Nithish Kumar: బిహార్‌లో హనీమూన్‌ ముగిసినట్లేనా?

12 Aug, 2021 00:53 IST|Sakshi

విశ్లేషణ

ఎన్డీయే మద్దతుతో బిహార్‌ని పాలిస్తున్న ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ ఒక్క పెగసస్‌పైనే కాకుండా అనేక అంశాల్లో కేంద్ర ప్రభుత్వ విధానాలపై అసమ్మతిని వ్యక్తపరుస్తున్నారు. కులాలవారీ జనగణన విషయమై బిహార్‌ ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్‌తో నితీశ్‌ ఈమధ్య సమావేశమై చర్చించడం.. భవిష్యత్తులో ఆర్జేడీ, జేడీయూల మధ్య పొత్తు సాధ్యపడుతుందనే సంకేతాలు పంపింది.

ఆర్టికల్‌ 370 రద్దుకు నితీశ్‌ తొలినుంచీ అనుకూలం కాదు. రామాలయ నిర్మాణంపై కూడా జాగ్రత్తగా మౌనం పాటిస్తున్నారు. నిజానికి నితీశ్‌ ప్రతిపక్ష శిబిరంలో చేరితే ఏ ఇతర ప్రాంతీయ నాయకుడి కంటే అది పెద్ద ప్రేరణ కలిగించగలదు. మొత్తం ప్రతిపక్షంపై ఆయన ప్రభావం, పలుకుబడి సామాన్యంగా ఉండవు. 14 పైగా ప్రతిపక్షాలు దేశవ్యాప్తంగా ఎన్డీయేకి వ్యతిరేకంగా కూటమి కడుతున్న నేపథ్యంలో బిహార్‌ సీఎం వైఖరిలో మళ్లీ మార్పు వస్తే ప్రతిపక్షాలకు అది పెద్ద నైతిక బలాన్ని ఇచ్చినట్లే అవుతుంది.

పార్లమెంటును, దేశాన్ని చుట్టిముట్టిన పెగసస్‌ ఫోన్‌ హ్యాకింగ్‌ కుంభకోణంపై విచారణ జరిపించాల్సిందే అంటున్న ప్రతిపక్షంతో బిహార్‌ ముఖ్యమంత్రి, ఎన్డీయే భాగస్వామి నితీశ్‌ కుమార్‌ చేతులు కలపడం సంచలనం కలిగించింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చేపట్టిన జనాభా విధానాలను కూడా నితీశ్‌ విమర్శించారు. బిహార్‌లో కులాలవారీ జనగణన అంశంపై తేజస్వీ యాదవ్, తదితర ప్రతిపక్షసభ్యులతో నితీశ్‌ ఇటీవలే భేటీ కావడం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది.

అలాగే ఆర్టికల్‌ 370 రద్దుకు నితీశ్‌ అనుకూలం కాదు. కానీ అయోధ్యలో రామాలయ నిర్మాణంపై మాత్రం నితీశ్‌ మౌనం పాటిస్తున్నారు. కాగా, వరుసగా జరిగిన ఈ పరిణామాలతో బిహార్‌లో జేడీయూ, బీజేపీ హనీమూన్‌ ముగిసినట్లేనని సహజంగానే ఊహాగానాలు పుట్టుకొస్తున్నాయి. ఒకవైపున ఇరుపక్షాల మధ్య అనేక భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. మరోవైపు  జేడీయూ గత నెలలో తొలిసారిగా కేంద్ర మంత్రిమండలిలో చేరింది. జేడీయూ జాతీయ అధ్యక్షుడు రామ్‌చంద్రప్రసాద్‌ సింగ్‌ కేంద్ర ఉక్కుశాఖ మంత్రి అయ్యారు. మరొక పొత్తు పార్టీ ఎల్‌జేపీకి చెందిన పశుపతి కుమార్‌ పరాస్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖను దక్కించుకున్నారు.

నితీశ్‌ పలుకుబడి అసామాన్యం...
కాకపోతే, దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలను ఐక్యం చేసేందుకు ప్రత్యేకించి మమతా బెనర్జీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో బిహార్‌ ముఖ్యమంత్రి చాలా యుక్తితో తన ప్రధాన మిత్రపక్షానికి హెచ్చరిక సంకేతాలు పంపారు. నిజానికి నితీశ్‌ కుమార్‌ ప్రతిపక్ష శిబిరంలో చేరితే ఏ ఇతర ప్రాంతీయ నాయకుడి కంటే అది పెద్ద ప్రేరణ కలిగించగలదు. ఒక దశలో ప్రధానమంత్రి అభ్యర్థిత్వానికి కూడా నితిశ్‌ పేరు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో మొత్తం ప్రతిపక్షంలో ఆయన ప్రభావం, పరపతి సామాన్యంగా ఉండవు. బిహార్‌లో బీజేపీ దూకుడు జేడీయూను తోసిపుచ్చింది.

