సామాజిక చలనాలకు కవిత్వ సాక్షి

29 Jul, 2021 00:48 IST|Sakshi

మనసున పట్టనివ్వని అనేక తండ్లాటలు, నిలువనియ్యని మనాదులు, సిరిసిల్లా నుండి మొదలై తెలంగాణమంతటా కలెదిరిగి, దేశాన్ని పులుకు పులుకున చూసి కవిత్వ వాక్యమయ్యే మొసమర్రనితనం జూకంటి. ఎప్పుడూ చల నంలో ఉండే భూమికి ఎన్ని రుతువులున్నాయో, నిరంతరం ఎన్ని కోతలున్నాయో అన్ని జూకంటి కవిత్వంలోనూ తిరుగుతున్నాయి. దేశం అత్య వసర పరిస్థితిలోకి నెట్టబడ్డ నాటి నుండి నేటి దాకా సమాజ చలనాన్ని దుర్భిణితో చూస్తున్నది జూకంటి కవిత్వం. ప్రవహించని ప్రతి మనిషి మూలకు పడ్డ సామానుగా భావించే జూకంటి కవిత్వం నిండా ఒక చలన శీలత, భావ గాఢత, అభివ్యక్తి సాంద్రత ముప్పిరిగొంటాయి.

జూకంటికి వ్యవస్థలో జరుగుతున్న మార్పు లకు కారణభూతమైన రాజకీయ శక్తి పాత్ర పట్ల ఒక చూపు ఉంది. అట్లానే, అది అధికారాన్ని సొంతం చేసుకొని చేస్తున్న పనుల వెనుక ఉన్న స్వార్థాల పట్ల లోచూపు ఉంది. తత్ఫలితంగా జరుగుతున్న మనిషి లోపలి కల్లోలం, గ్రామం లోపలి విధ్వంసం, జీవన సంబంధాల విచ్చిన్నం, అభివృద్ధి పేరుతో జరిగే అరాచకం, రాజ్యపు దళారీతనం పట్ల ఎడతెగని దుఃఖం, నిరసన ఉన్నాయి. అందుకే, అతడు సమూహం కావాలనుకుంటాడు. సమూహం కానివాడు శాపగ్రస్తుడే, ప్రపంచం కానివాడు నిలవనీరే అవుతాడంటాడు. నిరంతరం పాద ముద్రల చలనంలోకి ఇంకిపోయి, ఒక ఉద్యమ కొనసా గింపుగా ఉండాలనుకుంటాడు.

పాతాళ గరిగెతో మొదలై పదిహేను కవితా సంపుటాలను వెలువరించిన జూకంటి ఒకే నిబ ద్ధతతో తేజాబ్‌ పట్టుకొని నడుస్తున్నాడు. అది అతనికి ప్రజల పట్ల ఉండే నిబద్ధత. సిరిసిల్లా కల్లోలాన్ని కనులతో చూసి, వలసల దుఃఖాన్ని మిత్రులతో పంచుకొని చెంచరిల్లె హృదయం. గాంధీ చౌరస్తాలో ఉదయం పూట కూలి కోసం వెతుక్కునే వారిని చూసి విలవిలలాడిపోతాడు. దేశం చౌరస్తాలో ఊరు లేబర్‌ అడ్డామీద నిలు చున్న కూలి కావడాన్ని చూసి రంధి పడుతాడు. ఈ మూడు నాలుగు దశాబ్దాల్లో వచ్చిన ప్రధాన పరిణామాలను జూకంటి కవిత్వం ద్వారా తెలుసుకోవచ్చు. దేశంలో అత్యవసర పరిస్థితి విధింపు తదనంతర పరిస్థితులు, తెలంగాణలో విప్లవ పోరాటాల కల్లోల సమయాలు, ప్రపం చీకరణ దాని పరిణామాలు, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వివిధ దశలు, అస్తిత్వ ఉద్యమాల ఛాయలు చాలా ప్రబలంగా జూకంటి కవిత్వంలో కనిపిస్తాయి. 

అంతా రాజకీయమే, రాజకీయం కాని దంటూ రాజ్యంలో వుండనే వుండదు, రాజ కీయం లేకుంట మనిషి వుండనే వుండడు అన్న ఎరుకతో కవిత్వాన్ని రాస్తాడు. పొలం నా బలం బలగం పొలమే నా స్వస్థలం అంటాడు. తల్లికొంగు నీడ నుంచి తరలిపోతున్న కొడుకు లను, కడుపులో బాధ నులి పెట్టగా గెదిమి కొట్ట బడుతున్న బిడ్డల వలసలను తలచుకొని తండ్లా డుతాడు. ఊళ్ళను ఖాళీ చేయించి ప్రాజె క్టులు నిర్వాసితులను చేస్తున్న సందర్భంలో ‘నా రెండు కనుగుడ్లను తీసి నా అరచేతుల్లో ప్రదర్శిస్తున్నట్టు కుప్పకూలిన పాత ఇల్లు/ దేన్నైనా కూలగొట్టడం అల్కగనే పునర్నిర్మించడమే బహుకష్టం’ అని గోసను అక్షరబద్ధం చేస్తాడు. ‘ప్రజల చేత చేతు లారా ప్రజలు స్వాధీన పరచిన అధికారంతో, ప్రజల కొరకు ప్రజల క్షేమం కొరకు, విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం, ప్రభుత్వం దళారై భూములు వేలం వేయబడును’ అని వాస్తవాన్ని పలుకుతాడు. ‘రాజ్యాంగంలో ఎలుకలు పడ్డయ్‌ /శాసన సభల్లో పందికొక్కులు సొర్రినయ్‌’ తీవ్ర నిరసన స్వరాన్ని వినిపిస్తాడు. ‘గ్రామం నా నామం/ ఊరు నా చిరునామా/ కన్నీరే నా వీలు నామా’ అని తన కవిత్వానికి క్షేత్రం ఊరుగా ప్రకటించుకుంటాడు. ‘కంట కన్నీరు ఉబికిన ప్పుడు, గుండె మండి కోపమచ్చినప్పుడు, ఆమె మనసు ఇచ్చి పుచ్చుకున్నప్పుడు కవితగా నవ నవలాడిపోతాను’ అని నవనవంగా నాలుగు దశాబ్దాలుగా కవిత్వాన్ని రాస్తూనే ఉన్నాడు జూకంటి జగన్నాథం.
– బూర్ల వేంకటేశ్వర్లు
(జూకంటి జగన్నాథంకు నేడు ‘సినారె సాహితీ పురస్కార’ ప్రదానం సందర్భంగా) 

మరిన్ని వార్తలు