నిండు ప్రాణాన్ని నిలువునా మింగిన అవ్యవస్థ..!!

2 May, 2021 00:44 IST|Sakshi

సందర్భం

ప్రపంచం నలుమూలల్లోని కథనాలను ప్రజలకు చేరవేసే జర్నలిస్టు.. తాను స్వయంగా ఓ కథనానికి వస్తువైతే ఎలా ఉంటుంది? పదిహేను నెలలుగా కరోనా భూతం కథలను చెబుతూ వచ్చిన నేను ఇప్పుడు ఆ భూతం బాధితురాలిగా మిగిలిపోయా. మా నాన్న ‘స్పీడీ దత్‌’ను కరోనా కాటేసింది. నా ప్రపంచం కుప్పకూలినంత వేదన అనుభవించా. కోపం... ఆందోళన.. ఒంటరితనం అన్నీ ఒక్కసారి నన్ను చుట్టుముట్టాయి. కరోనా కాలంలో ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్న కుటుంబాల కథలే కదా నేను బోలెడన్ని చెప్పింది? అనిపించింది. 

ఎయిరిండియా మాజీ అధికారి అయిన మా నాన్న వాస్తవానికి ఓ సృజనశీలి. యంత్రాలను ముక్కలు ముక్కలు చేసి వాటిని మళ్లీ జోడించడంలో ఆనందాన్ని అనుభవించేవాడు. మిలమిల మెరిసే కళ్లు... రేపటిపట్ల నిరంతరం ఆశలు కలిగిన, శాస్త్రీయ దృక్పథం ఉన్న వ్యక్తి. మా నుంచి ఏమీ ఆశించని స్త్రీవాద తండ్రి కూడా. సోదరితోపాటు నాకూ నిర్భయంగా ఎక్కడికైనా ఎగిరిపోగల స్వేచ్ఛనిచ్చారు. మా భావోద్వేగాలను కానీ.. సమయాన్ని కానీ ఆశించకుండా.. బుల్లి విమానాలు, రైళ్లను సిద్ధం చేస్తూ గంటల సమయం గడిపేవారు.

తన తరువాత ఆ బొమ్మలన్నింటినీ పిల్లల అనాధాశ్రమానికి ఇచ్చేయాలని మాట కూడా తీసుకున్నారు. కోవిడ్‌ లాంటి విషాదం... మన బంధుమిత్రుల ఆప్యాయతలను, కాలాన్ని మన నుంచి దూరం చేస్తుంది. మన మెదడు, గుండెల్లో వారి జ్ఞాపకాలు తొలుస్తూంటే.. తీసుకున్న నిర్ణయాల్లో తప్పొప్పుల బేరీజు మనలను వెంటాడుతూనే ఉంటాయి. 
నాన్న చనిపోయి ఐదు రోజులవుతోంది. బుల్లి విమానాలు, రైళ్లు తయారు చేసేందుకు నాన్న సిద్ధం చేసుకున్న యూట్యూబ్‌ చానల్‌ ఓపెన్‌ చేస్తే చాలు... కళ్లల్లోని నీరు అప్రయత్నంగా కిందకు ఒలికిపోతున్నాయి. నాన్నకు మాటిచ్చి బతికుండగా నెరవేర్చేలేకపోయిన పనుల జ్ఞాపకాలు వెంటాడటం మొదలవుతుంది. (హిందుస్థాన్‌ టైమ్స్‌లో తాను రాసిన కథనాన్ని చూసుకోవాలన్నది వాటిల్లో ఒకటి). కోవిడ్‌ చుట్టుముట్టినప్పుడు చాలామంది వృద్ధుల మాదిరిగానే ఆయన కూడా ఆసుపత్రిలో చేరేందుకు అంతగా ఇష్టపడలేదు. చివరిరోజుల్లో తన వాళ్లకు దూరంగా ఉండాల్సి వస్తుందని భయపడ్డారేమో. వ్యాధి సోకిన తొలినాళ్లలో వైద్యులు మధ్యమస్థాయి లక్షణాలే కనిపిస్తున్నాయని, ఆక్సిజన్‌ మోతాదులుగా స్థిరంగా ఉన్నాయని చెప్పారు. ఇంట్లోనే చికిత్స కల్పించేందుకూ అంగీకరించారు. మెదాంతా ఆసుపత్రికి చెందిన వైద్యుల బృందం ఆయన పరిస్థితిని ఎప్పటికప్పుడు పరీక్షిస్తూం డేది. కానీ.. విపత్తు అంతా అకస్మాత్తుగా ముంచుకొచ్చింది. అనూహ్యంగా జ్వరం రావడం.. ఆక్సిజన్‌ మోతాదులు పడిపోవడం చకచక జరిగిపోయాయి. 

