ఉద్యోగాలపై ఆర్థికశాఖ కాకిలెక్కలు

23 Jan, 2021 00:25 IST|Sakshi

సందర్భం

తెలంగాణ ఉద్యమం పుట్టింది ఉద్యోగాల కోసం. 1,200 మంది నిరుద్యోగులు ఆత్మబలిదానాలకు పాల్పడ్డది తెలంగాణ వొస్తే ఉద్యోగాలొస్తాయని. తెలంగాణ వొచ్చి ఏడేండ్లు కావస్తున్నా ఉద్యోగాలు రాకపోవడంతో నిరుద్యోగ యువత నిరాశ నిస్పృహలకు లోనై మళ్లీ ఆత్మహత్య లకు పాల్పడుతున్నారు (నాగులు, రవీంద్ర నాయక్‌). ఏ ఉద్యమమైనా తన లక్ష్యాన్ని సాకారం చేసుకున్న పిదప ఆ ఉద్యమంలో పాల్గొన్న ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలి. అప్పుడే  ఉద్యమం సఫలీకృత మైనట్లు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం నీళ్లు, నిధులు, నియా మకాల గురించి కొనసాగింది. నియామకాలకు సంబంధించిన ఈ కీలక అంశాన్ని ప్రభుత్వం ఏ మేరకు పరిష్కరించింది అన్నది ప్రశ్న. ప్రభుత్వ ఆర్థికశాఖ ఇచ్చిన ఉద్యోగ వివరాలను చూద్దాం.

రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వం అనుమతించిన 1,50,326 పోస్టు లకుగానూ 1,32,898 పోస్టులను నోటిఫై చేయగా అందులో 1,26,641 భర్తీ అయ్యాయనీ, మిగిలింది కేవలం 23,685 ఖాళీలు మాత్రమేననీ పేర్కొన్నారు. భర్తీ చేసినవాటిల్లో పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా 30,594; పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డుద్వారా 31,972; విద్యుత్‌ సంస్థల్లోని ఆర్టిజన్లను క్రమబద్ధీకరించడం ద్వారా 22,972; పంచాయతీరాజ్‌ శాఖలో 10,763 పోస్టులను డైరెక్టు రిక్రూట్‌మెంట్‌ ద్వారా; శాఖాపరమైన పదోన్నతుల ద్వారా 11,278 పోస్టులను భర్తీ చేసినట్లు పేర్కొంది. పోలీస్‌ శాఖలోని నియామకాల్లో కొన్ని సంవత్సరాల నుండి పనిచేస్తున్న హోం గార్డులు ఎంతమందికి ఉద్యోగాలు లభించాయి, అవిపోగా కొత్తగా ఉద్యోగాలు లభించింది ఎంతమందికో ఆర్థికశాఖ వివరిస్తే బాగుం డేది. ఆర్టిజన్లను క్రమబద్ధీకరించడం కొత్త నియామకాల కిందకి రాదు. పంచాయతీ రాజ్‌లో శాఖాపరమైన పదోన్నతులద్వారా 11,278 పోస్టులను భర్తీచేసినట్లు  చెప్తున్నరు. శాఖాపరమైన పదో న్నతులలో కిందిస్థాయిలో ఏర్పడే ఖాళీలను భర్తీచేస్తేనే ఆ పోస్టులు భర్తీ అయినట్లు. కేవలం ఉద్యోగ ప్రకటనలిచ్చి తద్వారా భర్తీచేసిన నియామకాలే లెక్కలోకి వస్తాయన్న విషయం ఆర్థికశాఖకు తెలువదనుకోవాలా?

