సకల రంగాల్లో నారీలోకం ముందంజ

7 Mar, 2021 00:22 IST|Sakshi

సందర్భం

మనుస్మృతిలోని ‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా/ యత్రైతాస్తు న పూజ్యంతే సర్వస్తత్ర ఫలాః క్రియా’ అనే శ్లోకం సమాజంలో అంతర్లీనంగా వున్న మహిళల శక్తిని చాటింది. ఎక్కడైతే మహిళలు గౌరవించ బడతారో అక్కడ దేవతలు నడయాడతారని... ఎక్కడ వారికి అగౌరవం ఎదురవుతుందో అక్కడ తలపెట్టే ఎంతటి మంచి కార్యమైనా నిష్ఫలమవు తుందని దీని సారాంశం. మహిళలంటే దేవతాంశ. వారు ప్రేమకూ, దయా కారుణ్యాలకూ చిహ్నం. పవిత్రతకు మారుపేరు. అమ్మగా, సోదరిగా, బిడ్డగా, భార్యగా పురుషుల జీవితంలో వారి పాత్ర బహుముఖమైనది. స్త్రీ మూర్తి లేని సృష్టిని ఊహిం చలేం. అందుకే వారు సృజనాత్మక శక్తికి ప్రతీకగా, అజరామరమైన మన సంస్కృతీ సంప్రదాయాలకు వాహికలుగా నిలుస్తున్నారు. ఆమె మనిషికి, మాన వీయతకు మాత్రమే కాదు... సర్వ మానవాళికీ మాతృమూర్తి. ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో మహిళలు సాధించిన అభివృద్ధికి గుర్తుగా ఏటా మార్చి 8న మహిళా దినోత్సవం జరుపుతున్నారు. ఇదే రోజున 1908లో 15,000మంది మహిళలు న్యూయార్క్‌ నగరంలో తమ హక్కుల కోసం, మెరుగైన వేతనాల కోసం, ఓటు హక్కు కోసం ఉద్యమించారు. ఏ దేశంలోనైనా సమాజ నిర్మాణంలో, దాని అభివృద్ధిలో మొదటినుంచీ మహిళల పాత్ర ప్రముఖమైనదని చరిత్ర చాటుతోంది. మహిళా దినోత్సవంనాడు ఈ వాస్తవాలను చాటేలా, మహిళా శక్తిని అందరూ గుర్తించేలా కార్యక్రమాలు రూపొందించటం అవ సరం. అవి మహిళాభ్యున్నతికి దోహదపడతాయి. మన జాతి నాగరికతలో, సంస్కృతిలో మహిళల పాత్ర ఎనలేనిది. మన ప్రాచీన శ్రుతులు, స్మృతులు ఆనాటి సమాజంలో మహిళలకున్న  స్వేచ్ఛా స్వాతంత్య్రాలు అధికమేనని చాటుతున్నాయి. సమస్త జీవన రంగాల్లో వారు పురుషులతో సమా నంగా పాల్గొన్న అంశాన్ని తెలియజెప్పాయి. అరుం ధతి (మహర్షి వశిష్టుడి సతీమణి), లోపాముద్ర (మహర్షి అగస్త్యుడి భార్య), అనసూయ((మహర్షి అత్రి భార్య) తదితర సాధ్వీమణులు ఇందుకు చిహ్నం. ప్రాచీన భాష్యకారులు పతంజలి, కాత్యా యన్‌ వేదకాలం తొలినాళ్లలోనే మహిళలు విద్యా వంతులని చెప్పారు. యుక్తవయసు వచ్చాక తమ జీవిత భాగస్వాములను ఎంచుకునే స్వేచ్ఛ ఆడ వాళ్లకు వుండేదని రుగ్వేద మంత్రాలు చాటుతు న్నాయి. అలాగే మైత్రేయి, గార్గి వంటి మహిళా రుషులు కూడా వుండేవారని రుగ్వేదం, ఉపనిష త్తులు చెబుతున్నాయి. రామాయణంలోని సీతా మాత, మహాభారతంలోని మహారాణి ద్రౌపది మన ప్రాచీనకాలంనాటి మహిళా శక్తికి నిదర్శనం.

