Bhimsen Joshi: శతవసంత స్వరమాధురి

7 Feb, 2022 12:15 IST|Sakshi

ఇరవయ్యో శతాబ్దంలో భారతీయ సంగీత సామ్రాజ్యంలో ‘భీమ్‌ సేన్‌ గురురాజ్‌ జోషీ’ది అగ్రగణ్య స్థానమని చెప్పాలి. హిందుస్తానీ సంప్రదాయ సంగీతంలో మేరునగ ధీరునిగా పేరుగాంచిన ఆయన  1922 ఫిబ్రవరి 4న  కర్ణాటక రాష్ట్రం, గదగ్‌ జిల్లాలోని రాన్‌ ప్రాంతంలో  జన్మించారు.

‘పండిట్‌ భీమ్‌ సేన్‌ జోషీ’గా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆయన తన చిన్నతనంలో పదకొండవ ఏటనే అబ్దుల్‌ కరీంఖాన్‌ గానం విని తన్మయుడై ఆయన స్వరానికి ఉత్తేజం చెంది తానూ సంగీతం నేర్చుకోవాలనే జిజ్ఞాసతో గురువును వెతుక్కొంటూ ఇల్లు వదలి గ్వాలియర్‌ చేరుకొని ఓ సంగీత పాఠశాలలో చేరి, ఆ తరువాత మంచి గురువు కోసం అనేక చోట్ల తిరిగి తిరిగి చివరకి 1936లో ‘సవాయిగంధర్వ’ వారి వద్ద శిష్యునిగా చేరారు. ఇక అప్పటి నుండి 24 జనవరి 2011న తన 88వ ఏట ఈలోకం వీడి వెళ్లేంత వరకు తన గంధర్వ గానంతో ‘హిందుస్తానీ సంగీతాన్ని’ అజరామరం చేస్తూనే ఉన్నారు.

సంగీత నాటక అకాడమీ అవార్డు, మహారాష్ట్ర భూషణ్, కర్ణాటకరత్న లాంటి గౌరవ పురస్కారాలతో పాటు... భారత దేశంలో అత్యున్నత  పౌర పురస్కారం ‘భారతరత్న’ కూడా పండిట్‌ భీమ్‌ సేన్‌ జోషీని వరించింది. (సకిన రామచంద్రయ్య: ఆదివాసీ సంప్రదాయ చరిత్రకారుడు)

హిందుస్తానీ శాస్త్రీయ సంగీత ఆలాపనలే కాక ఆయన కన్నడ భజనలు, మరాఠీ అభంగులు, ‘బసంత్‌ బహార్, తాన్‌ సేన్‌’ లాంటి చలన చిత్రాల్లో పాటలు తనకు తానే సాటి అన్నట్టుగా గానం చేశారు. భీమ్‌ సేన్‌  జోషీ కర్నాటకకు చెందిన పురందర దాసు కృతులు కూడా ఆలపించటం విశేషం.

కర్ణాటక సంగీతంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మంగళంపల్లి బాలమురళీకృష్ణతో ఆయన కలిసి చేసిన ‘జుగల్‌ బందీ’ కచేరీలు సంగీతాభిమానులకు మరచిపోలేని అనుభూతులు. కర్ణాటక సంగీతంలో ‘సంగీత సామ్రాజ్ఞి’ ‘భారతరత్న’ అవార్డు గ్రహీత ఎమ్మెస్‌ సుబ్బులక్ష్మితో కలసి కూడా భీమ్‌ సేన్‌ జోషీ సంగీత కచ్చేరీలు చేశారు.

‘కిరానా ఘరానా’ స్వరశైలిలో ప్రఖ్యాతి గాంచిన భీమ్‌ సేన్‌ జోషీ హిందూస్తానీ సంగీతంలో ఓ ధ్రువ తారలా వెలిగారు. శుద్ధ కళ్యాణ్, పురియా కళ్యాణ్, పురియా, ముత్‌ లానీ, మారు బిహాగ్, తోడి లాంటి హిందుస్తానీ రాగాల్లో ఆయన సంగీత రసజ్ఞత ఆపూర్వం. ‘మిలేసుర్‌ మేరా తుమ్హారా’, అంటూ 1980 దశకంలో దూరదర్శన్‌ వీడియో కోసం ఆయన పాడిన పాట వినని వారుండరు. (చదవండి: తెలుగు కవితా దండోరా ఎండ్లూరి)

సంగీతం సార్వత్రికమైనది. దానికి భాషా భేదాలు లేవు. అందునా భారతీయ సంగీతం వేదకాలం నుండి ప్రఖ్యాతమైంది. అటువంటి భారతీయ సంగీత సౌరభాన్ని ఈ ప్రపంచానికి పంచిపెట్టిన మహా విద్వాంసుడు ‘భారతరత్న పండిట్‌ భీమ్‌ సేన్‌  జోషీ’ శత జయంతి ఉత్సవాల సందర్భంగా మరోసారి ఆ మహనీయునికి శ్రద్ధాంజలి.  

– డాక్టర్‌ కొత్తపల్లి శ్రీనివాస వర్మ
జర్నలిస్టు
(ఫిబ్రవరి 4న పండిట్‌ భీమ్‌సేన్‌ జోషీ శత జయంతి ఉత్సవాలు ప్రారంభమైన సందర్భంగా)

మరిన్ని వార్తలు