పాఠశాల విద్యలో 8,463 పోస్టులు భర్తీచేసినట్లు, రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలలోని 1,061 ఖాళీల భర్తీకి అనుమతులి చ్చినా ఇప్పటి వరకు ఒక్కపోసు ్టకూడా భర్తీ చేయలేదని తెలిపారు. పాఠశాల విద్యలో స్కూల్‌ అసిస్టెంట్, సెకండరీ గ్రేడు టీచర్స్‌తో పాటు, హెడ్మాస్టర్లు, డీఈఓలు, ఎంఈఓలు, బోధనేతర సిబ్బం దితో కలిపి 25,000 ఖాళీలున్నట్లు లోగడ విద్యాశాఖమంత్రిగా ఉన్న కడియం శ్రీహరి శాసనసభలో ప్రకటించారు. ఇందులో భర్తీ చేసింది. 8,463. చేయవలసింది 16,537. ఆర్థికశాఖ మాత్రం విద్యాశాఖలో 10వేల ఉద్యోగాల వరకే ఉంటాయంటున్నది. అదేం లెక్కో. యూనివర్సిటీలలో భర్తీ చేయమని 1,061 పోస్టులకు అనుమతులిచ్చినా ఒక్కపోస్టుకూడా భర్తీ చేయలేదంటున్నారు. గత ఆరు సంవత్సరాల్లో ఎప్పుడూ సకాలంలో బ్లాక్‌ గ్రాంటు, జీతాలు, పెన్షన్లు, బకాయిలివ్వని ఆర్థికశాఖ యూనివర్సిటీలపై నిందమోపడం అన్యాయం. రాష్ట్రంలోని 13 యూనివర్సిటీలకు రెండున్నర సంవత్సరాలనుండి వైస్‌ చాన్స్‌లర్లు, పాలకమండళ్లు లేవు. అలాంటప్పుడు నియామకాల ప్రక్రియ ఎలా చేపడతారో ఆర్థికశాఖనే వివరించాలి. 

ఒక్క యూనివర్సిటీలలోనే కాదు ఖాళీలున్నది, డిగ్రీ కాలేజీల్లో 2,730 లెక్చరర్‌ పోస్టులుంటే  ప్రస్తుతమున్నది 1,419. ఖాళీలు 1,311. జూనియర్‌ కళాశాలల్లో మంజూరు అయిన పోస్టులు 5,278. ఇందులో పనిజేస్తున్న వారు 836. ఖాళీలు 4,442. మొత్తంగా ఉన్నత విద్యలోని బోధన, బోధనేతర ఉద్యోగాలన్నీ కలిపి ఉన్నవి 14,006. ఇందులో పనిచేస్తుంది మాత్రం 3,685. ఖాళీలు 10,321. యూనివర్సీటీలు, డిగ్రీ కాలేజీలు, జూనియర్‌ కళాశాలలు నడుస్తున్నది పార్ట్‌ టైమ్, కాంట్రాక్ట్‌ అధ్యాపకులతోనే అన్నది నగ్నసత్యం. రాష్ట్రం ఏర్పడి ఆరున్నరేళ్లు కావస్తున్నా ఒక్క గ్రూప్‌1 నోటిఫికేషన్‌ ఇవ్వలేదు. అటెండర్, డ్రైవర్, వాచ్‌మన్, స్వీపర్, స్కావెంజర్‌ లాంటి ఉద్యోగాల భర్తీ చేపట్టకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రకారం రాష్ట్రంలోని నిరుద్యోగులు 24 లక్షల 54 వేలు. ఇందులో సాంకేతిక విద్యకు సంబంధించినవారు 5,30,128. మిగతావాళ్లు పీజీ, డిగ్రీ, ఇంటర్మీడియెట్, పదోతరగతి వాళ్లు. దేశంలో నిరుద్యోగిత పోస్టు గ్రాడ్యుయేట్లలో 21.6 శాతంగా ఉంటే మనరాష్ట్రంలో మాత్రం అది ఏకంగా 33.9 శాతం. 2013– 14 సంవత్సరాల్లో రాష్ట్రం ఏర్పడే ముందు వీరిలో నిరుద్యోగిత 7.3 శాతం. నాలుగురెట్లకు పైగా పెరిగిందన్న మాట. దీనికి కారకులు ఎవరు? రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలకు తోడు తాజాగా నిరు ద్యోగుల ఆత్మహత్యలు మొదలైన ఈ తరుణంలో ప్రభుత్వం తాత్సారం చేయకుండా తక్షణమే ఉద్యోగాల భర్తీకై చర్యలు చేపడుతుందని ఆశిద్దాం.

ఎన్‌. రాంచందర్‌ రావు 
వ్యాసకర్త ఎమ్మెల్సీ, భారతీయ జనతా పార్టీ

మరిన్ని వార్తలు