నిజంగా భక్తులేనా? పైకి మాత్రమేనా?

7 Nov, 2022 01:03 IST|Sakshi

కామెంట్‌

అంబేడ్కర్‌ను బీజేపీ కానీ, నరేంద్ర మోదీ కానీ విశేషంగా గౌరవిస్తున్నట్లు పైకి కనబడుతోంది. మోదీ అయితే తాను అంబేడ్కర్‌ భక్తుడిని అని చెప్పుకున్నారు. కానీ బీజేపీ నమ్ముతున్న అనేక కీలక అంశాలు అంబేడ్కర్‌ చెప్పినదానికి పూర్తి విరుద్ధంగా ఉంటున్నాయి. భారత్‌లో మెజారిటీ వర్గపు భావన పట్ల బీజేపీ నిబద్ధత క్రమంగా పెరుగుతోంది. అలాంటి వైఖరి విధ్వంసకరమైనదని అంబేడ్కర్‌ విశ్వసించారు. హిందూరాజ్‌ ఒక వాస్తవంగా మారితే, నిస్సందేహంగా అది ఈ దేశానికి అతిపెద్ద విపత్తు అవుతుందని రాశారు. మైనారిటీల పట్ల వివక్ష ప్రదర్శించకుండా ఉండాల్సిన విధి తమదేనని మెజారిటీ గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. స్వేచ్ఛాయుతమైన, న్యాయబద్ధమైన ఎన్నికలు కొనసాగుతున్నప్పటికీ  భారతీయ ప్రజాస్వామ్యం నియంతృత్వంలోకి  అడుగుపెడుతుందని కూడా అంబేడ్కర్‌ ఆనాడే కలవరపడ్డారు. కొత్తగా ఉదయించిన ఈ ప్రజాస్వామ్యం తన రూపాన్ని కొనసాగిస్తూనే వాస్తవానికి నియంతృత్వానికి చోటిచ్చే అవకాశం ఉందని చెప్పారు. అలాంటి ప్రమాదం ఈరోజు కనబడటం లేదా?

నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ బి.ఆర్‌. అంబేడ్కర్‌ను ఒక ఆదర్శ మూర్తిగానే కాకుండా, తమ విశిష్ట కథా నాయకుల్లో ఒకరిగా కూడా గౌరవిస్తోంది. 2015లో ప్రధాని మాట్లాడుతూ, బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ఒక సామాజిక వర్గానికి మాత్రమే కాకుండా, యావత్‌ ప్రపంచానికే స్ఫూర్తిదాయకమని చెప్పారు. 2016లో మరో సందర్భంలో తాను అంబేడ్కర్‌ భక్తుడిని అని ప్రకటించుకున్నారు. అయితే బీజేపీ విశ్వసిస్తున్న లేక పాటిస్తున్న అనేక కీలక అంశాలు అంబేడ్కర్‌ చెప్పిన దానికీ, పాటించిన దానికీ పూర్తి విరుద్ధంగా ఉంటున్నాయని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ అధ్యయనం చేసి ప్రచురించిన ‘అంబేడ్కర్‌: ఎ లైఫ్‌’ వెల్లడించింది.

హిందూయిజం, హిందూ–రాజ్‌పై అంబేడ్కర్, బీజేపీల మధ్య తీవ్రమైన వ్యత్యాసాలు ఉన్నాయని శశి థరూర్‌ రచన పేర్కొంది. భారత్‌లో మెజారిటీ వర్గపు భావన పట్ల బీజేపీ నిబద్ధత క్రమంగా పెరుగుతోంది. కానీ అలాంటి వైఖరి విధ్వంసకరమైనదని అంబేడ్కర్‌ ఆనాడు విశ్వసించారు. ‘‘హిందూ రాజ్‌ ఒక వాస్తవంగా మారితే, నిస్సందేహంగా  అది ఈ దేశానికి అతిపెద్ద విపత్తు అవుతుంది’’ అని అంబేడ్కర్‌ రాశారు. ‘‘హిందువులు ఏమైనా చెప్పవచ్చు. కానీ, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలకు హిందూయిజం పెనుముప్పు. ఈ విషయంలో అది ప్రజాస్వామ్యంతో ఏమాత్రం సరిపోలదు. హిందూ –రాజ్‌ని ఏ విధంగానైనా సరే నిరోధించి తీరాలి’’ అని అంబేడ్కర్‌ పేర్కొన్నారు.

