విశ్వగురు దార్శనికతే.. వివేకానంద తాత్వికత..

12 Jan, 2021 00:35 IST|Sakshi

సందర్భం

ప్రతి సంవత్సరం జనవరి 12న స్వామి వివేకానంద జయంతి  సందర్భంగా జాతీయ యువజన దినోత్సవాన్ని పాటిస్తుంటారు. బలమైన వ్యక్తిత్వం, విజ్ఞాన శాస్త్రం లోనూ, వేదాంతంలోనూ ఆయనకున్న అపారమైన విజ్ఞానం, మానవ, జంతు జీవితం పట్ల సహా నుభూతి అనేవి ఆయన్ని శాంతి, మానవజాతి దీపశిఖగా మలిచాయి. తన బోధనల ద్వారా ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది యువజనులకు స్ఫూర్తి కలిగించారు. లేవండి, మేల్కొనండి, లక్ష్యాన్ని చేరుకునేంతవరకు నిలిచిపోకండి అనేది యువతకు వివేకానంద ఇచ్చిన స్పష్టమైన పిలుపు. స్తంభనకు గురైన మానసిక స్థితి నుంచి బయటపడేందుకు ప్రపంచానికి ఆయన ఇచ్చిన సందేశం ఇది. భారతదేశం మతం, తత్వశాస్త్రాల పవిత్ర భూమి. ఇక్కడే మహాత్ములు, మహర్షులు ఎందరో జన్మించారు. ఇది త్యాగ భూమి.

మన వాస్తవమైన అస్తిత్వాన్ని లేదా హిందూ ఆలోచనా విధానాన్ని మర్చిపోయినందువల్ల మన దేశం వేల సంవత్సరాలుగా బానిసత్వంలో ఉంటూవచ్చిందని స్వామి వివేకానంద అన్నారు. సింహం పిల్ల తన కుటుంబం నుంచి వేరుపడి మేకల మందలో చేరినప్పుడు క్రమేణా అది కూడా ఆ మేకల్లాగే ప్రవర్తించేలా అన్నమాట. తాను సింహాన్ని అనే విషయం దానికి తెలీదు. దాని పరాక్రమం కానీ, దాని స్వభావం కానీ అది మర్చిపోయి ఉంటుంది.

సింహం ఆ మేకలమందపై దాడి చేసినప్పుడు సింహం పిల్ల దొరికిపోతుంది. తన బిడ్డ తన సొంత అస్తిత్వాన్నే కోల్పోయిందని సింహం గ్రహిస్తుంది. తర్వాత తన బిడ్డను అది బావి వద్దకు తీసుకెళ్లి దాని వాస్తవరూపాన్ని చూపించి దాని అసలు బలాన్ని అది తెలుసుకునేటట్టు చేస్తుంది. అదేవిధంగా భారతీయ సమాజం కూడా తన అస్తిత్వాన్ని కోల్పోయిందని వివేకానంద చెప్పారు. అందుకే మనం హిందువులం అని గర్వంగా చెప్పుకోవాలని పిలుపునిచ్చారు. హిందు ఉంటే జీవన స్థితి, జీవన శైలి అని చెప్పారు.

అమెరికాలోని చికాగోలో 1893 సెప్టెంబర్‌ 11న నిర్వహించిన ప్రపంచ మతాల సదస్సులో స్వామి వివేకానంద సుప్రసిద్ధ ప్రసంగం చేశారు. ‘అన్ని దేశాల పీడితులకు, భూమ్మీది అన్ని మతాలకు ఆశ్రయం ఇచ్చి గౌరవించిన దేశనుంచి నేను వచ్చాను. ఈ ప్రపంచానికి సహనం అనే పాఠాన్ని, సార్వత్రిక ఆమోదాన్ని నేర్పిన మతానికి చెందినవాడిని అని చెప్పుకునేందుకు నేను గర్వపడుతున్నాను. విశ్వజనీన సహనభావాన్ని మేము విశ్వసించడమే కాదు, ప్రపంచంలోని అన్ని మతాలు చెప్పేది సత్యమని మేము అంగీకరిస్తాము’ అని ఆయన చెప్పారు.

నా దేశ యువతరానికి ఉక్కునరాలు, ఇనుప కండరాలు, గొప్ప హృదయం, పిడుగులాంటి మనస్సు అవసరముంది. ఈ గుణాలతోనే వీరు దేశాన్ని మార్చగలరు.  ప్రపంచరంగంలో భారతీయ హోదాను వెలిగించడంలో యువత పెద్ద పాత్ర పోషిస్తుందని ఆయన విశ్వసించేవారు. ఒక సందర్భంలో యువత ఫుట్‌బాల్‌ కూడా ఆడాలని ఆయన చెప్పారు. అందుకనే ప్రధాని నరేంద్రమోదీ ఫిట్‌ ఇండియా అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది. వ్యాయామం ఆరోగ్యానికి, దీర్ఘాయువుకు, బలానిక, సంతోషానికి కూడా దారి తీస్తుంది. ఆరోగ్యకరంగా ఉండటమే మనిషి అంతిమ గమ్యం కావాలి. అన్నిరకాల చర్యలూ ఆరోగ్యం ద్వారా మాత్రమే పూర్తవుతాయి.

