కూడు పెట్టే భాష కావాలి!

8 May, 2022 00:48 IST|Sakshi

అభిప్రాయం

వచ్చే నెలలో స్కూళ్లు, పాఠాలు మళ్ళీ మొదలవుతున్నాయి. ఇక నుండి ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్లు! దాంతో తెలుగు రాష్ట్రాలలో ఇంగ్లిష్‌ మీడియంపై కొందరు గగ్గోలు పెడుతున్నారు. తెలుగు భాష, తెలుగు సంస్కృతీ పోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా... సంస్కృతి పరిరక్షణ, భాషా పరిరక్షణ పేరిట ఆకలి తీర్చని భాషల్లో చదువు నెందుకు నేర్చుకోవాలి? ఆత్మగౌరవమీయని భాషా సంస్కృతులు; వివక్ష, అసమానతలకు నిలయమైన పురుషాధిపత్య సంస్కృతిని మనదనే పేరిట తలకెత్తుకోవాలా అని మరికొందరు విమర్శిస్తున్నారు.

లోకంలో అనేక భాషలున్నాయి. అవన్నీ కాలగతిలో రూపొం దుతూ, మార్పు చెందుతూ ప్రస్తుత రీతిలో వాడకంలో ఉన్నాయి. ఎవరి భాషలో వారు మాట్లాడుకుంటున్నారు. ఇతర భాషల వారితో మాట్లాడడానికి ఎవరి తిప్పలు వారు పడుతున్నారు. తెలంగాణ, కేరళ రాష్ట్రాల నుండి 1970 నుండి లక్షలాది ప్రజలు ఉపాధి కోసం గల్ఫ్‌ బాట పట్టారు. భాష విషయంలో ఏదో రీతిలో అడ్జస్టయి పోయారు. బట్టల మిల్లుల్లో పని చేయడానికి 150 ఏళ్ల క్రితం వలసపోయిన తెలంగాణ ప్రజలు ముంబయి, షోలాపూర్, భివండి వంటి మహారాష్ట్ర ప్రాంతాల్లో; అహమ్మద్‌ నగర్‌ వంటి గుజరాత్‌ ప్రాంతాల్లో ఉపాధి వెతుక్కున్నారు. ఆయా ప్రాంత భాషలను మాట్లాడుతూ ఉండటమే కాదు, తమ భాషా రక్షణ కోసం కూడా కృషి చేస్తున్నారు. లోకంలో ఇట్లా అవసరా లను అనుసరించి అడ్జస్టయిపోతున్నారు జనం.
 
ప్రజలు ఇలా బతుకుతుంటే భాషావాదులు బయల్దేరి మాతృభాషలోనే పాఠాలు ఉండాలి అంటుంటే... మరోవైపు ఇంగ్లిష్‌లో చదివితే ఎక్కడికి పోయినా ఉపాధి రంగంలో అవకాశాలు పెరుగుతాయనీ, పరస్పర వ్యక్తీకరణలో సౌలభ్యం పెరుగుతుందనీ అంటున్నారు మరికొందరు. ఈ వాదం వల్లనే కొన్ని రాష్ట్రాలలో ఇంగ్లిష్‌ మీడియంలో చదువుకోవడం పెరిగింది కూడా!

ఒక రాష్ట్రంలో వివిధ భాషలు మాతృ భాషలుగా కలిగిన సమూహాలు అనేకం ఉంటాయి. కానీ మెజారిటీ ప్రజలు మాట్లాడే ఒకటి రెండు భాషల్లోనే పాఠ్య పుస్తకాలు ముద్రించి చదువులు చెబుతున్నారు. ఇలా చేస్తే మరి మిగిలిన సమూహాలు మాతృభాషలో చదువుకుంటున్నట్లే భావించాలా? మాతృ భాషలో ఎందుకు చదువుకోవాలట? అని అడిగితే ‘సంస్కృతీ పరిరక్షణ కోసమ’ని అంటారు. భాష మారితే సంస్కృతీ మారి పోతే ... అదేమి సంస్కృతి? అది విశ్వజనీన సంస్కృతి కానట్టే గదా అంటారు ఇంగ్లిష్‌ చదువులు కావాలనేవారు. కానీ, లక్షలాది మంది ఇంగ్లిష్‌లో విద్యాభ్యాసం చేసినందువల్లే ఉద్యోగాలు పొందారని గణాంకాలు చెబుతున్నాయి.

ఏ భాషనైనా బలవంతంగా రుద్దకూడదు. అవసరాలను బట్టి, భవిష్యత్‌ అవకాశాలను బట్టి ఎటువంటి భాషనైనా కష్టపడి నేర్చుకుంటారు. సాఫ్ట్‌వేర్, సైన్సు, టెక్నాలజీ రంగాలలో అవకా శాలను అందిపుచ్చుకోవడానికీ, విదేశాలకు వెళ్లి మంచి ఉద్యో గాలు పొందడానికీ ఇంగ్లిష్‌ చదువులే ఉపయోగం అని స్పష్టమ వుతున్నది. ఈ వాస్తవాలను గుర్తించి మన రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలూ ఇంగ్లిష్‌ మీడియం చదువులకు పెద్దపీట వేయడం అభినందనీయం.

చివరిగా... మొక్కిన వరమీయని వేల్పును, ఎంత చదివినా ఉపాధి దొరకని చదువును గ్రక్కున విడువంగ వలయు... ఏమంటే నేడు కూడా కోటి విద్యలు కూటి కొరకే! కూడు పెట్టని చదువులెందుకు? ముసుగులో గుద్దులాటలెందుకు? అంటున్న తరానికి పరిష్కారాలు అవసరం! 

వ్యాసకర్త: బి.ఎస్‌. రాములు 
సామాజిక తత్వవేత్త
మొబైల్‌: 83319 66987

>
మరిన్ని వార్తలు