మానవతా శిఖరం మహాత్ముడు

2 Oct, 2021 00:43 IST|Sakshi

సందర్భం

నేడు ప్రపంచంలో ఎక్కడ చూసినా ఘర్షణ వాతావర ణమే. కులాలు, మతాలు, జాతి వైరాలతో హింస తాండవిస్తోంది. గాంధీజీ భావాలను, సాధించిన విజయాల్ని తలచుకుంటే మానవజాతి భవితపై కమ్ముతున్న కారు చీకట్ల మధ్య జాతిపిత ఒక కాంతికిరణం అనిపిస్తుంది. గాంధీజీ పరిపూర్ణ వ్యక్తి. సత్యాన్వేషణలో తన జీవితాన్ని ప్రయోగశాలగా మలుచుకున్న గొప్ప శక్తి. స్వార్థం, అర్థంలేని వస్తు వ్యామోహం... ఇలా ఆధునిక సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్య లకు తన ఆత్మకథలో పరిష్కారాలు చూపారు. విద్యార్హతలు, హోదా మనిషిని గౌరవించడానికి కొలమానాలు కావంటారు. ఎదుటి మనిషిని ఆత్మ రూపంగా, సత్య రూపంగా చూడమంటారు. ఆ ఆధ్యాత్మిక, నైతిక దృష్టికోణాన్ని అలవర్చుకోగలి గితే మానవ సంబంధాలతో ముడిపడిన తొంభై శాతం సమస్యలు పరిష్కారమైనట్లేనని గాంధీ మార్గం సూచిస్తుంది.

ఎంత చదివినా, ఎంత సంపాదించినా ఆధు నిక జీవితం సమస్యాత్మకమే అవుతోంది. ఏదో అసంతృప్తి, ఆవేదన కనిపిస్తున్నాయి. వాస్తవానికి గాంధీ సైతం ఒక దశలో అలాంటి ఆలోచనల్లో పడిన వారే. అప్పుడే సత్యశోధన అంకురించింది. తాను వెళుతున్న మార్గం ఎంత తప్పో గ్రహించారు. రెండు గదుల ఇంటి నుండి ఒక గదికి మారారు. హోటల్‌ భోజనం నుండి స్వయంపాకంలోకి వచ్చారు. సరళ జీవితం సమయాన్ని ఆదా చేసింది. అప్పుడే తన జీవితం సత్యమైనదన్న గ్రహింపు కలిగి ఆత్మ సంతృప్తి కలిగిందంటారు గాంధీ. ఆయన దృష్టిలో సత్యం అంటే మాటకు సంబం ధించింది మాత్రమే కాదు; అది ఆలోచన, ఆచరణ లతో ముడిపడింది కూడా.

గాంధీ మార్గంలో మరో అడుగు పశ్చాత్తాపం. నీటితో బురదను కడుక్కున్నట్లు పశ్చాత్తాపంతో పాపాల్నీ, లోపాల్నీ శుభ్రపరచుకోవచ్చు అని నిరూపించారు. అపరాధం చేశానని భావించిన ప్రతిసారీ ఉత్తరాల రూపంలో క్షమాపణ కోరేవారు. అలాగే ఉపవాసాన్ని ఒక బలమైన ప్రాయశ్చిత్త మార్గంగా భావించారు. గాంధీ మార్గంలో మరో మజిలీ అహింస. సత్యం అనే గమ్యాన్ని చేరుకోవ డానికి అహింసే ప్రధాన మార్గం అని భావించారు మహాత్ముడు. సమస్యలు, సంక్షోభాలు ఎన్ని వచ్చినా ఆ మార్గాన్ని వీడలేదు. సత్యసంధత వల్ల క్రోధం, స్వార్థం, ద్వేషం సమసిపోతాయి. రాగ ద్వేషాలు ఉన్న వ్యక్తి ఎంత మంచివాడైనా శుద్ధ సత్యాన్ని దర్శించలేడని చెబుతారు. స్వాతంత్య్ర సమరం అహింసా మార్గంలో జరిగింది కాబట్టే శత్రువులుగా ఉండాల్సిన బ్రిటిష్‌వారు సైతం గాంధీజీని మహనీయుడిగా భావించారు.

గాంధీజీ అన్ని మతాలకు సమాన స్థానం ఇచ్చారు. కేవలం మత పాండిత్యం వ్యర్థం అన్నారు. ప్రార్థన అంటే కోరికలు కోరడం కాదు. అది భగవంతుడిపై ఆత్మకు ఉండే గాఢమైన అను రక్తి. తన సమస్తం దైవానిదేనని భావించి, ఆ భావం మీదే మనస్సు కేంద్రీకరించడం. దైవానికీ, మానవ రూపంలో కనిపించే మాధవుడికీ సేవ చేయడానికి తన జీవి తాన్ని అంకితం చేసిన దివ్య శక్తిమయుడు. విద్యా విధానం, అంట రాని తనం, హరిజనో ద్ధరణ, ఖద్దరు విని యోగం, ఉపవాస దీక్ష... ఇలా ప్రతి అంశంపైనా గాంధీజీకి స్పష్టమైన అభిప్రాయాలు ఉండేవి. స్వతంత్ర భారతంలో ప్రజాప్రతినిధులు ఎలా ఉండాలన్న అంశం పైనా ప్రత్యేక అభిప్రాయాలు ఉండేవి. గాంధీజీ అంతర్జాతీయవాది. ప్రపంచ శ్రేయంలోనే దేశ శ్రేయం ఉందని భావించారు. గాంధీజీ సూచించిన విశ్వ మానవతా వాదనను ఆచరిస్తే – సరిహద్దు గొడవలు, జాతి వైషమ్యాలు, మతకలహాలు కనుమరుగవుతాయి. జగమంతా శాంతిమయం అవుతుంది. (నేడు గాంధీ జయంతి)               


డా. అశోక్‌ పరికిపండ్ల 

వ్యాసకర్త గాంధీ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ తెలంగాణ కన్వీనర్‌ ‘ 99893 10141

మరిన్ని వార్తలు