ఎవుసం బాగుండాలే... రైతన్న బాగుపడాలే

27 Jul, 2022 13:30 IST|Sakshi

ఇప్పటివరకు రెండు విడతలుగా పాదయాత్ర చేసిన. మూడో విడత పాదయాత్ర ఆగస్ట్‌ 2న యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నర్సింహా దేవాలయం నుంచి వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారి దేవాలయం వరకు కొనసాగనున్నది. ప్రజా సమ స్యలను తెలుసుకోవడం, ఇబ్బందుల్లో ఉన్న రైతాంగానికి భరోసా ఇవ్వడం, యావత్‌ తెలంగాణ ప్రజలపట్ల కేసీఆర్‌ సర్కార్‌ అను సరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టడంతో పాటు రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అనే విశ్వాసాన్ని ప్రజల్లో నింపడమే ఈ పాదయాత్ర లక్ష్యం. 

కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉన్న రైతాంగం కోసం ‘ఫసల్‌ బీమా యోజన’ పథకం తీసుకువచ్చింది. దీని వల్ల అకాల వర్షాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు సంభ వించినప్పుడు రైతాంగానికి సత్వరమే నష్టపరిహారం చెల్లించే వీలు ఉంది. కానీ కేసీఆర్‌ ప్రభుత్వం ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయడం లేదు. రైతుల పట్ల కేసీఆర్‌ చిత్తశుద్ధికి ఇదే నిలువెత్తు నిదర్శనం.

రాష్ట్రంలో 14 లక్షల మంది కౌలు రైతులున్నరు. కౌలు రైతులకు ఎటువంటి సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేయడం లేదు. కౌలు రైతుకు ‘రైతు బంధు’ పథకం ఎటూ అమలు కాకపోయినా... ఉచిత ఎరువులు, సబ్సిడీ రుణాల వంటి సౌకర్యాలన్నా ఉండాలి కదా. కౌలు రైతులు గుర్తింపు కార్డులతో నాబార్డు నుంచి రుణాలు పొందే సౌకర్యం ఉన్నా ప్రభుత్వం అందుకు సహకరించడం లేదు.

ఏక కాలంలో లక్ష రూపాయల వరకూ ఉన్న రైతుల రుణాలను మాఫీ చేస్తమని కేసీఆర్‌ ఎన్నికల్లో వాగ్దానం చేసిన్రు. ఆ హామీ ఇప్పటికీ సంపూర్ణంగా అమలు కాలే. లక్ష లోపు రుణమాఫీ కావాల్సిన వారు ఇప్పటికే 31 లక్షల మంది ఉన్నరు. రూ. 25 వేల నుండి రూ. 50 వేల వరకు రుణమాఫీ కావాల్సిన వారు 5.72 లక్షలు, రూ. 50 వేల నుంచి 75 వేల వరకు రుణమాఫీ కావాల్సిన రైతులు 7 లక్షల మంది ఉన్నరు.

రైతన్నలను మరింత వణికిస్తున్న సమస్య ‘ధరణి’. రైతాంగం ఎదుర్కొంటున్న మొత్తం సమస్యలకు ‘జిందాతిలిస్మాత్‌’లా ధరణి పోర్టల్‌ పనిచేస్తదని కేసీఆర్‌ డాంబికాలు పలికిన్రు. కానీ ఆచరణలో ధరణి పేరెత్తితే రైతులు హడలెత్తి పోతున్నారు. పాస్‌పుస్తకం చేతిలో ఉన్నా, ఆ భూమికి యజమాని తామేనా? కాదా?  అన్న రీతిలో  రైతన్నల దుఃస్థితి నెలకొన్నది.

అసైన్డ్‌ భూములను సైతం ప్రభుత్వం వదలడం లేదు. అసైన్డ్‌ భూముల్లో వెంచర్లు వేస్తూ ప్రభుత్వం పేదల ఉసురు తీస్తున్నది. ఒక్క ‘రైతుబంధు’ ఇచ్చి అన్ని సబ్సిడీలు బంద్‌ పెట్టిన ఘనత కేసీఆర్‌దే. ట్రాక్టర్ల సబ్సిడీ బంద్‌. వ్యవసాయ పనిముట్ల సబ్సిడీ బంద్‌. ‘రైతునే రాజు చేస్తా, బంగారు తెలంగాణలో ఎరువు లన్నీ ఉచితంగా అందిస్తాన’న్న కేసీఆర్‌ మాటలు నీటి మూటలయ్యాయి. 

