దారి తప్పిన మునుగోడు ఉప ఎన్నిక

29 Oct, 2022 09:00 IST|Sakshi

సందర్భం

మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక రెండు తెలుగు రాష్ట్రాల్లో నరాలు తెగే ఉత్కంఠకు తెరతీసింది. తెలంగాణ  గడ్డపై కాషాయ జెండా ఎగరేయాలని ఉవ్వి ళ్లూరుతున్న బీజేపీకీ, అధి కార గులాబీ పార్టీకీ ఇక్కడ విజయం అనివార్యంగా మారింది. రాబోయే శాసనసభ ఎన్నికల పోరా టానికి ఇది కచ్చితంగా మొదటి అడుగు కాబో తోంది. కాంగ్రెస్‌ కూడా సర్వ శక్తులూ ఒడ్డుతున్నా ధన ప్రవాహమే చోదకశక్తిగా మారినందున ఆ పార్టీ దూకుడు కనబర్చలేకపోతోంది. ఢిల్లీలోనూ, రాష్ట్రం లోనూ ఉన్న అధికార పార్టీలపై ఉన్న వ్యతిరేకత పైనే హస్తం పార్టీ ఆశలన్నీ. అయితే ప్రచారంలో పుంజుకుంటున్న కాంగ్రెస్‌ మిగతా రెండు పార్టీల గెలుపు ఓటములను శాసించే స్థితిలో ఉంది. కాంగ్రెస్‌ తెచ్చుకునే ఓట్లను బట్టి ఫలితం ఎటైనా తిరగ బడొచ్చు.

రాజధానికి అతి సమీపంలో ఉన్నా మును గోడు అభివృద్ధికి నోచుకోలేదు. 2.42 లక్షల ఓట ర్లున్న ఈ నియోజకర్గం ఫ్లోరోసిస్‌ నుంచి విముక్తమై ఇప్పుడిపుడే కోలుకుంటోంది. మునుగోడు బరిలో ఉన్న మూడు ప్రధాన పార్టీలు తమ తమ అభివృద్ధి ఎజెండాలను పేర్కొనడం కంటే పరస్పర విమ ర్శలు, తిట్లదండకాలతో వినోదం పంచుతు న్నాయి. మరోవైపు మెజారిటీ ఓటర్లు తమ ఓట్లకు దక్కే మూల్యంపై చాలా ఆశలు పెట్టుకున్నారు. మొత్తం మీద మునుగోడులో ఏ పార్టీ అభ్యర్థి ఎంత వెదజల్లుతారనేదే గెలుపును నిర్ణయించే ప్రధాన అంశం అయింది.

రాజ్యాంగం లోని మూడో అధికరణ, ఆర్టికల్‌ 84 – 174 ప్రకారం పోటీ చేసే అభ్యర్థి నామినేషన్‌ పత్రంతో పాటు ఒక ప్రమాణ పత్రం సమర్పిస్తారు. రాజ్యాంగ నిబంధనలకు లోబడి ఏర్పాటైన భారత ఎన్నికల కమిషన్‌(ఈసీ) నియమాలను కచ్చితంగా పాటిస్తానని చెప్పడమే ఈ ప్రమాణ పత్రం ఉద్దేశం. కానీ జరుగుతున్నదేమిటి? అసెంబ్లీ అభ్యర్థి ప్రచార వ్యయం ఎట్టి పరిస్థితుల్లోనూ రూ.40 లక్షలు దాటకూడదు. నామినేషన్‌ వేసిన రోజు నిర్వహించే ర్యాలీలు, ప్రచార హంగామాకే 50 లక్షల దాకా వెదజల్లు తున్న పరిస్థితి. నేతల ప్రసంగాలు వినడానికి రోడ్డుపై గంట సేపు నిలబడటానికి కార్యకర్తలు చేస్తున్న ఛార్జి రూ. 500 లేదా అంతకు మించి. ఊరేగింపులో ద్విచక్ర వాహనంతో పాల్గొంటే ఒక రేటు, కారుతో వస్తే ఇంకాస్త ఎక్కువ భత్యం ఇవ్వాల్సి వస్తోంది. ఉపఎన్నిక షెడ్యూల్‌ మొదలై నప్పటి నుంచీ రూ. 20 కోట్ల దాకా లెక్క చెప్పని డబ్బు, హవాలా మనీ పట్టుబడింది. ప్రధాన అభ్య ర్థుల ఎన్నికల వ్యయం రూ. 500 కోట్లు దాటు తుందనే ప్రచారం జరుగుతోంది.  

