మహోద్యమానికి మద్దతివ్వండి

28 Mar, 2022 12:51 IST|Sakshi

నేడు భారతదేశం రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాలలో తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతు న్నది. డెబ్బై ఐదు ఏళ్ల భారతదేశ స్వాతంత్య్ర సంస్మరణగా ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ పేరుతో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతున్నాయి. ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌’ పేరుతో భారతదేశ స్వావలంబన ఆవిష్కరణకు పూను కున్నట్లుగా చెబుతున్నారు. కానీ ఆత్మనిర్భర్‌ భారత్‌ బదులు ‘ఆత్మనిర్బల్‌ భారత్‌’గా మార్చి వేస్తున్నారు.

గత 75 ఏళ్ల నుంచి దేశ ప్రజల కష్టంతో, చెమట చుక్కలతో పెద్దల దార్శనికతతో సంపాదించిన ప్రభుత్వరంగ ఆస్తు లను మొత్తాన్నీ అధికారికంగానే అమ్మకానికి పెట్టారు. బహిరంగంగానే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు. ప్రపంచ స్థాయిలోని అన్ని కార్పొరేట్‌ సంస్థలకు భారతదేశ ప్రభుత్వరంగ సంస్థలను, దేశ సంపదను... ‘ప్రైవేటీకరణ ’, ‘పెట్టుబడుల ఉపసంహరణ’, ‘నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌’ పేరుతో అమ్మకానికి పెడు తున్నారు. ప్రపంచంలో ఎన్ని ఆర్థిక సంక్షోభాలు వచ్చినా ప్రభుత్వ రంగ సంస్థల వల్లనే మనదేశం నిలబడగలిగింది. మోదీ ప్రధాని కాకముందే ప్రపంచంలోని 6వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఉందనే విషయం మరువరాదు.

చేసిన ప్రమాణం ఏమయ్యింది?
‘హై సౌగంధ ముఝే ఇస్‌ మిట్టీకి, మై దేశ్‌ నహీ బిక్‌నా దూంగా’(దేశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మనివ్వనని దేశమాతపై ప్రమాణం చేసి చెబుతున్నాను) అంటూ నాటకీయ హావభావాలతో మోదీ అధికారంలోకి వచ్చిన కొత్తలో అనేకసార్లు అన్నారు. ఈ రోజు అందుకు భిన్నంగా జరుగుతున్నది. అధికారంలోకి వచ్చిన తర్వాత  దేశాన్ని కొద్దిమంది పారిశ్రామిక వేత్తలకు అతి తక్కువ ధరలతో ప్రభుత్వరంగ సంస్థలను అమ్మివేస్తున్నారు. 

స్వాతంత్య్ర తొలిదినాల్లో భారతదేశంలో కేవలం ఐదు ప్రభుత్వరంగ సంస్థలు రూ. 29 కోట్ల మూలధనంతో ఉండేవి. 2019 మార్చి నాటికి ఆ సంస్థల సంఖ్య 348కి చేరింది. వాటి మూలధనం రూ. 31,17,000 కోట్లయింది. ఇవి కేంద్ర ఖజానాకు రూ. 3,76,000  కోట్లు ప్రతి ఏడాదీ ఆదాయం సమకూరుస్తున్నాయి. ఐతే నీతి ఆయోగ్‌ సిఫార సులకు అనుగుణంగా 2021–22 బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ నిర్వహణలో ఉన్న 300 ప్రభుత్వరంగ సంస్థలను కేవలం 24 పరిశ్రమలుగా కుదిస్తామని పార్లమెంట్‌లో ప్రకటన చేశారు. అలాగే   రూ. 40 లక్షల కోట్లకు పైగా ఆస్తులున్న 58 బీమా రంగంలో ఉన్న సంస్థలనూ తెగనమ్మే పనిలో ఉంది కేంద్రం. గత ఐదేళ్లలో ఎల్‌ఐసీ ఒక్కటే రూ. 28,200 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టింది. ఎల్‌ఐసీని భారతదేశ బంగారు బాతుగా అభివర్ణిస్తారు. ఈనాడు ఎల్‌ఐసీని కూడా పెట్టుబడిదారులకు అప్పగిస్తున్నారు. అలాగే ప్రభుత్వ బ్యాంకుల ఆస్తుల విలువ దాదాపు రూ. 40 లక్షల వేల కోట్లు ఉంటుంది. 

