దీటైన హామీ! కానీ విధానమే ప్రశ్నార్థకం!

8 Nov, 2021 00:58 IST|Sakshi

ఒకవైపు ‘కాప్‌26’ వంటి అంతర్జాతీయ వేదిక నుంచి కర్బన ఉద్గారాలను శూన్యస్థాయికి తగ్గించడంపై భారత ప్రధాని గంభీర ప్రకటన చేసి ప్రశంసలు అందుకుంటున్నారు. మరోవైపు దేశంలో ఇంధన ఉత్పత్తి విధానం ప్రశ్నార్థకమవుతోంది. పలు అటవీ ప్రాంతాలను బొగ్గుగనుల తవ్వకం కోసం కేంద్రం ప్రైవేట్‌ కంపెనీలకు అప్పగిస్తోంది. బొగ్గు ఆధారిత ఇంధన ప్లాంట్లను నిర్మిస్తూనే ఉన్నారు. పునరుద్ధరణీయ ఇంధనాల పట్ల చిత్తశుద్ధిని ప్రకటించకుంటే దేశం ఆర్థిక ఆత్మహత్యా స్థితిలోకి వెళుతుంది. 


పెరిగిన భారత ప్రాభవం
వాతావరణ మార్పుల ప్రభావాన్ని నియంత్రించేందుకు ఉద్దేశించిన కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ పార్టీస్‌ (కాప్‌) సమావేశాలు దశాబ్దాలుగా జరుగుతున్నా... సాధించింది శూన్యం. ఈ ఏడాది గ్లాస్గో (స్కాట్‌లాండ్‌)లో జరుగుతున్న కాప్‌ 26వ సమావేశం దీనికి మినహాయింపు. సంప్రదాయాలను తోసిరాజంటూ భారత్‌ ఈసారి సమావేశాల తీరుతెన్నులను మలుపు తిప్పింది. ధనిక దేశాలు తాము కార్బన్‌ డయాక్సైడ్‌ ఉద్గారాల సమస్యకు ఉపశమనం మాత్రమే కల్పించగలమనీ, భారత్, చైనా వంటి దేశాలపైనే భారం ఎక్కువగా ఉందనీ వ్యాఖ్యానిస్తూంటాయి. వాతావరణంలో పెరిగిపోతున్న కర్బన ఉద్గారాలకు అభివృద్ధి చెందుతున్న దేశాలనే బాధ్యులను చేయాలని ఈ ధనిక దేశాలు పట్టుబడుతూంటాయి. 
చైనా విషయమే తీసుకుంటే... 15 ఏళ్లుగా అత్యధిక కర్బన ఉద్గారాలు కలిగిన దేశంగా నిలిచింది. ప్రపంచ ఉద్గారాల్లో చైనా వాటానే 25 శాతం పైబడి ఉంది. చైనాతో సరిపోలినంత జనాభా ఉన్నప్పటికీ కర్బన ఉద్గారాల్లో మన వాటా ఐదు శాతమే. అమెరికా విషయానికొస్తే, భారత జనాభాలో నాలుగో వంతే ఉన్న ఈ అగ్రరాజ్యం రెట్టింపు మోతాదు కర్బన ఉద్గారాలకు కారణమవుతోంది. భూమ్మీద అన్ని దేశాలూ సమానమన్న ప్రాతిపదికను అంగీకరిస్తే ధనికదేశాలు తమ కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గించుకోవాలి. 

చాలామంది వాతావరణ ఉద్యమకారులు అభివృద్ధి చెందుతున్న దేశాలకు వెçసులుబాటు కల్పించడం వల్ల పెరిగిపోతున్న భూతాపోన్నతిని నియంత్రించే విషయంలో ఆలస్యం జరిగిపోతుందని వాదిస్తూంటారు. ఆశ్చర్యకరంగా అందరూ సమానమన్న భావనను వ్యతిరేకించే ఉద్యమకారులు విద్యుచ్ఛక్తి, స్వచ్ఛమైన తాగునీరు వంటివి కూడా లేకుండా అల్లాడిపోతున్న మనుషుల సమస్యలు ఎలా పరిష్కరించగలరో చెప్పలేరు. అందరూ సమానమన్న ప్రాతిపదికన కర్బన ఉద్గారాలపై పోరు మొదలుపెడితే రెండు అంశాలు  కీలకమవుతాయి. మొదటిది– టెక్నాలజీ. విద్యుత్తు వాహనాల గురించి అంతగా తెలియని రోజుల్లో టెస్లా కార్లతో ఈలాన్‌ మస్క్‌ సృష్టించిన మార్పు ఒక ఉదాహరణ. ఇలాంటి వాటితోపాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గతిని మార్చేసిన  కొత్త టెక్నాలజీల ఆసరాతోనే వాతావరణ లక్ష్యాల సాధన సాధ్యమవుతుంది. రెండో అంశం... అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఈ టెక్నాలజీలు, తగిన ఆర్థిక వనరులు అందుబాటులో ఉండటం. ఈ రెండూ లేకుండా వాతావరణ మార్పులపై సమన్యాయం చేయడం సాధ్యం కాదు. 

