రాజ్యాంగస్ఫూర్తే విరుగుడు!

18 May, 2022 13:15 IST|Sakshi

ఇటీవల దేశంలోనూ, రాష్ట్రంలోనూ పరువు హత్యల పేరుతో వందలాది మంది యువతీ, యువకులను హత మారుస్తున్నారు. వర్ణం, కులం రెండూ  కల్పించబడినవే. మానవుల నుండి మానవులే ఆవిర్భవిస్తారని మానవ పరిణామ శాస్త్రం చెబుతోంది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఈ విషయం మీద అనంత పరిశోధన చేశారు. మానవ పుట్టుక మీదా, మానవ పరివర్తన మీదా ఆయన అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనా పత్రాలు సమర్పించారు. మనుస్మృతి నిర్మించిన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణ వ్యవస్థ కల్పితమైనదని రుజువు చేశారు. 1927 డిసెంబర్‌ 25వ తేదీ ‘మహద్‌ చెరువు’ పోరాటంలో భాగంగా మనుస్మృతిని దహనం చేశారు కూడా! ప్రత్యామ్నాయంగా, భారత రాజ్యాంగంలో కులం, మతం, ప్రాంతం, జాతి, భాషలకు సంబంధించి భేద భావం లేకుండా ఎవరు ఎవరినైనా వివాహం చేసుకునే అవకాశం కల్పించారు. 

అయితే భారత రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ, రిజర్వేషన్లు వంటివాటిని అనుభవిస్తున్నవారే తమ పిల్లలు కులాంతర, మతాంతర వివాహాలు చేసుకుంటే సహించలేక వారిని చంపివేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దీనికి కారణం మతవాదులు, కుల వాదులు రాజ్యాంగ సంస్కృతికి భిన్నంగా చేసే ప్రబోధమే కారణం. మొదటి భారత ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ కుమార్తె ఇందిరా ప్రియదర్శిని పారశీకుడైన ఫిరోజ్‌ను ప్రేమించి పెళ్లాడింది. కరమ్‌ చంద్‌ గాంధీ వారి వివాహాన్ని నిర్వహించారు. అయితే నెహ్రూ, ఇందిరాగాంధీ పాలనల్లో గానీ, ఆ తర్వాత వచ్చిన పాలకుల కాలంలో కానీ  కులాంతర, మతాంతర వివాహాలను ప్రోత్సహించలేదు. భారత దేశాన్ని పాలించిన రాజ వంశీకులు మౌర్యులు, మొగలాయీలు, గుప్తులు – అందరూ వర్ణాంతర వివాహితులే. అలాగే హిందూ మతానికి పునాదులు వేసిన వైదిక రుషులు వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, అగస్త్యుడు వంటి వారందరూ వర్ణాంతర వివాహితులే. అయితే వారు సమాజంలో కులాంతర, మతాంతర వివాహాలను ప్రోత్సహించకపోవడం గమనార్హం.

ప్రస్తుత కాలంలో సినిమా, పారిశ్రామిక, కళా, క్రీడా రంగాలలో ఉన్నవారు వర్ణాంతరులైనా, కులాంతరులైనా అభినందనీయులే అవుతున్నారు. భారతీయ సినిమా మార్కెట్‌ విస్తరణ కోసం బ్రాహ్మణ నాయకి, ఒక ముస్లిం హీరోల కెమిస్ట్రీని పెద్ద పెద్ద పోస్టర్లు ఆవిష్కరించి హిందూ, ముస్లిం వర్గాలను థియేటర్‌కు తేగలుగుతున్నారు. అదే వాస్తవ జీవితంలో హిందూ, ముస్లిం వివాహ సందర్భం వస్తే దాడులు జరుగుతున్నాయి. ఇటీవల ముస్లిం, దళిత కులాల వాళ్ళు ప్రేమ వివాహం చేసుకుంటే దళిత యువకుడిని హత్య జేశారు. భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి విద్యార్జనావకాశం వల్ల ఈ 70 ఏళ్లలో చదువుకుని అన్ని రంగాల్లో పైకి వస్తున్న దళితులు కులాంతర, మతాంతర వివాహాలు చేసుకునే స్థాయికి వస్తున్నారు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పరువు హత్యలు పెరగడానికి... దళిత, బహుజన, మైనారిటీ వర్గాల్లో పెరుగుతున్న రాజ్యాంగ స్ఫూర్తి; వర్ణ, కులాధిపత్య భావజాలంలో కొట్టు మిట్టాడుతున్న వారి మూఢత్వాల మధ్య తలెత్తుతున్న ఘర్షణే కారణం.

ఇప్పటికీ రాజ్యమేలుతున్న మనుస్మృతికి వ్యతిరేకంగా భారతదేశం సెక్యులర్‌గా ఎదగాలంటే బౌద్ధ జీవన వ్యవస్థను, భారత రాజ్యాంగ స్ఫూర్తిని పెంపొందించాలి. కరుణ, ప్రేమ, ప్రజ్ఞ అనే సూత్రాలను ప్రజల మెదళ్లలోకి వెళ్ళేటట్లు చూడాలి. రాజకీయమంటే ఆధిపత్యం కాదు. ప్రజాస్వామ్య లౌకిక సామ్యవాద భావజాల ఆచరణ అని ప్రతి ఒక్కరూ తెల్సుకోవాల్సి ఉంది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ తమిళనాడులో కులాంతర వివాహితులకు పది లక్షల నగదు కానుక, ఉద్యోగావకాశం, భూవసతి, నివాస వసతి కల్పిస్తున్నారు. దీని కొరకు చట్టం తెచ్చారు. కేరళలో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కులాంతర వివాహితులకు రక్షణ గృహాలు ఏర్పాటు చేశారు. దీని వల్ల ఆ రెండు రాష్ట్రాల్లో కులాంతర, మతాంతర వివాహాలు విస్తరిస్తున్నాయి. అన్ని రాష్ట్రాల్లో కూడా రాజ్యాంగ స్పూర్తితో కులాంతర, మతాంతర వివాహాల వేదికలను ప్రభుత్వమే నిర్వహించవలసిన బాధ్యత ఉంది. అంతే కాకుండా దీని కొరకు ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి.

పరువు హత్యలకు పాల్పడిన వారిని ప్రత్యేక కోర్టులో విచారించి మరణ శిక్షను విధించడమే కాకుండా వారి ఆస్తులను జప్తు చేయాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా ప్రభుత్వాలు కూడా రాజ్యాంగ స్ఫూర్తితో కుల నిర్మూలనా భావజాల ఆచరణ కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో చేపట్టాలి. (చదవండి: నల్ల చట్టానికి అమృతోత్సవాలా?)

- డా. కత్తి పద్మారావు

మరిన్ని వార్తలు