ఇందుకే బీసీలు వైఎస్‌ జగన్‌ వెంట ఉంటారు

2 Dec, 2022 13:18 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో శాసనసభ సాధారణ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న కొద్దీ రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు బీసీలపై ఎక్కడలేని ప్రేమ ఒలక బోస్తున్నాయి. 2019 ఎన్ని కల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ 151 స్థానాలు పొందడంలో బీసీలు ప్రముఖ పాత్ర పోషించారు. అధికారంలోకి వచ్చిన వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి బీసీల ఆత్మగౌరవం ప్రతిబింబించే విధంగా వారికి వందలాది నామినేటెడ్‌ పదవులు ఇచ్చారు. వారి సంక్షేమానికి అత్యధికంగా నిధులు ఇచ్చారు. దీంతో బీసీలు శాశ్వతంగా జగన్‌ వెంట నడవడానికి సిద్ధమయ్యారని విశ్లేషకులు అంటున్నారు. 

రాష్ట్ర జనాభాలో 52 శాతం ఉన్న బీసీలను వైసీపీ నుంచి వేరు చేసి వారి మద్దతు పొందేందుకు తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన లాంటి పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఎన్టీఆర్‌ కాలంలో టీడీపీ ప్రభుత్వం బీసీలకు చేసిన మంచిని చంద్రబాబు క్లెయిమ్‌ చేసుకోవడం విడ్డూరం. 2014లో బీసీ డిక్లరేషన్‌ విడుదల చేసి అధికారం లోకి వచ్చిన తర్వాత టీడీపీ ఆ డిక్లరేషన్‌లోని అంశాలను పట్టించుకోలేదు. అందుకే 2019 ఎన్నికల్లో జగన్‌మోహన్‌ రెడ్డికి బీసీలు మద్దతు పలికారు. మరి ఇప్పుడు టీడీపీకి వారు ఓట్లెలా వేస్తారు?

బీజేపీ కూడా ఇటీవల ఏపీలో బీసీలతో సామాజిక చైతన్య సభ నిర్వహించి బీసీలకు పలు హామీలు ఇచ్చింది. చట్టసభలలో తమకు రిజర్వేషన్లు కావాలనీ, దేశవ్యాప్తంగా బీసీల జనాభా లెక్కించాలనీ అనేక దశాబ్దాలుగా బీసీలు అనేక ఉద్యమాలు చేస్తున్నారు. స్వయంగా బీసీ అయిన ప్రధాన మంత్రి ఈ డిమాండ్లను పట్టించు కోవడం లేదు. ఏ ముఖంతో రాష్ట్ర బీజేపీ నాయకులు బీసీలను ఓట్లడుగుతారు? తనకు కులం అంటగట్ట వద్దని అంటూనే కాపుల మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు జనసేనాని పవన్‌ కల్యాణ్‌. కాపులను బీసీలలో చేర్చే అంశంపై బీసీలు, కాపుల మధ్య చాలాకాలంగా వివాదం నడుస్తోంది. ఈ పరిణామాలతో బీసీలు పవన్‌ కల్యాణ్‌కు మద్దతు తెలిపే అవకాశమే లేదు. 

జగన్‌మోహన్‌ రెడ్డి ఇప్పటికే 83 వేల కోట్ల రూపాయలు నేరుగా బీసీల ఖాతాలలో వేయడం విశేషం. రాష్ట్రంలో ఉన్న 17 మంత్రి పదవులలో 11 మంత్రి పదవులు బీసీలకు కేటాయించారు. అదే విధంగా 139 బీసీ కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటికి 56 చైర్మన్‌లను కేబినెట్‌ హోదాతో నియమించడం, ఆ 56 కార్పొరేషన్‌లలో 732 మంది బీసీలను డైరెక్టర్‌లుగా నియమించడం తెలిసిందే. 

జిల్లా పరిషత్‌ చైర్మన్లు, మున్సిపల్‌ చైర్మన్లు, కార్పొరేషన్‌ చైర్మన్ల పదవుల్లో 50 శాతం పైగా బీసీలకు కేటాయించడమూ నిజమే కదా. బీసీ ఉద్యమ నాయకులు ఆర్‌. కృష్ణయ్యను రాజ్యసభకు పంపి బీసీల గొంతును పార్లమెంట్‌లో బలంగా వినిపించే అవకాశాన్ని సృస్టించారు. ఇంత చేసిన జగన్‌ వెంట బీసీలు ఉంటారని వేరే చెప్పనవసరం లేదు. (క్లిక్ చేయండి: ప్రజల హృదయాలను గెలుచుకున్న జగన్‌ అజేయుడే!)


- కైలసాని శివప్రసాద్‌ 
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌

మరిన్ని వార్తలు