సరి‘హద్దు’లు సామరస్యమేనా?

2 Aug, 2021 13:58 IST|Sakshi

అస్సాం, మిజోరం మధ్య సరిహద్దు సమస్య చిలికిచిలికి గాలి వానలా మారింది. ఏకంగా కాల్పుల వరకు వెళ్లి అస్సాం పోలీసులు, సామాన్యులను బలితీసుకుంది. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఎప్పటి నుంచో సరిహద్దు వివాదాలు ఉన్నాయి. వివాదాలను పరిష్కరించాల్సిన కేంద్రం చోద్యం చూస్తుండడంపై విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఏడేళ్ల క్రితం ఏర్పడ్డ తెలంగాణకూ సరిహద్దున ఉన్న పలు రాష్ట్రాల నుంచి వివాదాలు ఉన్నాయి. 

తెలంగాణ, కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో పలుమార్లు వివాదాలు జరిగాయి. వికారాబాద్‌లో అంతర్రాష్ట్ర సరిహద్దు గ్రామాలైన బషీరాబాద్‌ మండలం క్యాద్గిరా, కర్ణాటకలోని సేడం తాలూకా పోతంగల్‌ మధ్య కాగ్నా నది ప్రవహిస్తోంది. నదీ తీరంలో ఇసుక తవ్వకాల విషయమై ఇరు రాష్ట్రాల మధ్య పలుమార్లు వివాదాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో 2018లో ఇరు రాష్ట్రాలకు చెందిన సరిహద్దు జిల్లాల కలెక్టర్లు సర్వే నిర్వహించి హద్దులు నిర్ణయించారు. 

తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దుల్లోనైతే విచిత్ర పరిస్థి తులు నెలకొని ఉన్నాయి. కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కెరమెరి మండలానికి చెందిన 14 గ్రామాలను ఇప్పటికీ రెండు రాష్ట్రాల ప్రభుత్వం తమ పరిధిలోనివే నని చెబుతూ ఉంటాయి. 1983 ఫిబ్రవరిలో రెండు రాష్ట్రాల అధికారులు ఈ గ్రామాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చెందినవని నిర్ణయం తీసుకొని, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో చేర్చారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా రాజుర ఎమ్మెల్యే వామనరావు చాటప్‌ మహారాష్ట్ర శాసనసభలో ఈ అంశంపై మాట్లాడారు. ఈ గ్రామాలపై నిర్ణయం తీసుకునే హక్కు కేంద్రానికి మాత్రమే ఉంటుందని, మరాఠి మాట్లాడేవారు ఎక్కువగా ఉన్నందున మహారాష్ట్రలోనే ఉంచాలని డిమాండ్‌ చేశారు. 

ఆ తర్వాత ఈ గ్రామాలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి ఇస్తూ జారీ చేసిన కేబినెట్‌ ఉత్తర్వులను రద్దు చేస్తూ, 1996లో బీజేపీ –శివసేన ప్రభుత్వం కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. మహారాష్ట్ర ప్రభుత్వానికి ఈ గ్రామాలపై హక్కు లేదంటూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. దీంతో మహా రాష్ట్ర సుప్రీంకోర్టుకు వెళ్లింది. సరిహద్దు సంగతి తేల్చేవరకూ రెండు రాష్ట్రాలూ ఈ గ్రామాల ప్రజల బాగోగులు చూసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. 

అస్సాం–మిజోరం విషయంలో కేంద్ర ప్రభుత్వం సమస్యను ఆయా రాష్ట్రాలే పరిష్కరించుకోవాలని, కేవలం తాము సహాయకారిగా మాత్రమే పనిచేస్తామని లోక్‌సభలో ప్రకటించింది. ఇది సరైంది కాదు. తెలంగాణ ప్రభుత్వం సరిహద్దున ఉన్న రాష్ట్రాలతో సరిహద్దు సమస్యల పరిష్కారానికి అధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలి. అన్ని సమస్యలకూ పూర్తిస్థాయి పరిష్కారం దొరకక పోవచ్చు. ప్రయత్నలోపం జరగకుండా చూసుకోవాలి. 


- ఫిరోజ్‌ ఖాన్‌ 

వ్యాసకర్త, సీనియర్‌ జర్నలిస్ట్‌ 

మరిన్ని వార్తలు