Peddavadugur: గాంధీజీ మెచ్చిన ఊరు

20 Aug, 2022 11:40 IST|Sakshi
గుత్తి రైల్వేస్టేషన్‌లో దిగి బయటికి వస్తున్న గాంధీజీ

అనంతపురం జిల్లా గుత్తికి 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘పెద్ద వడుగూరు’ గ్రామం స్వాతంత్య్ర ఉద్యమంలో గొప్ప పాత్ర పోషించింది.  ఆ ఊళ్లో గొప్ప పారిశ్రామికవేత్త కె. చిన్నారప రెడ్డి. ఎన్నో ఆదర్శ భావాలు కలిగినవాడు. ఆయన పనిపై మద్రాస్‌ వెళుతూ ఉండేవారు. 1934లో ఒకరోజు ఆయన మద్రాసు మెరీనా బీచ్‌లో మహాత్మాగాంధీ ఉపన్యాసం విన్నారు. ఆ రోజు గాంధీ ఉపన్యసిస్తూ స్వాతంత్ర పోరాటానికి నిధులు కొరతగా ఉన్నాయనీ, దాతలు సహాయం చేయాలనీ విజ్ఞప్తి చేశారు. ఆ మాటలు నారపరెడ్డిని ఆలోచనలో పడవేశాయి. తమ ఊరికి రావాలని గాంధీజీని సంప్రదించారు. స్వాతంత్రోద్య మానికి రూ. 12 వేల నిధి ఇస్తే వస్తానని హామీ ఇచ్చారు. అన్నట్టుగానే బాపు 1934 సెప్టెంబర్‌ 21న మద్రాసు నుండి రైలులో ఉదయం 7 గంటలకు గుత్తి రైల్వేస్టేషన్లో దిగారు. ప్రజలు పెద వడుగూరుకు ఘన స్వాగతం పలికారు. 

చిన్నారప రెడ్డే గాంధీకి వసతి చేకూర్చారు. తిరుపతిరావు అనే వ్యక్తి గాంధీజీని తన భుజస్కంధాలపై ఎత్తుకొని వేదికపైకి చేర్చాడు. హిందీ పండిట్‌ సత్యనారాయణ... గాంధీ ప్రసంగాన్ని తెలుగులోకి అనువదించారు. నిధులు అందించి స్వాతంత్ర పోరాటాన్ని విజయవంతం చేయాలని అక్కడ చేరిన ప్రజలను కోరారు గాంధీ. అందరూ కలిసి దాదాపు రూ. 27 వేలు ఇచ్చారు. సభాస్థలికి 11 కిలోమీటర్ల దూరం నుంచి విచ్చేసిన భూస్వామి హంపమ్మ రూ. 1,116 అంద జేశారు. ఆమె అంతటితో ఆగకుండా మరో అరగంట గడుస్తుండగా తన ఒంటిపై ఉన్న బంగారు నగలన్నీ విరాళంగా ఇచ్చేశారు. అలా ఒకరికొకరు పోటీలు పడుతూ దాదాపు 5 కేజీల బంగారాన్ని గాంధీకి ఇచ్చారు. ఈ ఊరిని కేంద్రంగా చేసుకుని గాంధీ అనేక గ్రామాలు సందర్శించారు. ఉరవకొండ, హిందూపురం, కదిరి సమావేశాల్లో కూడా ప్రసంగించారు. రాత్రి అయ్యే సరికి తిరిగి పెద్ద వడుగూరులోని తన విడిది గృహానికి చేరుకునేవారు. ఈ నాలుగు రోజులూ గాంధీ చిన్నారప రెడ్డి కారులోనే తిరిగేవారు. ఆఖరు రోజున చిన్నారప రెడ్డి తనకున్న 32 ఎకరాల పొలాన్ని, తన కారును కూడా విరాళంగా ప్రకటించి గొప్ప మనసును చాటుకున్నారు. గాంధీజీని గ్రామానికి పిలవద్దని కూడా అప్పట్లో బ్రిటిష్‌వాళ్లు ఆయనను బెదిరించారు. అయినా ఆయన భయపడకుండా ధైర్యంగా నిలబడి తన నిర్ణయాన్ని అమలుపరిచారు. 

ఇక్కడ  ఇల్లూరి కేశమ్మ అనే మహిళను కూడా మనం స్మరించుకోవాలి. ఇల్లూరు కేశమ్మ పోలీసుల బెదిరింపులకు భయపడకుండా గ్రామ గ్రామం తిరిగి, గాంధీ సభలకు రావాల్సిందిగా వేసిన కరపత్రాలు పంచింది. ఆమెను ఒకసారి అరెస్టు కూడా చేశారు. అయినా జడవక విడుదల కాగానే తిరిగి ప్రచారం మొదలు పెట్టింది. గాంధీ వెంట నారాయణమ్మ, సుభద్రమ్మ అనే మహిళలు సైతం 4 రోజులు తిరిగారు. ఆరోజు గాంధీ సభకు తోరణాలు కట్టి, అలంకరణ చేసి అందరికీ మంచినీళ్లు అందించిన వెంకటరెడ్డి వయసు నేడు 110 ఏళ్లు. ఆ గ్రామానికి 3 దశాబ్దాలు సర్పంచ్‌గా సేవలందించిన శరభా రెడ్డి కూడా ఆ కాలంలో గాంధీకి రూ. 1,116 విరాళంగా ఇచ్చారు. ఆయన కొడుకు సూర్యనారాయణరెడ్డి (88 ఏళ్ళు)... గాంధీ తమ ఊరికి వచ్చినపుడు తాను చిన్న పిల్లవాడిననీ, అప్పటి విశేషాలు ఎన్నో తన మనసులో దాగివున్నాయనీ పూస గుచ్చినట్లు వివరించారు. 1947 ఆగస్టు 15న గ్రామమంతా పండుగ చేసుకున్నామనీ, అందరికీ పిప్పరమెంట్లు, బోరుగులు పంచామనీ చెప్పుకొచ్చారు. గాంధీజీ పెద వడుగూరును ప్రశంసిస్తూ తన డైరీలో ప్రత్యేకంగా రాసుకున్నారనీ ఆయన అన్నారు.

స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న ఆనాటి కోట్లాదిమందిని స్మరిస్తూ, జీవించివున్న స్వాతంత్య్ర సమరయోధులకు పాదాభివందనాలు తెలియజేద్దాం. (క్లిక్: ఉద్యమ వారసత్వమే ఊపిరి)


- డాక్టర్‌ సమ్మెట విజయ్‌కుమార్‌ 
సామాజిక శాస్త్రవేత్త

మరిన్ని వార్తలు