దరఖాస్తు చేసుకునే పోలీస్‌ ఉద్యోగాల దరఖాస్తు రుసుం పెరిగిపోవడం గ్రామీణ అభ్యర్థులు జీర్ణించుకోలేక పోతున్నారు.

ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన కానిస్టేబుల్, ఎస్‌ఐ  ఉద్యోగాలకు ఇచ్చిన నోటిఫికేషన్లన్నిటికీ స్పందిస్తూ ఒక బీసీ అభ్యర్థి దరఖాస్తు చేసుకోవాలంటే రూ. 8,800 ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది.  ఒక బీసీ నిరుద్యోగ అభ్యర్థి కానిస్టేబుల్‌ ఉద్యోగానికి రూ. 800, ఎస్‌ఐ ఉద్యోగానికి రూ. 1,000 చెల్లించాలి. ప్రస్తుత నోటిఫికేషన్ల ప్రకారం సివిల్‌ కానిస్టేబుల్, టెక్నికల్‌ కానిస్టేబుల్, ట్రాన్స్‌పోర్ట్‌ కానిస్టేబుల్, ప్రొహిబిషన్‌ కానిస్టేబుల్, సివిల్‌ ఎస్‌ఐ, టెక్నికల్‌ ఎస్‌ఐ పోస్టులకు దరఖాస్తు చేసు కోవడానికి ఒక బీసీ నిరుద్యోగ అభ్యర్థికి 8,800 రూపాయలు ఖర్చవు తున్నది. అందులో పీఎంటీ/పీఈటీ రూ. 900 తీసివేస్తే ఒక బీసీ నిరుద్యోగ అభ్యర్థి పోలీస్‌ కొలువులకు అన్నింటికీ దరఖాస్తు చేసుకోవాలి అంటే 7,900 రూపాయలు అవుతుంది. (క్లిక్: పుస్తకాలు దానం చేయండి!)

లక్షలాది నిరుద్యోగ యువత నుంచి ఇలా భారీ మొత్తంలో దరఖాస్తు రుసుం వసూలు చేయడం ఎంత వరకు న్యాయం? కోచింగ్‌ సెంటర్లు, హాస్టళ్లకూ లక్షల్లో ఖర్చవుతూనే ఉంది. కరోనాతో... చేయడానికి పనిలేక, ఆర్థికంగా చితికిపోయిన నిరుద్యోగ అభ్యర్థులూ, వారి తల్లిదండ్రులకూ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడం కూడా తలకు మించిన భారమైపోతోంది. దరఖాస్తు రుసుములకు భయపడే... అన్ని ఉద్యోగాలకూ అప్లై చేయాలా వద్దా అని నిరుద్యోగులు మీమాంసలో పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం దరఖాస్తు రుసుం రద్దుచేయడం సమంజసం. కాదంటే... వంద, రెండు వందల రూపాయలకు పరిమితం చేసి పోలీస్‌ ఉద్యోగ అభ్యర్థులను ఆదుకోవాలి.

– ముచ్కుర్‌ సుమన్‌ గౌడ్, సామాజిక కార్యకర్త

మరిన్ని వార్తలు