Bandi Sanjay: కోటి ఎకరాల మాగాణి కల నిజమౌతుంది!

25 May, 2022 12:35 IST|Sakshi

ఎన్నో ఆశలు ఆకాంక్షలతో సకల జనులు అనేక త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఉద్యమ పార్టీ అని చెప్పుకుంటున్న టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చినా ప్రజల ఆశలను కల్లలు చేసింది. బీజేపీ అధికారంలోకి వస్తే ‘ప్రతి చేనుకు నీళ్లు, ప్రతి చేతికి పని’ నినాదాన్ని నిజం చేస్తాం.

తెలంగాణ మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున నడుస్తున్న రోజుల్లో, ఒక పిలగాడు, ‘సార్‌ తెలంగాణ వస్తే ఏమైతది?’ అని వాళ్ల సారును అడిగిండు. ‘‘తెలంగాణ వస్తే ఆంధ్ర వలస పాలకుల పాలన అంతమైతది. మన పాలన వస్తది. ఫలితంగా తెలంగాణ నదుల నీళ్లు, తెలంగాణ భూముల్లోనే పారుతయ్‌. నీళ్లొస్తే పంటలు పండతయ్‌. రైతు చెయ్యి తిరుగుతది కాబట్టి, నాలుగు చేతులకు పనులు దొరుకుతయ్‌. ఈడ్నే పని దొరుకుతది కాబట్టి, మీ అమ్మానాన్నల లెక్క దేశం పట్టుకోని బోయినోళ్లంతా ఊరికి తిరిగొస్తరు. పడావువడ్డ ఊర్లన్ని పచ్చబడతయ్, ఇగో మన ఈ బడి గూడా మంచిగైతది, ఈ బల్లె చదువుకున్న నీలాంటోళ్లం దరికీ కొలువులొస్తయ్‌. అందుకే, తెలంగాణ రావా లని అందరూ కొట్లాడుతున్నరు’’ అని చెప్పిండు ఆ సార్‌. ఆ సారే కాదు, ఆ రోజుల్లో తెలంగాణల ఉన్న ఉపాధ్యాయులు, మేధావులు అందరూ ఇట్లనే విడమరిచి చెప్తుండే. రైతులు, కార్మికులు కూడా అట్లనే కలలు కంటుండే. ఆ మాట చెప్పినంక కాలచక్రం గిర్రున పదేండ్లు తిరిగింది. తెలంగాణ వచ్చి కూడా ఎనిమిదేండ్లు అయ్యింది. ఆ సారు పిలగానికి చెప్పిన ఒక్కమాట కూడా నిజం కాలే! ఆఖరికి ఆ సర్కారు బడే పడావువడే స్థితికి చేరుకున్నది.

నీళ్లు, నిధులు, నియమకాలు అనే నినాదంతో సకల జనులు ఉద్యమం చేసి, త్యాగాలు చేసి తెలంగాణ సాధించుకున్నరు. ఉద్యమ పార్టీ అని నమ్మి, యావత్‌ తెలంగాణ ప్రజల తలరాతల్ని టీఆర్‌ఎస్‌కు తాకట్టు పెట్టినం. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. కృష్ణ, గోదావరి పరీవాహక జిల్లాల్లో ఇంకా నీళ్ల గోసలు తీరలే. ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు ఎత్తిపోతలను పూర్తి చెయ్యడం మినహా తెలంగాణలో మొదలు పెట్టిన కృష్ణా ప్రాజెక్టులేవీ కేసీఆర్‌ ప్రభుత్వం సగం కూడా పూర్తిచెయ్యలే. ఇక్కడ టీఆర్‌ఎస్‌ ఈ ఎనిమిదేండ్లలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది. తెలంగాణకు పట్టిన ఈ నియం తృత్వ కుటుంబ పాలన పీడను వదిలించుకుంటేనే, మనం కలలు కన్న తెలంగాణను నిర్మించు కోగలం. 

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అందరికంటే ముందు డిమాండ్‌ చేసిన పార్టీగా, భారతీయ జనతాపార్టీకి రాష్ట్రం గురించీ, రాష్ట్ర ప్రజల అవసరాలు, ఆకాంక్షల గురించీ స్పష్టమైన, సమగ్ర మైన అవగాహన ఉంది. గోదావరి జలాలను సమర్థవంతంగా, సంపూర్ణంగా వినియోగించు కోవడం కోసం పాదయాత్ర జరిపిన తొలి పార్టీ బీజేపీ. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను సాకారం చేయడంలో బీజేపీ అత్యంత కీలక పాత్ర పోషించింది. సకల జనులు కలలు కన్న తెలంగాణను పునర్మించడానికి బీజేపీకి స్పష్టమైన ప్రణాళికలు ఉన్నయ్‌.

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముందుగా ‘ప్రతి చేనుకు నీళ్లు, ప్రతి చేతికి పని’ నినాదంతో పని చేస్తాం. కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం సంకల్పించిన నదుల అనుసంధాన కార్యక్రమంలో భాగంగా కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం ద్వారా 100 టీఎంసీల నీటి తరలింపుతో ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, పాలమూరు జిల్లాల్లో సాగునీటి సౌకర్యం కల్పిస్తాం. కృష్ణా, గోదావరి నదులపై నిర్మించే సాగునీటి ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలోని ప్రతి చేనుకూ నీళ్లందిస్తం. ప్రతి గ్రామంలోని అన్ని చెరువులు, కుంటల అభివృద్ధి, కట్టలు, తూములు, అలుగులు మత్తడులను పటిష్టం చేయడం ద్వారా భూగర్భ జలాలను పెంచుతం.

పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు కావాల్సిన వనరులను కేటాయించి, గడువులోపల ప్రాజెక్టు నిర్మాణం చేస్తం. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేస్తం. మక్తల్‌ నారాయణ పేట కొడంగల్‌ ఎత్తిపోతల పథకం ద్వారా నారాయణ్‌ పేట్, కొడంగల్‌ ప్రాంతాల్లో ఉన్న పొలాలకు నీళ్లు తీసుకొస్తం. (👉🏾చదవండి: పెద్దల సభలో బలమైన బీసీ వాణి!)

గోదావరి జలాల ట్రిబ్యునల్‌ తెలంగాణకు కేటాయించిన 954 టీఎంసీల నీటిలో ప్రస్తుతం 433 టీఎంసీల నీటిని వివిధ ప్రాజెక్టుల ద్వారా వినియోగిస్తున్నరు. మిగతా 521 టీఎంసీల నీటి వినియోగానికి బీజేపీ ప్రాధాన్యత ఇస్తది. శ్రీరాం సాగర్, ఎల్లంపల్లి ప్రాజెక్టుల మధ్య గండ్లపేట, తాడ్‌ పాకల్, ఎడ్దండి, వేములకర్తి, మేడంపల్లి, జగన్నాథపూర్, రంగసాగర్, కొమురపల్లి, తిమ్మాపూర్‌ వద్ద ఎలాంటి ముప్పు లేకుండా 37 టీఎంసీల సామర్థ్యంతో నీటిపారుదల, విద్యుత్‌ ఉత్పత్తి, చేపల పెంపకం, పారిశ్రామిక అవసరాలతోపాటు పర్యాటక అభివృద్ధికి 9 బ్యారేజ్‌లను నిర్మిస్తం. తెలంగాణలో ప్రతి చేను తడిచేలా కాల్వలు తవ్విస్తాం. కోటి ఎకరాల మాగాణిని చేతల్లో చూపించి, ప్రతి చేతికి పని అందిస్తాం. అదే బీజేపీ లక్ష్యం. (👉🏾చదవండి: భూ పంపిణీయే పరిష్కార మార్గం!)


- బండి సంజయ్‌ కుమార్‌ 
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్‌ ఎంపీ

మరిన్ని వార్తలు