వాస్తవానికి అంబేడ్కర్‌ హిందూయిజాన్ని ఏమాత్రం ఇష్టపడ లేదు. హిందూ నాగరికతను మానవజాతిని బానిసత్వంలోకి దింపడా నికి పన్నిన క్రూరమైన కుట్రగా ఆయన పేర్కొన్నారు. హిందూయిజా నికి సరైన పేరు అపకీర్తి అని మాత్రమే అన్నారాయన. దీన్ని బట్టి హిందువులను కూడా ఆయన ఇష్టపడనట్లే కనిపిస్తుంది. ‘‘హిందు వులు... పిదపతనంతో కుంగిపోయి ఉన్నప్పటికీ శక్తిని కోరుకుంటున్న పిగ్మీలు, మరుగుజ్జులకు చెందిన జాతి... హిందువులు మంచిగానో, చెడ్డగానో ఉండవచ్చు కానీ ఉత్తమ హిందువు అంటూ ఎవరూ ఉండరు’’ అన్నారు అంబేడ్కర్‌.

అంబేడ్కర్‌ భావాల గురించి బీజేపీకి తెలియకుండా ఉంటుందా...  లేదా మనం అజ్ఞానులం అనీ, అంబేడ్కర్‌ను మనం కనుగొనలేమనీ అది భావిస్తోందా? లేక తనకు ప్రయోజనకరమైన కారణాలతో అంబేడ్కర్‌ను అది ఉద్దేశపూర్వకంగా కౌగలించుకుం టోందా? అందుకోసమే నిక్కచ్చిగానూ, ఇబ్బందికరంగానూ ఉండే  అంబేడ్కర్‌ భావాల్లో పొడసూపే వ్యత్యాసాలను కూడా బీజేపీ పట్టించుకోకుండా ఉంటోందా? 

భారతీయ మైనారిటీలపై అంబేడ్కర్‌ అభిప్రాయాలను మీరు చూసినట్లయితే, ఈ ప్రశ్నలు మరింతగా ఇబ్బందిపెడతాయి. 1948లో రాజ్యాంగ సభలో అంబేడ్కర్‌ ప్రసంగిస్తూ, మైనారిటీల పట్ల వివక్ష ప్రదర్శించకుండా ఉండాల్సిన విధి మెజారిటీ పైనే ఉందని స్పష్టంగా చెప్పారు. ‘‘భారతదేశంలోని మైనారిటీలు తమ అస్తిత్వాన్ని మెజారిటీ చేతుల్లో ఉంచడానికి అంగీకరించారు... వారు మెజారిటీ పాలన పట్ల విశ్వాసంతో ఉండటానికి అంగీకరించారు. ఆ మెజారిటీ ప్రాథమి కంగా మతపరమైన మెజారిటీనే తప్ప రాజకీయ మెజారిటీ కాదు. మైనారిటీల పట్ల వివక్ష ప్రదర్శించకుండా ఉండాల్సిన విధి తమదేనని మెజారిటీ గుర్తుంచుకోవాలి.’’

అలాంటి విధిని, బాధ్యతను ఆమోదించడం అటుంచి దాన్ని బీజేపీ గుర్తిస్తుందా? అంబేడ్కర్‌ ఎన్నడైనా ‘బాబర్‌ కి ఔలద్‌’, ‘అబ్బా జాన్‌’ అనే మాటల్ని ఆమోదించేవారా? ‘కబరస్తాన్, శ్మశాన్‌ ఘాట్‌’ అనే భావనలను ఆయన ఆమోదించేవారా? లేదా ముస్లిం మతస్థు లను మొత్తంగా పాకిస్తాన్‌కి పంపించేస్తామనే బెదిరింపులను ఆమో దించేవారా? ఇలా ప్రశ్నించడం ద్వారానే బహుశా ప్రశ్నలకు సమా ధానం రాబట్టగలం.