మెదాంతా ఆసుపత్రి అంబులెన్స్‌ కోసం వేచి చూస్తే సమయం వృథా అవుతుందేమో అన్న అందోళనలో అప్పటికప్పుడు ఓ ప్రైవేట్‌ అంబులెన్స్‌ ఏర్పాటు చేసుకున్నాం. తీరా చూస్తే అది అధ్వానస్థితిలో ఉన్న ఓ మారుతీ వ్యాన్‌గా తేలింది. డ్రైవర్‌ ఒక్కడే ఉన్నాడు. అవసరమైన ఏర్పాట్లన్నీ ఉన్నాయని, ఆక్సిజన్‌ సిలిండర్‌ కూడా పనిచేస్తోందని నమ్మబలకడంతో నేను డ్రైవర్‌ పక్క సీట్లో కూర్చున్నా. నాన్న అతడి సేవకుడు వెనుకన ఎక్కారు. ట్రాఫిక్‌ను దాటుకుని ఆసుపత్రి చేరేందుకు గంటకుపైగా సమయం పట్టింది. అంతసేపూ నాన్న అసౌకర్యంగానే వ్యాన్‌లోని టేబుల్‌పై పడుకుని ఉన్నారు. అంబులెన్స్‌లు సాఫీగా ప్రయాణిం చేందుకు గ్రీన్‌కారిడార్‌ ఒకటి ఏర్పాటు చేయాలని ఢిల్లీ పోలీసులను ఎంతో కాలంగా విజ్ఞప్తి చేస్తున్నా.. కర్ఫ్యూ అమలు కోసం రోడ్లపై ఏర్పాటు చేసిన బారికేడ్ల మధ్యనే మా ప్రయాణం సాగింది. 

శ్మశానంలో గందరగోళం...
నాన్నను మెదాంతా ఆసుపత్రికి చేర్చే సమయానికి ఆక్సిజన్‌ మోతాదులు గణనీయంగా పడిపోయాయి. ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో చేర్చాలని వైద్యులు తెలిపారు. అంబులెన్స్‌ ముసుగేసుకున్న ఆ డొక్కు వాహనంలోని సిలిండర్‌ పనిచేయలేదని, నాన్నకు ఏర్పాటు చేసిన ఆక్సిజన్‌ మాస్కు కూడా సరైంది కాదని అర్థమైంది. ఇవన్నీ ఎలా ఉన్నప్పటికీ వైద్యులు మాత్రం తమ శాయశక్తులా ప్రయత్నాలు చేశారు. వారికి నా కృతజ్ఞత మాటల్లో చెప్పలేను. 

కానీ.. నాన్న కొన్ని రోజుల కంటే ఎక్కువ సమయం బతకలేకపోయారు. రెండు రోజులపాటు వెంటిలేటర్‌పై గడిపి వెళ్లిపోయారు. ఆసుపత్రికి దగ్గరలోనే ఉండే శ్మశానంలో అంత్యక్రియలు నిర్వహించాలని ఆయన మృతదేహాన్ని తీసుకెళ్లాం. పలుమార్లు వార్తా కథనాల్లో వివరించినట్టుగానే.. అక్కడ కాసింత స్థలం కూడా కరవై ఉంది. కనీసం మూడు కుటుంబాల వారికి ఒకే టోకెన్‌ నెంబర్‌ ఒకే సమయానికి ఇవ్వడంతో ఒకపక్క గందరగోళం నడుస్తోంది. కుటుంబాల మధ్య వాగ్వాదం మొదలై అది కాస్తా గొడవకు దారితీసింది. పరిస్థితిని అదుపు చేసేందుకు చెల్లి పోలీసులకు ఫోన్‌ చేయాల్సి వచ్చింది. 

జర్నలిస్టుగా ఈ రకమైన సమస్యలపై.. తరచూ ఎన్నో ప్రశ్నలు లేవనెత్తి ఉంటాను నేను. కానీ.. ఆ ప్రశ్నలన్నీ ఆ సమయంలో నన్నే వెంటాడాయి. ప్రభుత్వం టీకా కార్యక్రమం మరింత ముందుగా మొదలుపెట్టి ఉంటే... మా నాన్న బతికి ఉండేందుకు ఎక్కువ అవకాశం ఉండేదేమో అనిపించింది. ఇంకో రెండు వారాల్లో రెండో డోసు తీసుకోవాల్సి ఉండగా నాన్న మరణించారు. డొక్కు మారుతీవ్యాన్‌ కోసం కాకుండా మరికొంత సమయం వేచి ఉండి మెదాంతా అంబులెన్స్‌లోనే నాన్నను ఆసుపత్రికి తీసుకెళ్లి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదా? నాన్న ఇప్పటికీ బతికి ఉండేవాడా? 

అయితే ఒక్క విషయం ఇంతటి కష్టంలోనూ ఒక జర్నలిస్టుగా నాకు లభించే ‘ప్రత్యేక’ సౌకర్యాల గురించి నాకు గుర్తుంది. వీట న్నింటి కారణంగా నాన్నకు కనీసం బతికేందుకు ఒక మంచి అవకాశమైనా లభించింది. ఆసుపత్రి గేట్ల వద్ద కుప్పకూలుతున్న వారు.. బెడ్లు, ఆక్సిజన్‌ దొరక్కుండా కన్ను మూస్తున్న వారెందరో! నాన్న మరణంతో అనాథను అయిపోయినా భారత ప్రభుత్వం కారణంగా అనాథలుగా మారిన వారికంటే నేను అదృష్టవంతురాలిననే అనుకుంటున్నా!!


బర్ఖా దత్‌ 
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌
(హిందూస్థాన్‌ టైమ్స్‌ సౌజన్యంతో..)

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు