స్వతంత్ర భారత సందేశం

15 Aug, 2022 00:20 IST|Sakshi

కామెంట్‌

స్వతంత్ర భారతావనికి నేటితో డెబ్భై అయిదు వసంతాలు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో దేశ సాఫల్య వైఫల్యాలు అనేకం. కులం, మతం, జాతి, భాష లాంటి లోటుపాట్లు బోలెడున్నా, ఈ 75 ఏళ్లలో గణనీయమైన విజయాల విషయంలో మనం రొమ్ము విరుచుకోవచ్చు. కానీ, చేసిన పొరపాట్లతో పాటు ఉద్దేశపూర్వకమైన తప్పులు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉన్నాయి. ఉన్న సమస్యలకు మరికొన్ని చేర్చుకున్నాం. గత ఎనిమిదేళ్లుగా వ్యతిరేక స్వరాలను ఆలకించే సహనం మనలో చచ్చిపోయింది. తోటి పౌరులైన ముస్లిమ్‌లను పక్షపాత దృష్టితో చూడడం మొదలుపెట్టాం. ఇవన్నీ సిగ్గుతో తలదించుకునేలా చేసేవే! ఇవన్నీ సమీక్షించుకొని, సరిదిద్దుకొని, సమైక్యంగా ముందుకు సాగాల్సిన సందర్భం ఇది. 

మన భారతదేశం స్వతంత్రమై నేటితో 75 ఏళ్ళు పూర్తవుతున్నాయి. ఒక దేశంగా మనం సాధించిన విజయాలేమిటి? చవిచూసిన వైఫల్యాలేమిటి? అని సమీక్షించుకునేందుకు తగిన సందర్భం ఇది. అలాగే, ఇదే సందర్భంలో మనం ఏ రకమైన దేశాన్ని నిర్మించుకున్నామన్నదీ ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ప్రశ్నలకు ఏవో స్పష్టమైన, కచ్చితమైన సమాధానాలు లభిస్తాయని కాదు. ఒక్కొక్కరి మదిలో ఒక్కో సమాధానం కచ్చితంగా ఉంటుంది. వారికి అదే సరైనదని కూడా అనిపిస్తుంది. అదే స్ఫూర్తితో నా దృష్టిలో మన దేశ సాఫల్య వైఫల్యాలను వివరించాలని అనుకుంటున్నా. ఒకవేళ దానివల్ల ప్రత్యేకించి ప్రయోజనమేదీ లేకున్నా... అది మీలో మరిన్ని ఆలోచనలు రేకెత్తించవచ్చు. 

కులం, మతం, జాతి, భాష లాంటి లోటుపాట్లు బోలెడున్నప్పటికీ, ఈ 75 ఏళ్లలో మన సాధనల విషయంలో మనం కొంచెం గర్వంగా రొమ్ము విరుచుకోవచ్చు. ఈ తేడాలు దేశాన్ని నాశనం చేస్తాయని 1960లలో పాశ్చాత్యులు కూడా విమర్శించారు. అయినా సరే... మనం ఒక్కతాటిపై నిలిచాం. అన్నింటినీ తట్టుకుని మనగలిగాం. అత్యవసర పరిస్థితులను అధిగమించి, దేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లింది. ఎన్నికలు సక్రమంగా జరుపుకోగలిగాం. ప్రభుత్వాలు మారాయి. ప్రజాగ్రహం శక్తిమంతమైన పరిపాలనా వ్యవస్థలను కూడా నియంత్రణలో ఉంచగలిగింది. పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ల మాదిరిగా దేశం సైనిక పాలనను అనుభవించాల్సిన అవసరం రాలేదు. 

అక్షరాస్యత, ఆయుః ప్రమాణాల విషయానికి వస్తే 1947కూ, ప్రస్తుతానికీ అస్సలు సారూప్యతే లేదు. అక్షరాస్యత అప్పటి కన్నా నాలుగు రెట్లు పెరిగింది. అలాగే, ఆయుః ప్రమాణం రెట్టింపు అయ్యింది. సాధించాల్సింది ఇంకా ఎంతో ఉన్నా... సాధించింది తక్కువేమీ కాదని స్పష్టంగా చెప్పవచ్చు. తిండిగింజల కోసం అంగలార్చిన దేశం ఈ రోజు వాటిని ఎగుమతి చేసే దశకు చేరిందంటే అంతకంటే గొప్ప విజయం ఇంకోటి ఉండదు. నౌకల్లో దిగుమతి అయితేనే నాలుగు వేళ్లూ నోట్లోకి వెళ్లే పరిస్థితి ఉండేది అప్పట్లో! ఇప్పుడు ఆహార ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రగామి మన దేశం. పాల ఉత్పత్తిలో మనది అగ్రస్థానం. బియ్యం, గోదుమల ఉత్పత్తిలో రెండో స్థానం. బియ్యం ఎగుమతి చేసే దేశాల్లోనూ తొలిస్థానం మనదే! మన అంతరిక్ష పరిశోధనా కార్యక్రమం, పదమూడు మంది ప్రపంచస్థాయి సీఈవోలను అందించిన మన ఐఐటీలు, ప్రపంచ ప్రేక్షకాదరణ కలిగిన క్రికెట్‌ టోర్నమెంట్లు, సినిమా పరిశ్రమ... ఇలాంటివన్నీ తృతీయ ప్రపంచదేశాల్లో మనల్ని ప్రత్యేకంగా నిలిపే అంశాలు. ఇంతటి వైవిధ్యభరితమైన దేశం మరొకటి ఉండదు. 

