Bapatla Agricultural College: తల్లీ! నీ కీర్తి అజరామరం

20 Jan, 2023 15:23 IST|Sakshi

తల్లీ... నీకు 75 సంవత్సరాలు. నీ ఒడిలో అక్షరాలు దిద్దుకున్న ఎందరో నీ కీర్తి పతాకను వినువీధుల్లో ఎగురవేశారు. అంతర్జాతీయ వ్యవసాయరంగ చిత్ర పటంలో నిన్ను నిలిపారు. సముచిత స్థానం కల్పించి నిన్ను గర్వపడేలా చేశారు. వరిలో జయ, హంసలతో శాస్త్రి, సాంబ మాషూరితో ఎం.వి. రెడ్డి; స్వర్ణతో రామచంద్రరావులు సుపరిచితులు. జొన్న పంటకు జీవం తెచ్చిన గంగా ప్రసాదరావు, చిరుధాన్యాలను ఇంటి పేరు చేసుకున్న హరి నారాయణలు నీ బిడ్డలే. మీ పిల్లలు మామూలు వాళ్ళు కారు. కాలాన్ని బట్టి, పంటలను శాసించి, వాటిలో మార్పులు తెచ్చి రైతుకు భరోసా ఇచ్చారు.

చెరకును పీల్చి పిప్పి చేసి రైతుకు తియ్యని రసం అందించిన కోటికలపూడి నుంచి జరుగుల దాకా అందరూ నీ చనుబాలు తాగిన వారే. నరసింహ, బ్రహ్మ, ప్రత్తి రవీంద్ర నాథ్‌ నుండి జెన్నీ జాదు జాక్పొట్‌ వరకు... ఇలా చెప్పుకుంటూ పోతే నీ పిల్లల ఘన చరిత అనంతం. నేర్పిన విద్య, సంపద అంతా సమాజానికి సమంగా చెందాలనే ఉన్నత ఆశయంతో వెన్నెల పంచిన వేమూరి చంద్ర శేఖరుడు, ప్రాణత్యాగం చేసిన గోపబోయిన ప్రసాద్‌లు కూడా నీ ఒడిలో అక్షరాలు దిద్దినవారే.

నీ 50 ఏళ్ల ప్రస్థానాన్ని ఒక కమనీయ దృశ్య రూపకంగా మలచి దూరదర్శన్‌ ద్వారా ప్రసారం చేసిన బొగ్గవరపు, హైదరాబాద్‌ ఆకాశవాణి కేంద్రం ద్వారా ఒక సంవత్సర కాలం పాటు నీ స్వర్ణోత్సవ గీతం ఆలపించిన ఈలప్రోలు, వాతావరణ మార్పులకు సంబంధించి విశ్వానికంతటికీ సలహాలు, సూచనలు ఇస్తున్న శివుడూ, శ్రీనివాసుడూ ఇద్దరూ నీ పిల్లలే కావటం ఒకింత గర్వకారణమే కదా! కనుచూపు మేర పరిపాలన, శాంతి భద్రతలు, పర్యా వరణం, అడవులు, రైల్వేలు, గనులు, మీడియా, కస్టమ్స్, ఆదాయ పన్ను, బ్యాంకింగ్, ఆర్థిక, వాణిజ్య, వ్యాపార, రాజకీయ, పారిశ్రామిక, సామాజిక, సేవారంగాలలో ఆరితేరిన మెరికలుగా గుర్తింపు పొందిన వారంతా నీ ఒడిలో పెరిగిన పిల్లలే. అయ్యంగార్‌ ఇండోర్‌ స్టేడియం ఇచ్చారు. గోవింద రాజులు నాబార్డ్‌ తరపున ఓ పెద్ద భవనం ఇచ్చారు. 

కరోనా ప్రభావం తగ్గాక నీ పిల్లలు ప్రత్యేక రీతిలో సావనీర్‌లు తెస్తున్నారు. 1962, 1969, 1972, 1997, 1977, 1978  బ్యాచ్‌లు వారి వారి అనుభవాలను కలబోసుకున్నారు. అంతకుముందే 1964 వారు ప్రచురించిన సావనీర్‌ అందరికీ రోల్‌ మోడల్‌ అయింది కూడా. కరోనా అంటే నీ కెందుకు భయం. కరోనాకు చెక్‌ పెట్టేందుకు సీసీఎంబీ తయారు చేసిన ఎంఆర్‌ఎన్‌ఏ టీకా శాస్త్రవేత్తల బృంద నాయకులు నాళం మధు... బాపట్ల ఒడిలో నీవు లాలించిన బిడ్డే కదమ్మా.

పిల్లలు అంతా ఇలా ఒకరిని చూసి మరొకరు గుంపులు గుంపులుగా కలుస్తూ ప్రస్తుతం కళాశాలలో ఉన్న నాలుగు బ్యాచ్‌లకూ స్ఫూర్తినిచ్చేందుకు ప్లాటినం జూబిలీ ముగింపునకు తరలి వస్తున్నారు. గత వైభవం అంతా ఈ తరానికి అందించి, వారూ స్ఫూర్తి పొంది, మంచి భవిష్యత్‌కు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకు సాగుతారని. అందుకే అమ్మా... నీ బిడ్డలు వారి వారి బ్యాచ్‌ల పేరుతో గోల్డ్‌ మెడల్స్‌ ఏర్పాటు చేసింది. తప్పులుంటే మమ్ము క్షమించు తల్లీ!

– వలేటి గోపీచంద్, 1980 బ్యాచ్‌ విద్యార్థి
(రేపు బాపట్ల వ్యవసాయ కళాశాల ప్లాటినం జూబిలీ ఉత్సవాల ముగింపు వేడుక) 

మరిన్ని వార్తలు