కోవిడ్‌ మహమ్మారి సమయంలో ప్రజలు ఆరోగ్యం పట్ల మరింత జాగరూకతతో వ్యవహరించారు. ఆరోగ్యకరమైన శరీరంలో వైరస్‌ ప్రభావం తగ్గుముఖం పట్టిందని తేలింది. ఈరోజు ప్రపంచమంతా ఆరోగ్యకరమైన శరీరానికి యోగా అవసరమని గుర్తించింది. ఇది మన ప్రాచీన జీవిత విధానంలో భాగమై ఉంటోంది.
భారతీయ సంస్కృతి ప్రాధాన్యత

విదేశాలు సాధించిన భౌతిక ప్రగతి భారత్‌కు అవసరమే కానీ మనం దానికోసం యాచించవద్దని స్వామి వివేకానంద విశ్వసించేవారు. మనం పాశ్చాత్య ప్రపంచానికి ఇవ్వాల్సిన దానికంటే ఎంతో ఎక్కువ మనవైపు ఉంది. పాశ్చాత్య ప్రపంచానికి మన అవసరం ఎంతో ఉంది. అలాగే పాశ్చాత్య ప్రపంచం నుంచి శాస్త్రీయ ఒరవడి విజ్ఞానం, కొత్త ఆవిష్కరణల గురించి ఆయిన తరచూ మాట్లాడేవారు. అదే సమయంలో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ఆయన ఎంతో గౌరవమిచ్చేవారు. ప్రాచ్యదేశాలు ఎన్నటికీ పాశ్చాత్యదేశాలు కాలేవు. అలాగే పాశ్చాత్య దేశాలు కూడా తూర్పు దేశాల్లాగా ఎన్నటికీ కాలేవు అని ఆయన చెప్పేవారు.

వివేకానంద విద్యా తాత్వికత, నూతన విద్యావిధానంవ్యక్తిత్వాన్ని నిర్మించే, ఆలోచనలను పెంచే, విజ్ఞానాన్ని విస్తరించే, మన కాళ్లమీద మనం నిలబడేలా చేసే విద్య మనకు కావాలి అని వివేకానంద అన్నారు. విద్య ప్రధాన లక్ష్యం మానవ సృష్టేనని ఆయన భావించారు. సాంప్రదాయిక, ఆధునిక విద్యావ్యవస్థలను ఆయన అద్భుతంగా అనుసంధానించారు. ఆయన విద్యా తాత్వికత ఇప్పటికీ సందర్భోచితమే. సమగ్ర దృక్పథం చేపట్టి శారీరక, మానసిక, నైతిక, ఆధ్యాత్మిక, వృత్తిగత అభివృద్ధితోపాటు వివక్ష లేని విద్యను, అందరికీ అందుబాటులో ఉండే విద్యను ఆయన బలపర్చారు.

అలాగే వాస్తవికమైన ఆధునిక దృక్పథంతో టెక్నాలజీ, వాణిజ్యం, పరిశ్రమ, సైన్స్‌కి సంబంధించిన పాశ్చాత్య విద్యకు కూడా ఆయన ప్రాధాన్యతనిచ్చారు. ప్రధాని నేతృత్పంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యావిధానం కూడా స్వామి వివేకానంద భావాలకు అనుగుణంగా ఉంటోంది. సైన్సుతో వేదాంతాన్ని సమగ్రపర్చాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. ప్రపంచం పిరికిపందల కోసం కాదు. మరింతగా తెలుసుకోవాలని కోరుకుంటున్నవారిదే ప్రపంచం అని ఆయన చెప్పారు.

దళితులు, మహిళలు, పేదల అభ్యున్నతి గురించిన భావన, కర్మ ప్రాధాన్యత అనేవి ప్రత్యేకించి స్వామి వివేకానంద ఆలోచనల్లో ఉండేవి. దరిద్రులలో నారాయణుడిని చూశారాయన. మానవ సేవే మాధవసేవ అని భావించారు. దరిద్రనారాయణ భావన ద్వారా ఆయన మానవవాదాన్ని మతంతో అనుసంధించారు. చికాగోలో సర్వమత సదస్సులో కూడా ఆయన విశ్వ సౌభ్రాతృత్వమే అన్ని మతాల సారాంశమన్నారు.

ఏ దేశ అభివృద్ధి అయినా దాని యువతపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి యువతలో మేధోపరమైన సదాలోచన జాతికి అవసరం. నేడు ప్రతిరాష్ట్రమూ మాదకద్రవ్యాల సేవనం అనే సామాజిక దురాచారం పట్ల కలతచెందుతోంది. ప్రభుత్వం చట్టాలను తీసుకొస్తోంది కానీ సమాజం తన స్థాయిలో పటిష్టమైన చర్యలు తీసుకోవాలి.

-బండారు దత్తాత్రేయ 
(నేడు స్వామి వివేకానంద 158వ జయంతి)
వ్యాసకర్త హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌

మరిన్ని వార్తలు