దురదృష్టవశాత్తూ మనం చేసిన పొరపాట్లు, మన లోటుపాట్లు, చివరకు ఉద్దేశపూర్వకమైన తప్పులు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉన్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, వరుసగా అనేక ప్రభుత్వాలు దేశ ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించడంలో విఫలమయ్యాయని స్పష్టంగా చెప్పవచ్చు. భారీ నీటి ప్రాజెక్టులు కట్టుకున్నా... ఉక్కు కర్మాగారాలను నిర్మించినా... సోషలిజానికి ఇచ్చిన ప్రాధానంతో ఒక రేటు అభివృద్ధిలోనే చిక్కుబడి, దేశ ప్రజల్లో పారిశ్రామిక స్ఫూర్తిని ఉద్దీపింపజేయలేకపోయింది. 

1984, 2002లలో జరిగిన సంఘటనలు అహింసా వాదులమని చెప్పుకొనే మన వాదనలోని డొల్లతనాన్ని ఎత్తి చూపుతాయి. చైనా, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్‌లపై ఆర్థిక ఆంక్షలు ఉన్నా 1947 నాటికి వాటి జాతీయ ఆదాయం, మన దేశ జాతీయ ఆదాయం దాదాపుగా ఒకే స్థాయిలో ఉండేవి. డెబ్భై అయిదేళ్ళ తరువాత ఒక్కసారి ఈ దేశాల ఆదాయాలను భారత్‌తో పోల్చి చూసినప్పుడు మనం ఎంతో వెనుకబడ్డ విషయం స్పష్టమవుతుంది. 1990లో ఆర్థిక సంస్కరణలు ఓ మూడు దశాబ్దాల ముందే ప్రారంభమై ఉంటే భారత్‌ పరిస్థితి ఇంకోలా ఉండేది. 

అయితే ఏమంటారు అని అడిగితే ఒక సలహా ఇస్తా. భారతదేశం ఎంతో సాధించేసిందని మాత్రమే గట్టిగా నమ్ముతూ... ఎన్నిసార్లు దారితప్పామో మరచిపోతే అది అవివేకమే అవుతుంది. పచ్చిగా చెప్పాలంటే మనం ఎంత సాధించామో, అంతేస్థాయిలో తప్పటడుగులూ వేశాము. అలాగైతే మనమిప్పుడు ఏ రకమైన దేశంగా అవతరించామన్న ప్రశ్న వస్తుంది. పాత సమస్యలు ఇప్పటికీ చాలానే వెంటాడుతున్నాయి. దళితులు, ఆదివాసీలు ఇప్పటికీ అత్యంత అణగారిన వర్గాలుగానే కొనసాగుతున్నారు. వారి కన్నీళ్ళు తుడవడంలో విఫలమయ్యాం. ‘అస్పశ్యత’ను చట్టం ద్వారా నిషేధించినా... సమాజంలో అది పూర్తిగా తుడిచిపెట్టుకుపోలేదు. ఆకలి, కరవు వంటివి గత చరిత్రే కావచ్చు కానీ... దేశ జనాభాలో దాదాపు 25 శాతం మంది ఇప్పటికీ దారిద్య్రరేఖకు దిగువనే ఉన్నారు. వాస్తవం ఏమిటంటే... పదేళ్లుగా పేదరికం స్థాయి ఏమిటన్నది కూడా తెలుసుకోవడం మానివేశాం మనం. 

ఉన్న సమస్యలకు మరికొన్ని చేర్చుకున్నాం కూడా! ఎనిమిదేళ్లుగా వ్యతిరేక స్వరాలను ఆలకించే సహనం చచ్చిపోయింది మనలో! మన పోకడల్లో ఆధిపత్యవాదన ఎక్కువైంది. తోటి పౌరులైన ముస్లిమ్‌లను పక్షపాత దృష్టితో చూడడం మొదలుపెట్టాం. జనహనన బెదిరింపులు ఇప్పుడు బహిరంగంగానే జరిగిపోతున్నా ప్రభుత్వం చెవులు మూసుకుని ఉండేందుకే మొగ్గు చూపుతోంది. ఇవన్నీ 1940, ’50లలో ఊహించను కూడా ఊహించలేము. ఇవన్నీ మనల్ని సిగ్గుతో తలదించుకునేలా చేసేవే! కానీ కొంతమంది ఇలాంటివి కొన్ని ఉన్నాయని కూడా ఒప్పుకోరు. 

సరే... మరి స్వతంత్ర భారతావని 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న ఈ రోజున మనం దేన్ని నొక్కి చెబుదాం? మన ఘనతల్ని మరోసారి నెమరేసుకుంటాం. తప్పులేదు. అయితే గట్టిగా చెప్పుకోలేకపోయినా, చేసిన తప్పులను కూడా ఒక్కసారి మననం చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఈ తప్పులన్నీ మనం నిర్దేశించుకున్న విలువలు, ఆర్థిక సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకోకపోవడం వల్ల జరిగినవే! ఇంకోలా చెప్పాలంటే మనం రాసుకున్న రాజ్యాంగానికి కట్టుబడి ఉండకపోవడం వల్ల జరిగినవే! అందుకే ప్రమాణపూర్తిగా ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలి! ఈ స్వతంత్ర భారత ఉత్సవాల సందర్భంగా మనం చేయాల్సింది అదే!


కరణ్‌ థాపర్‌ 
వ్యాసకర్త ప్రసిద్ధ పాత్రికేయులు  

మరిన్ని వార్తలు