భారత ఐక్యతా వారధి సర్దార్‌ పటేల్‌

31 Oct, 2020 00:50 IST|Sakshi

నేడు ఉక్కుమనిషి 145వ జయంతి

సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ గొప్ప దేశభక్తుడు, రాజనీతి జ్ఞుడు. దేశ సమగ్రత, సమైక్య తపట్ల దృఢమైన సంకల్పం, ఆయన దూరదృష్టి, చాతుర్యం దేశాన్ని తొలినాళ్లలో పలు విపత్కర సమస్యలని ఎదుర్కొని ముందుకు నడిపించడానికి ఇతోధికంగా తోడ్పడ్డాయి. ప్రముఖంగా రెండు ఘట నలను ప్రస్తావిస్తాను. గుజరాత్‌లోని జాం నగర్‌ పూర్వ రాజైన జాం సాహిబ్‌కు సంబంధించినది. అధికార బది లీకి ఇంకా రెండు నెలలు గడువు ఉండగా,ఈలోపే కతియవార్‌ రాష్ట్రాలన్నింటినీ కలిపి పాకిస్తాన్‌ సహా యంతో ఒక స్వతంత్ర రాజ్యంగా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఢిల్లీలోని తోటి సంస్థానాధీశులను కలవబోతున్నాడని తెలుసుకొన్న పటేల్‌ ఇక సమయాన్ని వృథాచేయకుండా జాం సాహిబ్‌ సోదరుడైన కల్నల్‌ హిమ్మత్‌ సింగ్‌ ద్వారా వారిని తన ఇంటికి విందుకి తీసుకురావాలని కోరాడు. భోజనసందర్భంలో పటేల్‌ తన ఆత్మీయతతో, ప్రేమతో జాంసాహిబ్, మహారాణి వారి హృదయాలని గెలుచుకున్నాడు. దీంతో జాంసాహిబ్‌ స్వతంత్ర రాజ్యం  ఏర్పాటు చేయాలనే ప్రణాళికను విరమించుకున్నాడు. 

మరో సంఘటన షేక్‌ అబ్దుల్లాకు సంబంధించినది. రాజ్యాంగ పరిషత్తులో ఆర్టికల్‌ 370ని చర్చిస్తున్న సమయంలో అసహనంతో ఉన్న షేక్‌ అబ్దుల్లా తన స్థానం నుండి లేచి, ‘నేను తిరిగి కశ్మీరుకు వెళుతున్నాను’ అని సభలో ప్రకటించాడు. దీంతో ప్రధాని నెహ్రూ లేని కారణంగా అక్కడే ఉన్న పటేల్‌.. కశ్మీర్‌ వెళ్లడానికి రైలు పెట్టెలో కూర్చున్న అబ్దుల్లాకు ‘ఈరోజు సభను వదిలివెళ్లగలవు కానీ ఢిల్లీని మాత్రం విడిచి వెళ్ళలేవు’ అనే సందేశాన్ని తెలియజేశారు. దాని పరిణామాలను గ్రహించిన షేక్‌ అబ్దుల్లా రైలు నుంచి దిగి తన ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. అంతటి గట్టి సందేశాన్ని నిర్భీతితో ఇవ్వగల ధీశాలి పటేల్‌. జాతిపిత మహాత్మా గాంధీ ఆలోచనలను, భావాలను సరైన దృష్టికోణం నుండి అర్థం చేసుకున్న రాజకీయ నాయకులలో సర్దార్‌ పటేల్‌ ఒకరు. గాంధీజీ స్వరాజ్యం నుంచి సురాజ్యం గురించి చెబితే, సర్దార్‌ పటేల్‌ గారు స్వరాజ్యాన్ని సురాజ్యంగా మార్పు చేసే సుపరిపాలనకు, సంస్కరణకు దారితీసిన ఆద్యుడు. 

