చరిత్రను పాతిపెట్టి ఏం బావుకుంటారు?

6 Sep, 2022 12:16 IST|Sakshi

ఎనిమిదేళ్ల ప్రధాని నరేంద్రమోదీ పరిపాలనా కాలంలో దేశం సాధించిన విజయాలు, వైఫల్యాలపై జరిగే చర్చకంటే... కేంద్ర ప్రభుత్వం దేశ చరిత్రను వంకరటింకర చేయడం, అలాగే వివిధ రాష్ట్రాలలో అధికారంలో ఉన్న బీజేపీ యేతర పార్టీలను బలహీనం చేయడంపైననే ఇప్పుడు ఎక్కువగా చర్చ జరుగుతున్నది. భారతదేశ చరిత్ర సమున్నతమైనది. అందులో స్వాతంత్య్ర సంగ్రామ పోరాటం ప్రధాన మైనది. అలాగే దేశానికి స్వాతంత్య్రం లభించిన తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు–దేశ విభజన, మత ఘర్షణలు; నెహ్రూ పాలనలో అనుసరించిన ఆర్థిక, సామాజికాభివృద్ధి, విదేశీ విధానాలు తదితర అంశాలు చరిత్రలో ప్రముఖ స్థానం ఆక్రమించాయి. అయితే, పాక్షిక దృష్టితోనో లేక కాంగ్రెస్, వామపక్ష భావజాలాల దృక్కోణం నుంచో  సంఘటనలను చరిత్రకారులు చెప్పారని బీజేపీ మొదటి నుంచీ ఆరోపిస్తోంది. ఇందులో కొంత నిజం ఉండొచ్చు. చరిత్రకు సైద్ధాంతిక ఏకీభావం ఉండదు. ఇది ఒక్క మన దేశంలోనే కాదు. ప్రపంచంలో ఏ దేశ చరిత్ర పరిశీలించినా అనేక అంశాలలో భిన్నమైన వాదనలు, వ్యక్తీ కరణలు, అభిప్రాయాలు కనిపిస్తాయి.

అయితే, భారత్‌కు సంబంధించినంత వరకు జాతీయవాదం తమ గుత్తసొత్తుగా భావించే బీజేపీ ఇపుడు చరిత్రను సరిచేసే నెపంతో గత చరిత్రను తారుమారు చేసే పనిలో నిమగ్నమైంది. జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నప్పుడు స్వయంగా మోదీ చరిత్ర మసిపూసే పనికి తగిన సహకారం, ప్రోద్బలం అందిస్తున్నట్టు భావించాల్సి వస్తోంది. ముఖ్యంగా, స్వాతంత్య్ర సంగ్రామంలో పోరాడి, స్వాతంత్య్రం లభించినాక దేశానికి 17 ఏళ్లపాటు ప్రధాన మంత్రిగా పనిచేసి... ప్రపంచంలో భారత్‌కు ఓ విశిష్ట స్థానం కల్పించిన పండిట్‌ నెహ్రూ పాత్రను కుదించే పనిలో నేడు బీజేపీ తలమునకలై ఉంది. దేశ విభజన, జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించడం, చైనాతో యుద్ధం వంటి అంశాలలో ప్రధానమంత్రిగా నెహ్రూ పోషించిన పాత్ర, తీసుకొన్న నిర్ణయాలపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే, కేవలం ఆయన విజయాలను విస్మరించి వైఫల్యాలను సాకుగా చూపి దేశ చరిత్రలో నెహ్రూ పాత్రను తక్కువ చేయడం; పూర్తిగా విస్మరించాలనుకోవడం ఆశ్చర్యకరం. 

దేశంలో పంచవర్ష ప్రణాళికలను ప్రవేశపెట్టి సోషలిస్ట్‌ అభివృద్ధి నమూనాతో మిశ్రమ ఆర్థిక వ్యవస్థను రూపొందించిన ఘనత నెహ్రూది. ఆయన ఏర్పరిచిన ‘ప్లానింగ్‌ కమిషన్‌’ అటు కేంద్రానికీ, ఇటు రాష్ట్రాలకూ అనేక దశాబ్దాలపాటు దిక్సూచిగా నిలిచింది. అయితే, ప్రధాని మోదీ అధికారంలోకి రాగానే ప్లానింగ్‌ కమిషన్‌ను రద్దు చేసి దానిస్థానంలో నీతి ఆయోగ్‌ను ప్రవేశపెట్టారు. 

బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ప్రాథమిక విద్యకు సంబం ధించిన పాఠ్యాంశాలలో నెహ్రూపై ఉన్న అధ్యాయాలను ఇటీవల తొలగించారు. కర్ణాటక ప్రభుత్వమైతే ‘హర్‌ ఘర్‌ తిరంగా’ ప్రచార కార్యక్రమాలలో భాగంగా వివిధ స్వాతంత్య్ర సమరయోధుల ఫోటోలు వేసి, నెహ్రూ బొమ్మ లేకుండా చేసింది. దానిపై విమర్శలు వెల్లువెత్తినా ప్రభుత్వం మౌనంగా ఉండిపోయింది.  

ఈ  ఏడాదిలోనే ఢిల్లీలోని ఒకప్పటి నెహ్రూ అధికార నివాసమైన తీన్‌మూర్తి భవన్‌లో నిర్వహిస్తున్న నెహ్రూ మెమోరియల్‌ మ్యూజియం, లైబ్రరీలకు ప్రాధాన్యం తగ్గించి, అందులో భారత ప్రధానుల జీవితాలను తెలియజెప్పే కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేశారు. మాజీ ప్రధానులందరినీ సముచితంగా గౌరవించడంలో తప్పులేదు. కానీ, నెహ్రూ మ్యూజియంను అక్కడి నుండి తొలగించాల్సిన అవసరం ఉందా? ఇక, దేశ స్వాతంత్య్ర పోరాటంలో ప్రధాన సంఘటన అయిన ‘క్విట్‌ ఇండియా’ ఉద్యమంపై నేషనల్‌ ఆర్కైవ్స్‌ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ లోనూ నెహ్రూ ప్రస్తావన లేకుండా చేశారు. ప్రధాని మోదీ తనకు నెహ్రూపై గల వ్యతిరేకతను బహిర్గత పర్చడానికి ఏమాత్రం సంకోచించరు. పార్లమెంట్‌లోనే ఓ సందర్భంలో ‘భారతదేశానికి స్వాతంత్య్రం నెహ్రూ ఒక్కడి వల్లనే రాలేదు’ అని వ్యాఖ్యానించి అందర్నీ ఆశ్చర్య పరిచారు. ఆయన ఒక్కరి వల్లనే వచ్చిందని ఎవరన్నారు?

నెహ్రూ పాలనలో జరిగిన వ్యవసాయ విప్లవం, క్షీర విప్లవం, నీలి విప్లవం; ఏర్పాటైన వివిధ అత్యున్నత విద్యా సంస్థలు, రష్యా సాంకేతిక సహకారంతో నెలకొల్పిన పబ్లిక్‌ రంగ సంస్థలు, భారీ నీటి పారుదల ప్రాజెక్టులు, విదేశాలతో ఏర్పరచుకొన్న సత్సంబంధాలు, అనుసరించిన అలీన విధానం, పంచవర్ష ప్రణాళికలు; విజ్ఞాన శాస్త్ర సాంకేతిక రంగాలలో జరిపిన కృషి; అనుసరించిన లౌకికవాదం (సెక్యులరిజం), భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు... ఇలాంటివెన్నో పండిట్‌ నెహ్రూను నవభారత శిల్పిగా నిలిపాయి. ఆయన పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేయడానికీ, వ్యక్తి స్వేచ్ఛను కాపాడటానికీ అధిక ప్రాధాన్యం ఇచ్చిన విషయాన్ని చరిత్ర చెబుతోంది. ఆయన విమర్శకులు సైతం ఈ విషయాలను ఒప్పుకోక తప్పదు. (క్లిక్‌: ఇప్పుడు మతం కాదు... ప్రేమ కావాలి!)

నెహ్రూ విమర్శలకు అతీతుడేమీ కాదు. ఆయన చేసిన తప్పుల్ని ఎత్తి చూపవచ్చు. అదే సమయంలో చరిత్రలో ఆయన స్థానం ఆయనకు ఇవ్వాల్సిందే. ఆయనను తక్కువ చేసి చూపడం వల్లా, విస్మరించడం వల్లా బీజేపీకి ఒరిగే లాభం ఏమిటి? (క్లిక్‌: సమానతా భారత్‌ సాకారమయ్యేనా?)


- సి. రామచంద్రయ్య 
ఏపీ శాసన మండలి సభ్యులు

మరిన్ని వార్తలు