మరొక ‘హిరోషిమా’ వద్దే వద్దు

5 Aug, 2021 00:52 IST|Sakshi

సందర్భం

హిరోషిమా నగరంపై అమెరికన్లు అణుబాంబు వేసిన రోజు 1945 ఆగస్టు 6.  అది ప్రపంచ మానవ చరిత్రలో కారుచీకటి రోజు. ఘటన జరిగి ఆగస్టు 6వ తేదీనాటికి సరిగ్గా 76 ఏళ్లయింది. బాంబు వేసిన వెంటనే 70 వేలమంది చనిపోగా తర్వాత రోజుల్లో ధార్మికకిరణాల దుష్ప్రభావంతో 2 లక్షలకు పైగా ప్రజలు చనిపోయారు. 4,400 కిలోల ఈ అణ్వస్త్రం ‘లిటిల్‌బోయ్‌’లో 64 కిలోల యురేనియం వాడారు. ఆగస్టు 9న ‘ఫ్యాట్‌బోయ్‌’ను నాగసాకిలో ప్రయోగిం చారు. అక్కడికక్కడే 80 వేల వరకు సామాన్యులు చని పోయారు. 6.2 కిలోల ఫ్లుటోనియంతో ఈ బాంబును ప్రయోగించారు. ఆగస్టు 12న జపాన్‌ లొంగిపోయినట్లుగా ప్రకటించింది. 

యుద్ధానంతరం 1945 జూలై 17న విధివిధానాలు నిర్ణయించడానికి సోవియట్‌ యూనియన్, అమెరికా, ఇంగ్లండ్‌ అధినేతలు స్టాలిన్, ట్రూమెన్, చర్చిల్‌లు జర్మనీ పోట్స్‌డామ్‌లో సమావేశమై ఆగస్టు 2 వరకూ చర్చలు జరిపారు. జూలై 28న ఇంగ్లండ్‌ ప్రధాని హోదాలో అట్లీ బాధ్యతలు తీసుకున్నారు. సమావేశం జరుగుతున్న సమయంలోనే జూలై 18న రహస్యంగా అమెరికాలోని న్యూ మెక్సికోసిటీ ఎడారిలో అణుబాంబును విజయవంతంగా పరీక్షించారు. ఆ తర్వాత ట్రూమెన్‌ వద్దకు వచ్చిన అధికారులు  ‘కవలపిల్లలు ప్రసవించటానికి ఏర్పాట్లు సిద్ధం చేశాం’ అన్నారు. ఆ కవలపిల్లలే లిటిల్‌బోయ్, ఫ్యాట్‌బోయ్‌లని  ప్రపంచానికి తర్వాత తెలిసింది. అమెరికా న్యూక్లియర్‌ బలాన్ని స్టాలిన్‌కు ప్రదర్శించటానికి,  ప్రపంచ ఆధిపత్య సాధనకోసమే ఈ అణ్వస్త్రాల ప్రయోగం జరిగింది. తదనంతరకాలంలో ప్రచ్ఛన్న యుద్ధానికి, ఆయుధపోటీకి దారితీసింది. 

1962లో క్యూబన్‌ మిస్సైల్స్‌ సంక్షోభంతో అణ్వాయుధ యుద్ధానికి దరిదాపుల్లోకి ప్రవేశించింది. సోవి యట్‌ యూనియన్, అమెరికా, యూకేల మధ్య  అణ్వాయుధ పరీక్షల సంఖ్యను తగ్గిస్తూ 1963లో కుది రిన ఎల్‌టీబీటీ ఒప్పందంపై 113 దేశాలు సంతకం చేశాయి. కానీ ఆ తదుపరి పదేళ్లలో అప్పటికే తయారయి వున్న క్షిపణులతో 12 వేల న్యూక్లియర్‌ హెడ్స్‌ను బిగించటం జరిగింది. జూన్‌ 1979లో ఆస్ట్రియా రాజ ధాని వియన్నాలో ఒప్పందం మేరకు అణ్వాయుధాల సంఖ్యను పరిమితం చేసుకోగా, 1980 అఫ్గానిస్తాన్‌ పరి ణామాలతో ఈ ఒప్పందం రద్దయింది. 

1970వ దశకం మధ్య వరకూ అణ్వాయుధాలు, వ్యూహాత్మక క్షిపణుల తయారీలో అమెరికాదే పైచేయిగా ఉండేది. యూరప్‌లో ఒక మూలనుంచి వేరొక ప్రాంతానికి ఎక్కుబెట్టగలిగే అణు క్షిపణులు వేలకువేలు వచ్చిచేరి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. ఈ నేపథ్యంలో జరిగిన చర్చలు ఫలప్రదమవ్వటంతో 1987లో రొనాల్ట్‌ రీగన్, గోర్బచేవ్‌ల మధ్య కుదిరిన ఒప్పందమే ‘ఐఎన్‌ఎఫ్‌’ (మధ్యంతర అణుక్షిపణుల శక్తుల) ఒప్పందం. దీని ప్రకారం 5,500 కి.మీ.లలోపు ప్రయాణం చేయగల అణుక్షిపణులను నిర్వీర్యం చేయాలి. అణ్వాయుధాల నిర్మూలన ప్రక్రియలో ఇది ఒక పెద్ద విజయం. ఈ ఒప్పందాన్నే ట్రంప్‌ రద్దుచేశాడు. నేటి ఆయుధ పోటీలో హైపర్‌సోనిక్‌ క్షిపణులతో నూతన శకం ఆరంభమైంది. ఈ నూతన అధ్యాయాన్ని ఈసారి రష్యా ప్రారంభించింది. శక్తిమంతమైన జిక్రోన్‌ యుద్ధ నౌక నుండి క్రితం నెలలో ప్రయోగించిన హైపర్‌సోనిక్‌ క్షిపణి శబ్ధతరంగాల వేగం కంటే 7 రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించి ప్రపంచ ఆయుధ ఉత్పత్తిదారులను ఆశ్చర్యపర్చింది. ఇటీవలి కాలంలో చైనా కూడా భూగర్భ అణ్వస్త్ర గిడ్డంగులను శరవేగంగా నిర్మిస్తోంది. 

ప్రపంచ అగ్రదేశాలు జాతీయవాదం, స్వీయరక్షణ పేరిట కూటములుగా ఏర్పడి అడ్డూఅదుపూ లేకుండా మారణాయుధాలను తయారు చేస్తున్నాయి. జీవన ప్రమాణాల మెరుగుదల, నిరుద్యోగ నిర్మూలన, పర్యావరణ పరిరక్షణ, దారిద్య్ర నిర్మూలన, మెరుగైన విద్యావైద్య సదుపాయాలు వంటి ప్రధాన సమస్యల కంటే, మానవాళిని, భూగోళాన్ని తొందరగా వినాశనం చేయాలనే దిశగానే ఆయుధపోటీకి ప్రభుత్వాలు వెళుతున్నాయి. ప్రపంచ ప్రజల శాంతి ఉద్యమమే దీనికి విరుగుడుగా ఎదగాలి. ప్రపంచంలో కొన్నిదేశాల దగ్గరే అణ్వస్త్రాలు ఉండాలనే వాదన కంటే అణ్వస్త్ర రహిత సమాజ దిశగా పయనిద్దాం.


బుడ్డిగ జమిందార్‌ 
ఆల్‌ ఇండియా ప్రోగ్రెసివ్‌ ఫోరం కార్యవర్గ సభ్యులు ‘ 98494 91969
(ఆగస్టు 6 నాటికి హిరోషిమా మారణకాండ జరిగి 76 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా)

మరిన్ని వార్తలు