Natural Farming: ప్రకృతి వ్యవసాయానికి ఏపీ చేదోడు

14 Oct, 2022 12:31 IST|Sakshi

సమస్త జీవకోటి భారాన్ని మోసేది నేల. గతం నుండి మన తరానికి సంక్రమించిన వారసత్వ సంపద నేల. నేలను సారవంతంగా ఉంచే కారకాలు అపరిమితమైనవి కాదు, పరి మితమైనవి. విచ్చలవిడిగా భూమిని వాడిపడేస్తే... అది త్వరలోనే వట్టిపోతుంది. మనం ఈ భూమి మీద నివసిస్తున్నట్లే భవిష్యత్తు తరాలూ మనుగడ సాగించాలంటే... వారికి పనికి రాని నేలను కాక... సజీవమైన భూమిని అప్పగించాల్సిన బాధ్యత మనదే. 

మనుషుల నిర్లక్ష్యం, పేరాశ కారణంగా సాగు భూమి నిస్సారమైపోతోంది. నేల సేంద్రియ కర్బన పదార్థాలను కోల్పోయి పంటల సాగుకు పనికి రాకుండా పోతున్నది. వ్యవసాయంలో విచక్షణారహితంగా రసాయనాలను వాడటం వల్ల నేల నిస్సారమవుతున్నది. అధిక మొత్తంలో రసాయనాలు వాడిన ఫలి తంగా వచ్చిన వ్యవసాయ ఉత్పత్తులు తిన్న జీవజాలం అనారోగ్యం పాలవుతుంది. కన్న తల్లి పాలు కూడా పంటలపై చల్లే రసాయనాల కారణంగా విషతుల్య మవుతున్నాయని రాజస్థాన్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు డాక్టర్‌ ఇంద్రసోని పాల్‌ తెలిపారు. విషతుల్యమైన వ్యవసాయ ఉత్పత్తుల వల్ల పిల్లల రోగ నిరోధక శక్తి నశిస్తుందనీ, తెలివితేటలు, జ్ఞాపకశక్తి దెబ్బతింటాయనీ ఇప్పటికే పరిశోధకులు తేల్చారు. అందుకే వ్యవసాయ విధానం ప్రకృతికి దగ్గరగా ఉండాలనే నినాదం ఇప్పుడు ఊపందుకుంది. అందులో భాగంగా నేలలోని సారం దీర్ఘకాలం మన గలిగే నిర్వహణ పద్ధతులు ప్రచారం చేస్తున్నారు. 

మట్టి ఆరోగ్యమే మనిషి ఆరోగ్యం అని తాత్వికతతో వ్యవసాయాన్ని సాగించాలి. రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడానికీ, పర్యావరణాన్ని సుస్థిరమైనదిగా తయారు చేయ డానికీ, రైతుల జీవన ప్రమాణాలు పెంచడానికీ, సహజ వనరు లను ఉపయోగించి మంచి ఫలసాయం సాధించడానికీ, ప్రకృతి వ్యవసాయం దోహదపడుతుంది.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. ప్రత్యేకంగా ‘రైతు సాధికార సంస్థ’ ద్వారా జీరో–బడ్జెట్‌ నేచురల్‌ ఫార్మింగ్,  కమ్యూనిటీ మేనేజ్డ్‌ నేచురల్‌ ఫార్మింగ్‌ కార్యక్రమాలను అమలు చేస్తోంది. రైతుల సంక్షేమం, వినియోగదారుల సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ వంటి బహుళ లక్ష్యాలతో ఈ కార్యక్రమం ప్రారంభించబడింది. రైతుల సాగు ఖర్చులను తగ్గించడం, రైతుల దిగుబడిని మెరుగుపరచడం, వారి నష్టాలను తగ్గించడం, లాభదాయ కమైన ధరలను పొందడం ద్వారా వారి నికర ఆదాయాన్ని పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. 

అధిక ధర కలిగిన కృత్రిమ ఎరువులు, పురుగు మందులు, కలుపు మందులు ఉపయోగించకుండా ప్రకృతికి అనుగుణంగా గోమూత్రం, గో పేడ, వేప ఆకులు, స్థానిక వనరులతో... ఘన జీవామృతం, ద్రవ జీవామృతం, బీజామృతం, నీమాస్త్రం, అగ్నిఅస్త్రం, బ్రహ్మాస్త్రం వంటివాటిని తయారుచేసుకుని వ్యవసాయంలో ఉపయోగించడానికి ప్రోత్సహిస్తోంది. ఇందువల్ల నేలలో జీవ పదార్థం అధికమవ్వడమే కాక మొత్తంగా భూసారం పెరుగుతుంది. ప్రకృతి వ్యవసాయం ద్వారా మానవ ఆరోగ్యమే కాక, నేల ఆరోగ్యాన్నీ కాపాడవచ్చని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. (క్లిక్ చేయండి: తూర్పు కనుమల అభివృద్ధిపై విభిన్న వైఖరి!)

– ఎ. మల్లికార్జున, ప్రకృతి వ్యవసాయ శిక్షకుడు

మరిన్ని వార్తలు