మోదీ ప్రభుత్వం 28 ప్రభుత్వ బ్యాంకులను విలీనాల ద్వారా 12కు కుదించింది. 1921– 22లో బ్యాంకులకు రూ. 1.58 లక్షల కోట్ల నిర్వహణ (ఆపరేటివ్‌) నికర లాభాలు వచ్చాయి. ప్రభుత్వానికి వేలాది కోట్ల రూపాయలు డివిడెండ్‌ పేరుతో బ్యాంకులు చెల్లిస్తున్నాయి. అటువంటి కామధేను లాంటి బ్యాంకులలో మరో ఎనిమిదింటిని ప్రైవేటీకరించి, కేవలం 4 ప్రభుత్వ బ్యాంకులకు తగ్గిస్తారు. పేదవాడి గుండె చప్పుడు అయిన రైల్వే పరిశ్రమలో కూడా ప్రైవేటీకరణ ప్రారంభమైంది.

నాలుగు రంగాలే వ్యూహాత్మకమా?
2021–22 కేంద్ర బడ్జెట్‌లో ప్రవేశపెట్టబడిన నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ పథకం ప్రకారం కేవలం నాలుగు రంగాలను వ్యూహాత్మక రంగాలుగా పేర్కొన్నారు. అవి
1). అణు ఇంధనం, స్పేస్‌ అండ్‌ డిఫెన్స్, 2). ట్రాన్స్‌పోర్టు అండ్‌ టెలికమ్యూనికేషన్, 3). పవర్, పెట్రోలియం, కోల్, ఖనిజాలు, 4). బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఆర్థిక సేవలు. ఈ నాలుగు రంగాలలో మాత్రమే  వ్యూహాత్మకంగా అతి తక్కువ వాటాను అంటే 2 నుంచి 3 శాతం మాత్రమే కేంద్ర ప్రభుత్వం కలిగి ఉంటుంది.

అలాగే బ్రిటీష్‌ కాలం నుంచి ఉన్న 44 కార్మిక చట్టాలలోని కీలకమైన 29 చట్టాలను నాలుగు కోడ్‌లుగా మార్చి, సమ్మెచేయలేని పరిస్థితులు కల్పిస్తున్నారు. న్యాయ సహాయం కూడా అందని విధంగా చేసి ప్రభుత్వరంగ సంస్థల నుంచి ప్రభుత్వ సర్వీసు సెక్టార్‌ వరకు అన్ని రంగాలలో కార్మికులను రోడ్లపైకి తెస్తున్నారు. అలాగే 2015– 16లో 8.5గా ఉన్న పీఎఫ్‌ వడ్డీ రేటును 8.1కు తగ్గించడం జరిగింది. దీని ప్రభావం దేశంలో ఉన్న కోట్లాది మంది పెన్షనర్లపై పడుతుంది. కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ వలన ఇకపైన ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగాలు ఉండవు. ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు కార్మికులే మిగులుతారు. ప్రైవేటీకరణను గట్టిగా సమర్థించే మాంటెక్‌ సింగ్‌ అహ్లూవాలియా సైతం ప్రైవేటీకరణ వలన ఉద్యోగాలు కోల్పోవడం తప్పనిసరిగా జరుగుతుందనిపేర్కొన్నారు.

మొత్తంగా దేశంలోని కేవలం ఒక్క శాతం మినహా 140 కోట్ల మంది భవిష్యత్తును పణంగా పెట్టి దేశాన్ని అమ్మకానికి పెట్టిన నరేంద్ర మోదీకీ, ఆయన ప్రభుత్వా నికీ... ఆ అధికారం ఎవరిచ్చారు? (క్లిక్‌: ఆ ఒప్పందం సఫలం కావాలంటే...)

ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆస్తుల అమ్మకాన్ని అడ్డు కోకుంటే ఇప్పటికే ఆకలి సూచీ పట్టికలో 116 దేశాల్లో 101 స్థానంలో ఉన్న భారతదేశం మరింత సంక్షోభంలోకి నెట్టివేయబడుతుంది. ఆకలి చావులతో కూడిన కరవు దేశంగా మారే ప్రమాదం ఉన్నది. ఒక్క శాతం మంది చేతిలో 90 శాతం సంపద పేరుకుపోతే అది అభివృద్ధి కాదు. అంతులేని అసమానతల ప్రతీక!

ఈ నేపథ్యంలో దేశంలో ఈ నెల 28, 29 తేదీల్లో రెండు రోజులపాటు జరిగే సార్వత్రిక సమ్మెలో పాల్గొంటున్న కార్మికులకు దేశ ప్రజలు సంపూర్ణ మద్దతు ఇవ్వాలి. దేశాన్ని కాపాడుకోవడానికి అవసరమైతే రైతాంగ తరహా మహా కార్మిక ఉద్యమానికి దేశం సన్నద్ధం కావాలి. (క్లిక్‌: ఈ విజయం ఎలా సాధ్యమైంది?)

- కూనంనేని సాంబశివరావు 
మాజీ ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి

మరిన్ని వార్తలు