అగ్నిపథ్‌ పథకం: ప్రతిపక్షాలు దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి

22 Jun, 2022 08:13 IST|Sakshi

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్‌’ స్కీం విషయంలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్, కమ్యూనిస్టు పార్టీలు సృష్టించిన గందరగోళం వల్ల కొంతమంది యువకులలో అపోహలు, అనుమానాలు తలెత్తాయి. దాని ఫలితమే సికిందరాబాద్‌  రైల్వే స్టేషన్‌తో పాటు దేశంలో కొన్ని ప్రాంతాలలో జరిగిన హింసాకాండ. ముందు ‘అగ్నిపథ్‌’ అంటే ఏమిటి, దాని మంచి చెడులు ఏమిటనే విషయాలు తెలుసుకుంటే కానీ ఈ నిరసనలు ఎంత అవగాహనా రాహిత్యంతో చేస్తున్నవో అర్థం కావు.

ఆర్మీలో పని చేయడాన్ని ప్రతిపక్షాలు ఒక ఉపాధి మార్గంగా చూపెడుతూ యువతను పక్కదారి పట్టిస్తున్నాయి. సైన్యంలో పనిచేయడం అంటే దేశానికి సేవచేసే అవకాశం దక్కించు కోవడమే. ఈ అవకాశం అందరికీ లభించదు. కానీ, ఇప్పుడు ప్రవేశపెట్టిన ‘అగ్నిపథ్‌’ పథకం ద్వారా ఎంతో మంది యువతకు దేశానికి సేవచేసే అవకాశం లభిస్తుంది. 17.5 నుండి 23 ఏళ్ల వయసున్న యువకులను ‘అగ్నిపథ్‌’ క్రింద త్రివిధ దళాల్లోకి ఎంపిక చేసుకుంటారు. ఇలా ఎంపికైన వారిని ‘అగ్నివీర్‌’ అని పిలుస్తారు. ఈ అగ్నివీరులకు 6 నెలల పాటు శిక్షణ ఇస్తారు.

వీరికి ప్రతి నెలా ఇచ్చే ప్యాకేజీలో 70 శాతం చేతికిస్తారు. మిగిలిన 30 శాతాన్ని ‘అగ్నివీర్‌ కార్పస్‌ ఫండ్‌’కు జమ చేస్తారు. దీనికి సమానమైన 30 శాతం డబ్బులను కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఫండ్‌కు జమ చేస్తుంది. తమ నాలుగేళ్ల సర్వీస్‌ కాలంలో ఉత్తమ ప్రతిభ కనబరచిన 25 శాతం మంది అగ్నివీరులను సైన్యంలో కొనసాగిస్తారు. మిగిలిన 75 శాతం మందికి కార్పస్‌ ఫండ్‌లో జమ చేసిన నిధికి వడ్డీని జోడించి మొత్తం 11 లక్షల 71 వేల రూపాయల ‘సేవా నిధి ప్యాకేజీ’ అందిస్తారు. దీనిపై ఆదాయపు పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. ఈ నాలుగేళ్ల కాలంలో నిబంధనల ప్రకారం ఇతర సౌకర్యాలు, రాయితీలు కూడా ఉంటాయి. అగ్నివీరు లకు ఎలాంటి ప్రీమియం చెల్లించకుండా రూ. 48 లక్షలు ఇన్సూరెన్స్‌ కవరేజ్‌ ఉంటుంది. సైన్యంలో ఉండగా ఏ కారణం వల్ల మరణించినా ఈ జీవిత బీమా సొమ్ము వారి కుటుంబానికి అందుతుంది. అంతేకాక విధి నిర్వహణలో చనిపోతే రూ. 44 లక్షల ఎక్స్‌గ్రేషియా (నష్టపరిహారాన్ని) కూడా చెల్లిస్తారు. శాశ్వత అంగవైకల్యం సంభవించిన వారికి రూ. 44 లక్షలు, పాక్షిక అంగ వైకల్యం సంభవించిన వారికి రూ. 25 లక్షలు, తాత్కాలిక అంగ వైకల్యం సంభవించిన వారికి రూ. 15 లక్షలు పరిహారంగా అందిస్తారు. 

ఈ పథకం క్రింద 4 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసు కున్న యువతకు 12వ తరగతికి సమానమైన సర్టిఫికెట్, బ్రిడ్జి కోర్సు, ఇతర నైపుణ్యాలు వారికి అందుతాయి. ఒకవేళ వారు ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే బ్యాంకు రుణాలు సుల భంగా అందేలా ఏర్పాట్లు కూడా చేస్తారు. 

తాజాగా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా మరో మంచి నిర్ణయాన్ని ప్రకటించారు. ‘అగ్నిపథ్‌’లో పనిచేసిన వారికి కేంద్ర సాయుధ బలగాల ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తున్నట్లు చెప్పారు. సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్, బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్, సశస్త్ర సీమా బల్, నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్స్, స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ వంటి ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు మాజీ అగ్నివీరులకు కల్పిస్తారు. ఇదో గొప్ప నిర్ణయం. అలాగే రక్షణ శాఖ ఉద్యోగాల్లోనూ 10 శాతం రిజర్వేషన్లు వీరికి కల్పిస్తా  మని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటించారు. ఇండి యన్‌ కోస్ట్‌గార్డ్స్, డిఫెన్స్‌ సివిలియన్‌ పోస్టులతో పాటు రక్షణ రంగం కిందకు వచ్చే 16 శాఖల్లో ఈ 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తారు. ఈ రిజర్వేషన్‌ మాజీ సైనికులకు ప్రస్తుతమున్న రిజర్వేషన్‌ కోటాకు అదనంగా ఉంటుందని ఆయన తెలి పారు. 

ప్రతిపక్షాలు ఈ వివరాలను ఏమీ చెప్పకుండా యువతను తప్పుదోవ పట్టించి, హింసాత్మక ఘటనలకు ప్రేరేపించే పనికి పూనుకోవడం బాధాకరం. ఒక నిరుద్యోగి ఖాళీగా ఉంటూ ఇబ్బంది పడటం కంటే, ‘అగ్నిపథ్‌’లో నాలు గేళ్లు పనిచేయడం వల్ల  ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం ఉంది. అంతకంటే గొప్ప విషయం ఏమిటంటే ఆర్మీలో పని చేయడంవల్ల దేశభక్తి, క్రమశిక్షణ, సమాజం పట్ల బాధ్యత పెరుగుతుంది. తద్వారా సమాజానికి మేలు జరుగుతుంది. 

‘అగ్నిపథ్‌’ వంటి విధానాలు అనేక దేశాలలో ఇప్పటికే విజయవంతంగా నిర్వహిస్తున్నారు. రష్యా, బ్రెజిల్, ఇజ్రా యిల్, యూఏఈ, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, సింగ పూర్, స్విట్జర్లాండ్, థాయిలాండ్, టర్కీ దేశాల్లో ఈ విధానం ఎప్పటి నుండో అమల్లో ఉంది. ఇజ్రాయిల్‌లో అమ్మాయి లైనా, అబ్బాయిలైనా కనీసం 2 సంవత్సరాల పాటు ఆర్మీలో పని చేయాలి. అవసరమైతే అబ్బాయిలు మరో ఏడాది, అమ్మాయిలు మరో 8 నెలలు పనిచేయాలి. బ్రెజిల్‌లో 18 ఏళ్లు దాటగానే... ప్రతి యువకుడూ 12 నెలలు తప్పని సరిగా ఆర్మీలో పనిచేయాలి. ఇరాన్‌లో కూడా 18 ఏళ్లు దాట గానే ప్రతి అబ్బాయూ కనీసం 20 నెలల నుంచి 24 నెలలు తప్పనిసరిగా ఆర్మీలో పనిచేయాలి. ఉత్తర కొరియాలో పది హేడేళ్లు నిండిన ప్రతి కుర్రవాడూ ఆర్మీలో చేరి 30 ఏళ్ల వయసు వరకు సైన్యంలో పనిచేయాలి. దక్షిణ కొరియాలో 18 ఏళ్లు నిండి, శారీరకంగా దృఢంగా ఉన్న ప్రతి యువ కుడూ 2 సంవత్సరాలు ఆర్మీలో పని చేయాలి. 28 సంవత్స రాలు నిండే లోపు ఈ 2 సంవత్సరాల సర్వీస్‌ పూర్తి చేయాలి. రష్యాలో ఒకప్పుడు ప్రతి అబ్బాయీ 2 సంవత్సరాలు ఆర్మీలో పనిచేయాల్సిందే. ఆ నిబంధనను 2008లో ఒక ఏడాదిగా మార్చారు.

ఈ విషయాలన్నీ యువత అర్థం చేసుకోవాలి. లేని పక్షంలో  బీజేపీని బదనాం చేసేందుకు కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు మరిన్ని అభూతకల్పనలకు పాల్పడే అవకాశం ఉంది. ఆర్మీ జవాన్‌ కావాలనుకునే వారికి క్రమశిక్షణ, దూర దృష్టి ఉండాలి. వాస్తవాలు తెలుసుకోకుండా కొంతమంది దుందుడుకుతనంతో వ్యవహరించడం వల్ల వారికి వ్యక్తి గతంగానూ, కుటుంబ పరంగానూ తీరని నష్టం జరుగు తుంది. అంతకు మించి వీరి ప్రవర్తన సమాజానికి మరింత కీడు అనేది గుర్తుంచుకోవాలి. 


:::తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌ 

మరిన్ని వార్తలు