ప్రాచీన సంప్రదాయాల్లో, దుర్గాదేవి సమక్షంలో ఉన్న దేవతలు కిరీటధారిణులై ఉండటం గమనించవచ్చు. అయితే మహిళల పరిస్థితి దిగజారిపోవడం అనేది మధ్యయుగాల్లోనే మొదలైంది. మొఘలులు, తర్వాత బ్రిటిష్‌ పాలనలో మహిళల స్వేచ్ఛకు, హక్కులకు పరిమితులు ఏర్పడ్డాయి. బాల్యవివాహం అనే దురాచారం 6వ శతాబ్ది నుంచే ప్రారంభమైందని భావిస్తున్నారు. భారతదేశాన్ని విదేశీయులు దురాక్రమించిన తర్వాత పరిణామాలు మరింతగా దిగజారిపోయాయి. ఈ కాలంలోనే పరదా సంస్కృతి, బాల్య వివాహాలు, సతీ సహగమనం, జోహార్, దేవదాసీ వ్యవస్థ వంటి మత దురాచారాలు వ్యాప్తిలోకి వచ్చాయి. అయితే 19వ శతాబ్ది మధ్యలో బ్రహ్మసమాజ్, ఆర్యసమాజ్, దివ్యజ్ఞాన సమాజం, రామకృష్ణ మిషన్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రీబాయి పూలే వంటి సంస్థలూ, వ్యక్తులు పలు సంస్కరణోద్యమాలకు నాంది పలికి మహిళల ప్రయోజనాల కోసం కృషి చేశారు. అనేక పురాతన సంప్రదాయాలు, ఛాందసభావాలకు ఇప్పుడు కాలం చెల్లిపోయింది. ఇంటిపనికి వెలుపల అన్ని రంగాల్లోనూ మహిళలు తమ ఉనికిని చాటుకుంటున్నారు. అంతరిక్షం, పాలనా రంగ సేవ, విద్య, రాజకీయాలు, క్రీడలు, వ్యాపారం, సాహిత్యం, సైన్యం, మీడియా వంటి పలు వైవిధ్యపూరితమైన రంగాల్లో మహిళలు తమ ప్రతిభాపాటవాలను చాటుకుంటున్నారు. ఈరోజు మహిళలే అభివృద్ధికి కేంద్రబిందువు అని అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది. మహిళకు సంఘటితపరమైన, గౌరవప్రదమైన స్థానం లభించని చోట మంచి క్రమశిక్షణాయుతమైన సమాజాన్ని కూడా సృష్టించలేం.

హైదరాబాద్‌ కేంద్రంగా అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ పీవీ సింధు, సైనా నెహ్వాల్, టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా క్రీడారంగంలో సాధిస్తున్న విజయాలు మనందరికీ తెలుసు. అంతర్జాతీయ మహిళా బాక్సర్‌ మేరీ కోమ్, అంతర్జాతీయ క్రికెట్‌ క్రీడాకారిణి మిథాలి రాజ్‌ నేటి సమాజ నడకకు ఉదాహరణలు. గత ఆరేళ్లుగా సైన్యంలో మహిళల సంఖ్య మూడు రెట్లు పెరిగింది. ఇప్పుడు భారతీయ సైన్యం, నేవీ, వాయుసేనలో 9,118 మంది మహిళలు పనిచేస్తున్నారు. వైద్య విభాగాన్ని మినహాయిస్తే సైన్యంలో ఇప్పుడు 6,807 మంది, వాయుసేనలో 1,607, నావిగాదళంలో 704 మంది మహిళాధికారులు పనిచేస్తున్నారు. భారత నావికాబలగానికి చెందిన నావికా సాగర్‌ పరిక్రమలో పూర్తిగా మహిళా అధికారులతో కూడిన ఆరుగురు సభ్యుల బృందం ప్రపంచం మొత్తం సముద్రాల్లో చాపచుట్టి వచ్చింది. ఇది ప్రపంచ నావికా చరిత్రలోనే అరుదైన ఘటన. భారతీయ మిస్సైల్‌ మహిళగా పేరొందిన టెస్సీ థామస్‌ డీఆర్‌డీఓలో సైంటిస్టుగా పనిచేస్తూ అగ్ని–4, అగ్ని–5 క్షిపణుల రూపకల్పనలో ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌గా వ్యవహిరించారు.

అయితే సామాజికపరమైన గణాంకాలు, నేరాల రేటు చూస్తే విచారం కలుగుతుంది. జాతీయ నేర నివేదికా మండలి ప్రకారం 2019లో మహిళలపై రోజుకు 87 అత్యాచార కేసులు నమోదు కాగా, మహిళలపై దాడి ఘటనలు 4 లక్షలకుపైగా నమోదయ్యాయి. ఏడాది మొత్తంలో 32 వేలమందికిపైగా మహిళలపై అత్యాచార ఘటనలు నమోదయ్యాయి. మహిళల రక్షణకు, వారి సమానత్వానికి  తీసుకుంటున్న ప్రతి చర్యా మహిళల పరిస్థితిని ఏదో మేరకు మెరుగుపరుస్తూనే ఉంది. కానీ సామాజిక సంస్కరణా ప్రక్రియే నత్తనడకన సాగుతోంది. ఈ రంగంలో ప్రజా చైతన్యాన్ని వేగవంతం చేయాల్సి ఉంది. విద్యను కేంద్రబిందువుగా తీసుకుని చట్టాలను సమర్థంగా అమలు చేయగలిగితే మహిళలపై నేరాలు జరగని దేశంగా భారత్‌ను సమున్నతంగా నిలపవచ్చు. భారతీయ సంస్కృతిలో స్త్రీలను దుర్గా, లక్ష్మి వంటి దేవతలకు సమానస్థాయినిచ్చారు. కాబట్టి వారికి యావత్‌ సమాజం తగిన గౌరవం ఇవ్వాల్సి ఉంది.

(రేపు మహిళా దినోత్సవం సందర్భంగా)


బండారు దత్తాత్రేయ
వ్యాసకర్త హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ 

మరిన్ని వార్తలు