20014– 19 మధ్యలో మోదీ ప్రభుత్వం ధనికదేశాల కోసం ఎదురు చూడకుండా సంప్రదాయేతర ఇంధన వనరులను వేగంగా వృద్ధి చేసింది. ఫలితంగా భారత్‌ ఇప్పుడు సౌరశక్తి రంగంలో ప్రపంచంలోనే టాప్‌–4గా నిలిచింది. ఇది ప్రపంచం కాసింత అనిష్ట్టంగానైనా భారత్‌ను ప్రశంసించాల్సిన పరిస్థితి కల్పించింది. రెండో దశలో భాగంగా మోడీ గ్రీన్‌ గ్రిడ్స్‌పై బ్రిటన్‌తో జట్టు కట్టడం మొదలుపెట్టారు. ‘వన్‌ సన్, వన్‌ వరల్డ్, వన్‌ గ్రిడ్‌’ వంటి పథకాలను ప్రకటించారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్‌ ప్రభావశీల నాయకత్వ బాధ్యత తీసుకునే స్థితికి తీసుకొచ్చారు. 2070 కల్లా కర్బన ఉద్గారాలను శూన్యస్థాయికి చేర్చేందుకు సిద్ధపడి గ్లాస్గోకు వెళ్లిన ప్రధాని ముఖ్యంగా ఆ లక్ష్యాన్ని ఎలా అందుకోబోతున్నారో వివరించారు. ఈ ప్రణాళికపై ఓవర్సీస్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన రాతిన్‌ రాయ్‌ వంటి వారు కూడా ప్రశంసలు కురిపించారు. ‘‘ఆచరణ సాధ్యమైన విషయమిది. లేదంటే ఈ ఏడాది కాప్‌ వట్టి మాయమాటల మూటగానే మిగిలిపోయేది’’ అని రాయ్‌ వ్యాఖ్యానించారు.

భారత్‌ కర్బన ఉద్గారాల తగ్గింపునకు వివరణాత్మకమైన ప్రణాళికను ప్రకటించడం చరిత్రాత్మకమైన ఘట్టమనే చెప్పాలి. చైనా ప్రతినిధులు ఎవరూ ఈ సమావేశానికి హాజరు కాని నేపథ్యంలో ప్రధాని ప్రకటనకు మరింత ప్రాముఖ్యం ఏర్పడింది. ధనికదేశాలు తమ పాతపాటనే పాడుతున్న క్రమంలో వాతావరణ మార్పుల సమస్యకు దీటైన సమాధానం ఇవ్వగలిగిన వ్యక్తిగా ప్రధాని అవతరించారు. వాతావరణ మార్పుల అంశంలో ఇప్పటికిప్పుడు మార్పులు జరిగిపోవాలని ఆదర్శాలు మాట్లాడేవారే ఎక్కువ. వీరివద్ద చౌక ప్రత్యామ్నాయాలను అభివృద్ధి చేసుకునేంత వరకూ పరిస్థితిని ఎలా చక్కదిద్దుకోవాలన్న విషయంపై తగిన వ్యూహం ఉండదు. అతి తక్కువ కర్బన ఉద్గారాలు ఉండేలా జీవనశైలిని మార్చుకోవాలన్న సూత్రాన్ని తుంగలో తొక్కి, ఇతరులకు సుద్దులు చెప్పే రకం మేధావులే ఎక్కువే. వాతావరణ మార్పుల సమస్యను ఎదుర్కొనేందుకు వీళ్లు కాదు కావాల్సింది... ఆచరణ సాధ్యమైన అంచనాలతో అందరూ సమానమన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకుని, నిర్దిష్ట కాలావధులకు కట్టుబడి ఉండే వాళ్లు కావాలి. ఈ లక్షణాలన్నీ తమకు ఉన్నాయని భారత్‌ ఇప్పుడిప్పుడే ప్రపంచానికి చాటి చెబుతోంది. 
వ్యాసకర్త: బైజయంత్‌ పాండా
 బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు

 

మరిన్ని వార్తలు