నిజంగానే, గత అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ కంటే 31 స్థానాలు అధికంగా బీజేపీ సాధించినప్పటికీ రాష్ట్రంలో పాలకకూటమిలో జూనియర్‌ భాగస్వామిగానే కొనసాగుతోంది. కానీ బీజేపీలోని ఒక సెక్షన్‌తో జేడీయూకి పొసగడం లేదు. అదే సమయంలో బిహార్‌లో అన్నిటికంటే ప్రయోజనం పొందింది బీజేపీనే. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ కంటే తక్కువ స్థానాల్లోనే పోటీ చేసిన బీజేపీ ఏకంగా 74 స్థానాలు గెల్చుకుంది. జేడీయూ 43 స్థానాలకే పరిమితమైంది. ఒక రకంగా ప్రాంతీయపార్టీగా మాత్రమే ఉన్న జేడీయూను అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చావుదెబ్బ తీసిందనే చెప్పాలి.

2029 అసెంబ్లీ ఎన్నికలకు ముందు, బిహార్‌లో ఎన్డీఏ కూటమిలోని రెండు ప్రధాన పార్టీల మధ్య పొరపొచ్చాలు చోటుచేసుకున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఏర్పడిన వ్యతిరేకత నితీశ్‌కుమార్‌ పలుకుబడిని దెబ్బతీసిందని బీజేపీ నేతలు భావించారు. నాటి ఎల్‌జేపీ అధినేత చిరాగ్‌ పాశ్వాన్‌ బహిరంగంగానే నితీశ్‌కి వ్యతిరేకంగా మాట్లాడటమే కాకుండా ఎన్డీయే కూటమికి చెందిన చాలామంది తిరుగుబాటుదారులను తన పార్టీలో చేర్చుకున్నారు. జేడీయూను సంఖ్యాపరంగా కుదించివేసి నితీశ్‌ ముఖ్యమంత్రిత్వాన్నే బీజేపీ పక్కనపెట్టే కుట్ర చేస్తోందని పుకార్లు రేగాయి. అయితే బీజేపీ నిజాయితీగానే ఆ పుకార్లను తోసిపుచ్చింది. తిరుగుబాటుదారులను పార్టీనుంచి తొలగించి 2020 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా నితీశ్‌కుమారే కూటమి తరపున ముఖ్యమంత్రిగా ఉంటారని తేల్చి చెప్పింది. అదే సమయంలో చిరాగ్‌ జేడీయూని దెబ్బతీయడంలో విజయం పొందారు కానీ ఊహించినంతమేరకు సాధించలేకపోయారు.

ఎన్డీయేకి విలువైన పొత్తుదారు
గత సంవత్సరం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనే నితీశ్‌కుమార్‌ ఎన్డీయేకి చెయ్యి చూపి ఆర్జేడీతోనూ, దాని ప్రధాన భాగస్వాములైన కాంగ్రెస్, సీపీఎంతో కలిసి కూటమిని ఏర్పాటు చేస్తారని అంచనాలు మొదలయ్యాయి. ఆ తర్వాత 2021 జనవరిలో ఒక జేడీయూ ఎమ్మెల్యే మాట్లాడినట్లు చెబుతున్న ఆడియో క్లిప్‌లో మరో ఆరునెలల్లో నితీశ్‌ ఎన్డీయేని వదిలివేస్తారన్న మాటలు బాగా వైరల్‌ అయ్యాయి. కానీ మహాఘట్‌ బంధన్‌తో చేదు అనుభవం కారణంగా 2017లో నితీశ్‌ కుమార్‌ ఆ కూటమి నుంచి బయటకు వచ్చిన నేపథ్యంలో తిరిగి ఆవైపు వెళ్లే అవకాశాలు లేవని కూడా కొందరు చెబుతున్నారు.

ఒక జాతీయ పార్టీగా బీజేపీకి నితీశ్‌ విలువైన భాగస్వామిగా కొనసాగుతారు. నితీశ్‌ లేకుండా బిహార్‌లో అధికారం కైవసం చేసుకోవడానికి అవసరమైన సంఖ్యాబలం తనకు దక్కుతుందనే ఆశ బీజేపీకి లేదు. పైగా దేశవ్యాప్తంగా ప్రాంతీయ సవాళ్లు చుట్టుముడుతున్నాయి. దీంతో తన కూటమి పార్టీలను, ప్రత్యేకించి నితీశ్‌కుమార్‌ని తన పక్షంలో నిలుపుకోవడం బీజేపీకి కీలకంగా మారింది.

