ట్రిబ్యునల్‌ రద్దుతో సినీ నిర్మాతలకు చిక్కులే 

13 May, 2021 01:08 IST|Sakshi

సందర్భం

గప్‌చుప్‌గా కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్‌ 4న కొన్ని అప్పిలేట్‌ ట్రిబ్యునళ్లను రద్దు చేసింది. అందులో సినిమా సెన్సార్‌ బోర్డుకు చెందిన ఫిలిం సర్టిఫికేషన్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ ఒకటి. సినిమాటోగ్రాఫ్‌ చట్టాన్ని సవరిస్తూ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ స్థానంలో హైకోర్టును చేర్చారు. దేశంలో ఇన్ని హైకోర్టులు ఉన్నపుడు ప్రత్యేకంగా ఒక్కో విభాగానికి మళ్ళీ ట్రిబ్యునళ్లు ఎందుకని కేంద్రం ప్రశ్న. వీటిని తొలగించడం వల్ల సత్వరన్యాయం దూరమవడంతో పాటు కోర్టు ఖర్చులు మోయవలసి వస్తుందని సినీవర్గాలు అంటున్నాయి.
అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ అంటే ఒక కోర్టులాంటిదే, అయితే అది ప్రత్యేక విషయానికే పరిమితమై పనిచేస్తుంది. దేశంలో ఆదాయపు పన్ను, జీఎస్టీ, విద్యుత్తు, సైన్యం, సైబర్‌ నేరాలు ఇలా చాలా విభాగాలకు సొంత ట్రిబ్యునళ్లు ఉన్నాయి. వాటికి సంబంధించిన వ్యాజ్యాలపై కోర్టుకు వెళ్లనవసరం లేదు. ట్రిబ్యునల్‌కు ఒక రిటైర్డ్‌ హైకోర్టు లేదా సుప్రీంకోర్టు జడ్జి చైర్మన్‌గా మరి కొందరు సభ్యులు ఉంటారు. ఏ ఖర్చూ లేకుండా వారి ముందుకు వచ్చిన పిటిషన్‌కు తుది తీర్పు చెబుతారు.

ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆర్థిక బిల్లు 2017లో భాగంగా క్రమబద్ధీకరణ పేరిట దేశంలో ఉన్న 26 ట్రిబ్యునళ్లను 19కు కుదించింది లేదా తగ్గించింది. మళ్ళీ ఈసారి వివిధ చట్టాలను సవరిస్తూ వాటికి అనుబంధంగా ఉన్న ఐదు చిన్న కోర్టులను రద్దు చేసింది. వీటిలో సినిమాటోగ్రాఫ్‌ చట్టం 1952, కస్టమ్స్‌ చట్టం 1962, ఎయిర్‌ పోర్ట్‌ చట్టం 1994, ట్రేడ్‌ మార్క్‌ చట్టం 1991, మొక్కల పరిరక్షణ రైతుల హక్కు చట్టం 2001 ఉన్నాయి. ఫిలిం సర్టిఫికేషన్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ రద్దు చేసి సెన్సార్‌ బోర్డుపై ఫిర్యాదు ఉంటే హైకోర్టుకు వెళ్ళమనడం పట్ల సినీ నిర్మాతలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. సెన్సార్‌ సర్టిఫికెట్‌ నిరాకరణపై కోర్టుకెళితే ఆ కేసు తేలేదెన్నడు, సినిమా విడుదల అయ్యేదెన్నడు అని తలలు పట్టుకుంటున్నారు. ఎలాగైనా ట్రిబ్యునల్‌ను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

మన దేశంలో సినిమాటోగ్రాఫ్‌ చట్టం ప్రకారం 1952లో సెన్సార్‌ బోర్డు ఏర్పడింది. సినీ నిర్మాతలు సెన్సార్‌ సమస్యలను సులువుగా తేల్చుకొనేందుకు చట్టంలోని సెక్షన్‌ డి ప్రకారం 1983లో బోర్డుకు అనుబంధంగా ఫిలిం సర్టిఫికేషన్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేశారు. సెన్సార్‌ బోర్డులో మూడు వ్యవస్థలుంటాయి. మొదటిది ఐదుగురు సభ్యులుండే ఎగ్జామినింగ్‌ కమిటీ, చాలా సినిమాలు ఇక్కడే సర్టిఫికెట్‌ పొందుతాయి. రెండోది రివైజింగ్‌ కమిటీ. మొదటి కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసిన సినిమాలకు కొన్ని తొలగింపులతో ఇది విడుదలకు అనుమతినీయవచ్చు. వీటికి ఒప్పుకొని సినిమా సర్టిఫికెట్‌ తెచ్చుకోనేవారు కూడా ఉంటారు. సెన్సార్‌ కటింగ్స్‌తో సినిమా విడుదల చేయడం వ్యర్థమని భావించి వాటిని ఒప్పుకోని నిర్మాత చివరి ప్రయత్నంగా ఫిలిం సర్టిఫికేషన్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ తలుపు తడతాడు. ఈ ట్రిబ్యునల్‌కు ఒక రిటైర్డ్‌ జడ్జి చైర్మన్‌గా ఉంటారు కాబట్టి దీని నిర్ణయం కోర్టు తీర్పుతో సమానం. పై రెండు కమిటీలు దీని మాటకు కట్టుబడి ఉండాల్సిందే. దీని తీర్పు నచ్చని నిర్మాత బయట కోర్టుల్లో సవాలు చేయవచ్చు.

ఇక్కడ ప్రభుత్వానికి  మింగుడుపడనిది, సినిమావాళ్ళకు ఇష్టమైనది ఏమిటంటే సామాజిక, రాజకీయ అంశాలపై విమర్శనాత్మకంగా వచ్చిన ఎన్నో సినిమాల విడుదలకు ఫిలిం సర్టిఫికేషన్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ మార్గాన్ని సుగమం చేస్తోంది. పాలక పక్ష అనుయాయులను బోర్డు చైర్మన్‌ కుర్చీలో కూర్చోబెట్టినా ఫలితం శూన్యం. ట్రిబ్యునల్‌ ఉండడం వల్ల ప్రభుత్వాన్ని, సామాజిక కట్టుబాట్లను, విశ్వాసాలను  విమర్శించే ప్రగతిశీల, అభ్యుదయ సినిమాలు బయటికి వస్తున్నాయి. ట్రిబ్యునల్‌ రద్దు చేసి ఇలాంటి సినిమాలు తీసేవారిని కోర్టుల చుట్టూ తిప్పితే కష్ట నష్టాలపాలై విమర్శనాత్మక సినిమాలు తీయడానికి ముందుకు రారు అని ప్రభుత్వం భావిస్తోందని సినీజీవులంటున్నారు. 

1994లో ‘బాండిట్‌ క్వీన్‌’ విడుదలకు రెండు కమిటీలు ఒప్పుకోకున్నా ట్రిబ్యునల్‌ ప్రమేయంతో మన దేశంలో రిలీజ్‌ అయింది. 2017లో ‘లిప్‌స్టిక్‌ అండర్‌ మై బురఖా’ ట్రిబ్యునల్‌ తీర్పు మూలంగానే తెర మీదికొచ్చింది. 2016లో శ్యామ్‌ బెనెగల్‌ కమిటీ ట్రిబ్యునల్‌ అధికారాలను మరింత పెంచాలని సిఫారసు చేసింది. షర్మిలా ఠాగూర్‌ సెన్సార్‌ బోర్డు చైర్‌ పర్సన్‌గా ఉన్నప్పుడు తాను ట్రిబ్యునల్‌ ప్రాధాన్యతను ప్రభుత్వం దృష్టికి తెచ్చానని, రద్దు విషయంలో సినీ ప్రముఖులతో చర్చించి ఉండాల్సిందని అంటున్నారు.. ప్రజలకు అవసరం లేవని, ప్రభుత్వానికి భారమని భావించే ట్రిబ్యునళ్ల తొలగింపుపై కనీసం ఏకసభ్య కమిటీ అయినా వేసి అంతిమ నిర్ణయాలు తీసుకోవాలి. లక్షలాది మందికి ఉపాధికి, కోట్ల రూపాయల పన్నుకు మూలమైన చిత్ర పరిశ్రమకు ప్రభుత్వం మరిన్ని వెసులుబాట్లు కల్పించాలి తప్ప ఉన్న సదుపాయాలను దూరం చేయవద్దు.

వ్యాసకర్త :బి. నర్సన్‌
కవి, విశ్లేషకులు
మొబైల్‌ : 94401 28169

మరిన్ని వార్తలు