BP Mandal: మండల్‌ దన్నుతో ఉద్యమించాలి!

25 Aug, 2022 12:49 IST|Sakshi
మండల్‌ వ్యతిరేక ఉద్యమం (ఇన్‌సెట్‌లో బీపీ మండల్‌)

ఇండియా జనాభాలో సగాని కన్నా ఎక్కువ ఉన్న వెనుక బడిన తరగతులవారు (బీసీలు)... తరతరాలుగా భారతీయ సమాజానికి సేవ చేస్తున్నారు. కానీ వారు మాత్రం అన్ని రంగాల్లో వెనక బడే ఉన్నారు. అందుకే బీసీల సామాజిక, ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేయడం కోసం 1953 జనవరిలో కాకా కలేల్కర్‌ కమిషన్‌ను అప్పటి ప్రభుత్వం నియమించింది. 1955 మార్చిలో కమిషన్‌ నివేదిక సమర్పించి బీసీల అభివృద్ధికి పలు సూచనలు చేసింది. ఆ నివేదికను ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. 

1977లో జనతా పార్టీ  అధికారంలోకి వచ్చాక... కాక కలేల్కర్‌ కమిషన్‌ నివేదిక సమర్పించి చాలా ఏండ్లు అయిందని... కొత్త కమిషన్‌ను 1978 డిసెంబర్‌లో నియమించింది. దీనికి బిహార్‌ మాజీ ముఖ్య మంత్రి బీపీ మండల్‌ సారధ్యం వహించారు. మండల్‌ 1980 డిసెంబర్‌ 31న నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. కానీ దాని సూచనలు అమలుకు నోచుకోలేదు. దీంతో బీసీలంతా ఉద్యమించారు. బహుజన్‌ సమాజ్‌ పార్టీ ఉద్యమానికి అండగా నిలిచింది. చివరికి అప్పటి ప్రధాని వీపీ సింగ్‌ 1990 ఆగస్టు 7న మండల్‌ నివేదికను అమలు పరుస్తానని ప్రకటన చేశారు. ప్రధాని ప్రకటనతో దేశవ్యాప్తంగా ఆధిపత్య కులాలు ఆందోళనకు దిగాయి. అన్ని పార్టీలు మండల్‌ నివేదికకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేశాయి. బయట నుండి వీపీ సింగ్‌ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న బీజేపీ తన మద్దతును ఉపసంహరించి తానెవరి వైపో తేల్చి చెప్పింది. 

మండల్‌ కమిషన్‌ను అమలు చేయరాదని ఆధిపత్య కులాల వారు కోర్టును ఆశ్రయించారు. చివరకు 1993లో మండల్‌ నివేదిక అమలుకు కోర్టు అనుమతి ఇవ్వడంతో బీసీలకు కేంద్ర విద్యాసంస్థల్లో, సర్వీసుల్లో 27 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. కేంద్ర రిజర్వేషన్‌ సౌకర్యం పొందే బీసీలను ‘అదర్‌ బ్యాక్‌వార్డ్‌ క్లాసెస్‌’ (ఓబీసీలు)గా వ్యవహరిస్తున్నారు. మొత్తం మీద మండల్‌ కమిషన్‌ బీసీల అభివృద్ధికి 40 సూచనలు చేయగా అందులో ఒకటైన విద్యా, ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్‌ కల్పించడాన్ని మాత్రమే అమలుచేసి అప్పటి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. 

బీసీల అభ్యున్నతికి విలువైన సూచనలు చేసిన బీపీ మండల్‌ బీసీల మదిలో ఎప్పటికీ నిలిచిపోతారు. ఆయన 1918 ఆగస్టు 25న బిహార్‌  మధేపూర్‌ జిల్లా మోరో గ్రామంలో... రాస్‌ బీహారీ లాల్‌ మండల్‌ జమీందారీ కుటుంబంలో జన్మించారు. 1952 మొదటి సారిగా శాసనసభకు ఎన్నికైన మండల్‌ ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. రామ్‌ మనోహర్‌ లోహియా నాయకత్వంలో పనిచేసిన మండల్‌ 1967 బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 69 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు. దీంతో 1968 ఫిబ్రవరిలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. (క్లిక్‌: వారి విడుదల దేనికి సంకేతం?)

బయట నుండి మద్దతునిచ్చిన కాంగ్రెస్‌ పార్టీ నాయకుల అవినీతిపై విచారణ జరిగితే... ఆ విచారణ నివేదికను బుట్టదాఖలు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ మండల్‌పై ఒత్తిడి చేసింది. అయినా నిజాయితీగా  కాంగ్రెస్‌ అవినీతి నాయకులపై చర్య తీసుకున్నారు. దాంతో కాంగ్రెస్‌ మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వం కూలిపోయింది. నీతి కోసం నిలబడిన గొప్ప నాయకుడు బీపీ మండల్‌. 1974లో ఎమ్మేల్యే పదవికి రాజీనామా చేసి లోక్‌ నాయక్‌ జయప్రకాష్‌ నారాయణ నాయకత్వంలో అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొని 1977లో జనతా పార్టీ తరఫున లోకసభకు ఎన్నికయ్యారు. కులాలుగా చీలిపోయి ఉన్న బీసీలు ఏకమై... పార్టీలకు, సంఘాలకు అతీతంగా ఐక్యమై బీపీ మండల్‌ కమిషన్‌ ఇచ్చిన స్థైర్యంతో ముందుకు సాగి తమ హక్కులను సాధించుకోవాలి. (క్లిక్‌:​​​​​​​ 75 ఏళ్లుగా ఉరుకుతున్నా... ఉన్నకాడే!)

- సాయిని నరేందర్‌ 
బీసీ స్టడీ ఫోరం వ్యవస్థాపక చైర్మన్‌
(ఆగస్టు 25న బీపీ మండల్‌ జయంతి)

మరిన్ని వార్తలు