ఈ కోణంలోంచి చూస్తే, బిహార్‌లో కులాలవారీ జనగణన అంశంపై తేజస్వితో, ఇతర ప్రతిపక్ష సభ్యులతో నితీశ్‌కుమార్‌ ఇటీవల సమావేశం కావడం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. కానీ బీజేపీ కులాలవారీ జనగణనను వ్యతిరేకిస్తూ వచ్చింది. ఎందుకంటే, జనాభా గణనలో ఎలాంటి కీలకమైన మార్పు చేసినా దానివల్ల రిజర్వేషన్లను పునర్వ్యవస్థీకరించాలనే డిమాండు పుట్టుకొస్తుంది. పైగా అది భారీ విస్ఫోటనకు దారితీసే సమస్య అవుతుందని బీజేపీ యోచన. అయితే కులాలవారీ జనగణన అంశమే ప్రతిపక్షాలతో చర్చల సందర్భంగా నితీశ్‌కు ఏకైక ఎజెండాగా ఉండిందని జేడీయూ నొక్కి చెబుతున్నప్పటికీ, ఒకప్పుడు మిత్రుడిగా ఉండి ఇప్పుడు ప్రత్యర్థిగా ఉన్న తేజస్వితో సీఎం చర్చలు కాస్త అనుమానాన్ని రేకెత్తిస్తున్నాయి.

విభేదాల కారణాలు
ఉత్తరప్రదేశ్‌ జనాభా స్థిరీకరణ బిల్లుపై నితీశ్‌ పరిశీలన ప్రకారం, తన మంత్రిమండలిలోని బీజేపీ సభ్యులు తీవ్రంగా ప్రతిఘటించినప్పటికీ జనాభా స్థిరీకరణ బిల్లు వంటిది బిహార్‌లో చట్ట రూపంలోకి తీసుకొచ్చే అవకాశం లేదనీ, మహిళా విద్య, సాధికారతను మాత్రమే ముందుకు తీసుకుపోవచ్చని తెలుస్తోంది. నితీశ్‌ కేబినెట్‌లో బీజేపీ మంత్రి ఒకరు ఈ అంశంపై మాట్లాడుతూ బిహార్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఇద్దరు పిల్లలు మాత్రమే కలిగి ఉండాలనే నిబంధన ఇప్పటికే అమలులో ఉందని ఎత్తిచూపారు. ఎన్డీయే భాగస్వామ్య పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలకు కులగణన, జనాభా బిల్లు మాత్రమే కారణాలు కావు. గతంలోనూ ఆర్టికల్‌ 370 రద్దు పట్ల నితీశ్‌ సానుకూలత వ్యక్తపర్చలేదు కానీ ఒకసారి చట్టం రూపొందిన తర్వాత అందరూ దానికి కట్టుబడాల్సిందేనని నితీశ్‌ వివరణ ఇచ్చారు. అలాగే అయోధ్యలో రామాలయ నిర్మాణం పట్ల కూడా హెచ్చరించారు కానీ ఈ అంశంపై జాగ్రత్తగా మౌనం పాటించారు.

ఇక బీజేపీ తనవంతుగా నితీశ్‌ సామాజిక నిర్మాణం, సంక్షేమవాదాన్ని దాటి, రాష్ట్రంలోకి పెట్టుబడులను ఆకర్షించి, ఉద్యోగావకాశాలు కల్పించడం వైపుగా దృష్టి సారించాలని కోరుకుంటోంది. 2020 నాటి అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో ప్రధాని నరేంద్రమోదీ కూడా రాష్ట్రంలో వికాసాన్ని తీసుకురాగల ముఖ్యమంత్రిగా నితీశ్‌ ఉండాలని కోరుకున్నారు. ఈ అన్ని అంశాలూ కలిసి తన మిత్రకూటమి నుంచి సౌకర్యవంతంగా పనిచేసుకుపోయే అవకాశాలను నితీశ్‌ కుమార్‌కి తగ్గించివేస్తున్నాయి. 2017లో కూడా మహాఘట్‌ బంధన్‌ అలాంటి సౌకర్యాన్ని నితీశ్‌కి కల్పించడంలో విఫలమైంది. బిహార్‌లో అదేవిధమైన తప్పును మరోసారి చేయకుండా బీజేపీ తన సహచరులను కట్టడి చేయాల్సి ఉంది. ఎందుకంటే రాజకీయ అస్థిరత్వం రాష్ట్ర పురోగతిని తోసిపుచ్చుతుంది తప్ప దాంతో ఒరిగే ప్రయోజనం లేదు. 

వ్యాసకర్త: భవదీప్‌ కాంగ్‌ 
సీనియర్‌ పాత్రికేయురాలు

మరిన్ని వార్తలు