వల్లభాయ్‌ పటేల్‌ 1917 నవంబర్‌లో మొదటిసారి గాంధీజీతో పరిచయం ఏర్పడ్డప్పుడు ఆ సమయంలో వారి వేషధారణ హ్యాట్, సూట్, బూట్, ఇంగ్లిష్‌తో పాశ్చాత్యమైనది. కానీ గాంధీజీ సంపర్కంతో పూర్తిగా పరివర్తన చెంది ఖాదీ, ధోతి, కుర్తా, చెప్పులు స్వీకరించి స్వదేశీ వస్త్రధారణలోకి వచ్చారు. గాంధీజీ సత్య, అహింస సిద్ధాం తాల ప్రభావంతో, పటేల్‌ విదేశీ వస్తువులని, దుస్తుల్ని బహిష్కరించినారు. జాతీయ వ్యవహారాలలో అత్యంత కఠినంగా వ్యవహరించే పటేల్‌ వ్యక్తిగత విషయాలలో మాత్రం మృదువుగా ఉండే వారు. పటేల్‌తో సమావేశమై సంభాషించిన తర్వాత.. మన దేశ భవిష్యత్తు సరైన నాయకత్వం చేతుల్లో సురక్షితంగా ఉందని భావిస్తున్నాను అని జంషెడ్‌ జీ టాటా అన్నారు.
భారత్‌ తొలి హోంమంత్రిగా వ్యవహరించే రోజుల్లో తన ఇంటికి ఔపచారికంగా నలభై–యాభై మంది ఐసీఎస్‌ అధికారులను పిలిపించుకొని వారితో దేశ ప్రజల ఆకాంక్షలకు అవసరాలకు అనుగుణంగా సేవా భావనతో, మెలగాల్సి ఉంటుందనీ, మంత్రులు ఐదేళ్లకు వస్తుంటారు పోతుం టారు కానీ మీరు ఈ వ్యవస్థలో దీర్ఘకాలంగా పని చేసేవారు, అందుకే స్వతంత్రంగా నియమావళి ప్రకారం మెలగాలనీ కోరారు. 565 పైగా సంస్థానాలను ఇండియన్‌ యూనియన్‌లో విలీనం చేయడం వారి దృఢమైన సంకల్ప శక్తికి, నాయకత్వ సామర్థ్యాలకు నిదర్శనాలు. జూనాగఢ్‌  సంస్థానం సౌరాష్ట్రకు సమీపంలో ఉన్న ఒక చిన్న రాచరిక రాజ్యం. దాని నవాబు పాకిస్తాన్‌లో విలీనం చేస్తామని ప్రకటించినప్పుడు అత్యధిక ప్రజలు భారత్‌లోనే విలీనం కావాలని కోరుకున్నారు. అపుడు పటేల్‌ భారత సైన్యాన్ని జూనాగఢ్‌ సంస్థానానికి పంపి 1947 నవంబర్‌ 9న జూనాగఢ్‌ను భారతదేశంలో విలీనం చేశారు.

హైదరాబాద్‌ సంస్థానంలో నిజాం నవాబు తమ సంస్థానానికి సొంత కరెన్సీ, రైల్వే సైనిక వ్యవస్థను కలిగి ఉండడంతో హైదరాబాద్‌ను స్వతంత్ర దేశంగా ప్రకటిం చుకోవాలనే వాంఛ. అతను విలీనం కాకుండా భారత యూనియన్‌తో సంబంధాలు మాత్రమే కోరుకుంటున్నాడు. ఈ విషయాన్ని పటేల్‌ గ్రహించి నిజాంకు సమయం ఇవ్వడం ఉత్తమమని భావించారు. లార్డ్‌ మౌంట్‌బాటన్, నె్రçహూ సైతం నిజాంకు సాన్నిహిత్యంగా ఉండేవారు. వారు పటేల్‌తో చర్చలు జరిపి హైదరాబాద్‌ సంస్థానంపై సైనికచర్య ఉండవద్దని నిర్ణయించారు. దీన్ని ఆసరాగా తీసుకున్న నిజాం నవాబు  ఒకవైపు విదేశాలతో సంబంధాలు నెరపుతూ మరోవైపు ఆయుధాలు కొనుగోలు చేస్తూ తన సైనిక శక్తిని పెంచుకొన్నారు. సంస్థానంలో హిందూ ప్రజలపై పైశాచిక దాడులను చేసి, మతాంతరీకరణలను ప్రోత్సహించారు. ఇంకోపక్కన ఇత్తెహాదుల్‌ ముస్లిమీన్‌ను స్థాపిం పజేశారు. ఖాసీం రజ్వీ నాయకత్వంలోని రజాకార్లను పెంపొందింప జేశారు. దీన్నంతటినీ పటేల్‌ బాగా గమనిస్తూ హైదరాబాద్‌ రాష్ట్రానికి మిలిటరీ జనరల్‌గా మున్షిని నియమించారు. ఆయన హైదరాబాద్‌ రాష్ట్ర పరిస్థితులపై ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సమాచారాన్ని ఇచ్చేవారు. ఆనాటి వైస్రాయి లార్డ్‌ మౌంట్‌ బాటన్‌ పదవీ కాలం ముగిసిన వెంటనే ఇక పాత ఒప్పం దాలు చెల్లిపోయాయని భావించిన సర్దార్‌ పటేల్‌ సాహసంతో ఆపరేషన్‌ పోలో అనే సైనిక చర్యను చేపట్టి రజాకార్లను అంతం చేసి హైదరాబాద్‌ సంస్థానాన్ని 17 సెప్టెం బర్‌ 1948 న భారత యూనియన్‌లో విలీనం చేసి మువ్వన్నెల భారత పతాకాన్ని ఎగరవేయించారు. అలాగే గుజరాత్‌లోని ఖేడా, బార్డోలీ ప్రాంతంలో గాంధీజీ ప్రేరణతో  పటేల్‌ నడిపిన సత్యాగ్రహం, అపూర్వమైన రైతాంగ ఉద్యమం ఆయనకు చరిత్రలో చిరస్థానం కల్పిం చాయి. భారత ప్రభుత్వం 1991లో సర్దార్‌ పటేల్‌ను ‘భారత రత్న’తో సత్కరించింది. ఆయన జన్మదినాన్ని జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకుంటాము, ఈ భావాం జలితో ఆయనకు నివాళులు అర్పిస్తూ వారికి శత కోటి వందనాలు సమర్పించుకుందాం.

-బండారు దత్తాత్రేయ
వ్యాసకర్త గవర్నర్, హిమాచల్‌ప్రదేశ్‌

మరిన్ని వార్తలు