అయితే అంబేడ్కర్‌ ఆనాడే ఒక హెచ్చరిక చేశారు. 1948 నవంబర్‌లో తాను చేసిన సుప్రసిద్ధ ప్రసంగంలో అత్యంత స్పష్టంగా ఒక విషయాన్ని వెల్లడించారు. ‘‘మైనారిటీలు విస్ఫోటక శక్తి. అది కానీ వెలుపలకు వచ్చిందంటే మొత్తం రాజ్యవ్యవస్థనే పేల్చివేస్తుంది’’ అన్నారు. నిజానికి 70 సంవత్సరాల క్రితం మైనారిటీలు చిన్న సంఖ్యలో ఉండేవారు. భయపడుతుండేవారు. తమను నిర్లక్ష్యం చేసినా పెద్దగా పట్టించుకునే వారు కాదు. కానీ ఈరోజు వారి జనాభా 20 కోట్లు. తమను ఎంతగా ఆగౌరవ పరుస్తున్నారో, సమాజం నుంచి ఎంతగా తమను వేరుపరుస్తున్నారో అనే విషయంలో వీరు చైత న్యంతో ఉన్నారు.

అంబేడ్కర్‌ బతికి ఉంటే ఈరోజు చాలా ఆందోళన చెంది ఉండే వారు. కానీ బీజేపీ ఆయన భయాలను పంచుకునేదా లేక అర్థం చేసుకునేదా? బీజేపీ నిప్పుతో చెలగాటమాడుతోందని అంబేడ్కర్‌ భావించేవారని మీరు ఊహించగలరా? కానీ బీజేపీ మాత్రం ప్రస్తుతం చాలా ఉల్లాసంగా పని చేసుకుపోతున్నట్లు కనిపిస్తోంది.భారత్‌ ఎలాంటి తరహా ప్రజాస్వామిక దేశంగా మారిపోతోందో మీరు గుర్తించినప్పుడు అంబేడ్కర్‌ భావాలకూ, బీజేపీ ఆచరణకూ మధ్య ఉన్న మరో అంతరం స్పష్టమవుతుంది.

స్వేచ్ఛా యుతమైన, న్యాయబద్ధమైన ఎన్నికలు కొనసాగుతున్నప్పటికీ  భార తీయ ప్రజాస్వామ్యం నియంతృత్వంలోకి అడుగుపెడుతుందని అంబేడ్కర్‌ ఆనాడే కలవరపడ్డారు. కొత్తగా ఉదయించిన ఈ ప్రజా స్వామ్యం తన రూపాన్ని కొనసాగిస్తూనే వాస్తవానికి నియంతృ త్వానికి చోటిచ్చే అవకాశం ఉందని ఆయన ఆనాడే చెప్పారు. ప్రజామద్దతు ఎంత అధికంగా ఉంటే అంత అధికంగా నియంతృత్వం ఆవిర్భవించే అవకాశం ఉంటుందని అంబేడ్కర్‌ 1948లోనే హెచ్చ రించారు.

అలాంటి ప్రమాదం ఈరోజు జరగడం లేదా? మన రాజ కీయాల్లో ప్రస్తుతం ఒక ప్రచండాకృతి ఆధిపత్యం చలాయిస్తోంది. ఆ ప్రచండాకృతి చుట్టూ వ్యక్తి ఆరాధన అల్లుకుపోతోంది. ఎలాంటి అసమ్మతినీ అది సహించడం లేదు. పార్లమెంటును తరచుగా సంప్ర దించడం లేదు. ఎన్నికల కమిషన్, న్యాయవ్యవస్థ బలహీన పడి పోయాయి. సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థల కోరలు పెంచారు. మీడియాను నిర్వీర్యం చేసి పడేశారు. 

చివరగా, భారతదేశం విషయంలో బీజేపీని, దాని దార్శనికతను అంబేడ్కర్‌ ఎలా భావించి ఉండేవారో అని నేను ఆశ్చర్యపడు తున్నాను. నరేంద్ర మోదీ తనకు ఒక భక్తుడిగా ఉండటాన్ని చూసి అంబేడ్కర్‌ నిజంగా గర్వపడేవారా? బీజేపీవారు తన పాదముద్రల పైనే నడుస్తున్నారని అంబేడ్కర్‌ నమ్మి ఉండేవారా?

కరణ్‌ థాపర్‌
వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు

మరిన్ని వార్తలు