ప్రస్తుతం మునుగోడులో మూడు ప్రధాన పార్టీల తరఫున దాదాపు 4 వేల మంది బయటి వాళ్లు తిష్ట వేసి ఉన్నారు. వీరి వాహనాల వ్యయం, బస, తిండి ఖర్చులు అభ్యర్థుల ఖాతాలో వేయాల్సి ఉంది. మునుగోడుకు చెందిన దాదాపు 40 వేల మంది హైదరాబాద్‌లో ఉద్యోగాలు, చిన్న వ్యాపా రాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. చాలా మందికి నియోజకవర్గం వెలుపలి ప్రాంతాల్లో బ్యాంకు అకౌంట్లు ఉన్నాయి. వాటిలో జమ అయ్యే నిధులను ఎలా లెక్కిస్తారు? పైగా పోలింగ్‌ రోజు నియోజకవర్గం వెలుపల ఉన్న వారందరినీ డబ్బు ముట్టచెప్పి, రవాణా ఖర్చులు చెల్లించి పిలిపి స్తున్నారు. 

ఒకప్పటిలా అభ్యర్థులు ప్రచారానికి మీడి యాలో ప్రకటనలు ఇవ్వడం లేదు. పెయిడ్‌ వార్తలు వేయించుకుని భారీ మొత్తం చెల్లిస్తున్నారు. దీన్ని గుర్తించి నిరూపించడం అంత తేలిక కాదు. ఆలయాలు, కమ్యూనిటీ హాళ్లు, కుల సంఘ భవ నాలు, పేద వారికి ఇళ్లు కట్టిస్తామని ఇచ్చే హామీలు ఎన్నికల్లో గెలిస్తే నెరవేరుస్తారు. పోలింగ్‌ ముగిసిన తర్వాత చేసే వ్యయంపై ఎవరి నిఘా ఉంటుంది? దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికగా మునుగోడు నిలవబోతోంది. ఓటుకు ఎంత చెల్లించి కొనుక్కుం టారనేది పోలింగుకు రెండు, మూడు రోజుల ముందు తెలవొచ్చు. మొత్తంమీద ఉప్పెనలా ప్రవహిస్తున్న ధనం ఈసీ నియమావళిని అపహాస్యం చేస్తోంది. 

2019 సాధారణ ఎన్నికల్లో రూ. 50,000 కోట్ల బ్లాక్‌ మనీ చేతులు మారిందని ఢిల్లీకి చెందిన ‘సెంటర్‌ ఫర్‌ మీడియా స్టడీస్‌’ వెల్లడించింది. ఇవి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలని ఆందో ళన వ్యక్తం చేసింది. ఆ తర్వాత జరగాల్సిన ప్రక్షాళన గురించి, డబ్బు, మద్యం ప్రలోభాలు లేని స్వేచ్ఛా యుత ఎన్నికల గురించి అనేక చర్చలు జరిగాయి. ప్రజలు మార్పు కోరుకుంటున్నా అందులో భాగ స్వాములుగా ఉన్న రాజకీయ పార్టీలు పరివర్తనకు సిద్ధంగా లేనప్పుడు మునుగోడు లాంటి బై ఎలక్ష న్లలో అభ్యర్థుల చెల్లింపు శక్తే జయాపజయాలను నిర్దేశిస్తుంది. ఇటువంటి ఎలక్షన్‌ నిర్వహించడం కంటే టెండర్‌ నోటిఫికేషన్‌ ఇచ్చి ఎక్కువ ‘వితరణ’ కోట్‌ చేసిన అభ్యర్థి విజయం సాధించినట్టుగా ప్రక టించడం ఉత్తమం అనే నిస్పృహతో కూడిన సూచ నలు వినిపిస్తున్నాయి. ఇలా వచ్చిన డబ్బులో సగం ఓటర్ల ఖాతాలకు బదిలీచేసి మిగిలిన మొత్తాన్నీ అభివృద్ధి పనులకు వ్యయం చేసేలా రాజ్యాంగ సవరణ చేస్తే ఏ గొడవా ఉండదేమో! ప్రజాస్వామ్య విరుద్ధమనిపించినా జరుగుతున్నది అదే కదా!!

బీటీ గోవింద రెడ్డి 
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌

మరిన్ని వార్తలు