ఇక పోడు రైతుల సమస్యలు చెప్పనలవి కాదు. ముఖ్యమంత్రి కేసీఆరే స్వయంగా కుర్చీ వేసుకుని పోడుభూముల పట్టా సమస్యలను పరిష్క రిస్తామని చెప్పిన్రు. పోడుభూముల సమస్య పరిష్కారం కాకుం డానే అదే భూముల్లో ఫారెస్ట్‌ అధికారులు వన సంరక్షణ పేరుతో మొక్కలు నాటుతుంటే కేసీఆర్‌ గుడ్లు అప్ప గించి చూస్తున్రు.

రైతులు పండించిన ధాన్యం కొనుగోళ్ళ విష యంలో కేంద్రం స్పష్టమైన వైఖరిని ప్రకటించినా రాష్ట్రప్రభుత్వం ఆ సమస్యను రాజకీయం చేయాలను కున్నది. ఎఫ్‌సీఐ సోదాల్లో బయటపడ్డ రైస్‌మిల్లర్ల అక్ర మాలను కప్పిపుచ్చేందుకు రాష్ట్రప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. గన్నీబ్యాగుల కొనుగోలు నుంచి ధాన్యం నిల్వ వరకూ ప్రతిపైసా కేంద్రమే చెల్లిస్తున్నా ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్రప్రభుత్వం నానా యాగీ చేసింది.

‘వరేస్తే ఉరే’ అంటూ కేసీఆర్‌ చేసిన ప్రకటన వల్ల యాసంగిలో 14 లక్షల ఎకరాలలో రైతులు వరిపంట వేయక నష్టపోయారు. రైతులకు ప్రత్యామ్నాయ పంటల విషయంలోనూ ప్రభుత్వం తగిన సూచనలు ఇచ్చిన దాఖలాలు లేవు. ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడం వల్ల యాసంగి పంటను దళారులు కోరిన రేటుకే రైతులు అమ్ము కోవాల్సిన దుఃస్థితిని కేసీఆర్‌ కల్పించిన్రు. రైతు బంధుకు సకాలంలో నిధులియ్యరు.

కుంటిసాకులు చెప్పి రైతుల బీమాను పక్కాగా అమలు చేయరు. రైతు రుణ మాఫీ ఊసే ఎత్తరు. కాళేశ్వరం పేరుతో ఖజానా ఖాళీ చేసిన కేసీఆర్‌ సర్కార్‌ మొన్నటి వరదల్లో మేడిగడ్డ సహా ఇతర లిఫ్టుల పరిస్థితి చూసి, ఇప్పుడు ప్రజల దృష్టి మళ్లియ్యడానికి నానా తిప్పలు పడుతున్నది. గిట్టుబాటు ధర అడిగిన రైతులకు బేడీలు వేసి జైళ్లకు పంపిన ఘనమైన చరిత్ర కూడా కేసీఆర్‌ ప్రభుత్వానిదే. కేసీఆర్‌ ప్రజలకు చేసింది శుష్కవాగ్దానాలు, శూన్య హస్తం తప్ప వేరే ఏమీ కనిపించవు.

తెలంగాణ రైతాంగం పట్ల కేసీఆర్‌ అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టేందుకు బీజేపీ ‘ప్రజాసంగ్రామ పాదయాత్ర’ చేపట్టింది. రైతుల కోసం కేంద్రం అమలు చేస్తున్న వివిధ పథకాలను కూడా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నీరు గారుస్తున్నది. రైతాంగం పట్ల కేసీఆర్‌ తీరును ప్రశ్నించేందుకు ఈ ప్రజా సంగ్రామ పాదయాత్రను ఒక అవకాశంగా భారతీయ జనతా పార్టీ భావిస్తున్నది. వ్యవసాయ రంగం అభివృద్ధి, రైతుల సంక్షేమమే ధ్యేయంగా సాగనున్న ఈ ప్రజా సంగ్రామ పాద యాత్రకు తెలంగాణ రైతాంగం అంతా బాసటగా నిల వాలని కోరుతున్నాం. ఎవుసం బాగుండాలే, రైతన్న బాగు పడాలే... అదే బీజేపీ లక్ష్యం. అందుకే నా పాదయాత్ర!


- బండి సంజయ్‌కుమార్‌ 
కరీంనగర్‌ పార్లమెంటు సభ్యులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు

మరిన్ని వార్తలు