చిరకాల మిత్రుడికి ఓ ఒప్పంద కానుక!

12 Dec, 2021 00:51 IST|Sakshi

డిసెంబరు 6న, భారత్‌–రష్యాల 21వ వార్షిక సమావేశాలకు మనదేశానికి వచ్చిన రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు మనమిచ్చే కానుకగా ఎస్‌–400 ఒప్పందాన్ని అమలుచేస్తూ రష్యా మిత్రులమని నిరూపించుకొన్నాము. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య 28 ఒప్పందాలు జరిగాయి. పుతిన్‌ తన ప్రసంగంలో అఫ్గానిస్తాన్‌ పరిస్థితులపై సహజంగా ఇరు దేశాలూ ఆందోళన చెందుతున్నాయన్నారు. అక్కడ ఉగ్రవాదం, తీవ్రవాదులకు అందుతున్న నిధులు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై భారత్‌తో కలిసి పనిచేస్తామని అన్నారు. కోవిడ్‌తో పలు సవాళ్లు ఎదురైనప్పటికీ ఇరుదేశాల సంబంధాలపై ప్రభావం చూపలేదని ప్రధాని మోదీ చెప్పారు. ఇరు ఈ భేటీలో ప్రధానంగా వ్యూహాత్మక భాగస్వామ్యం, దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా వాణిజ్య సంబంధాలు మరింత మెరుగుపర్చటం, ఇంధన అంతరిక్ష రంగాలలో మరింత ముందుకు వెళ్తూ, రక్షణ రంగాల్లో అనేక కీలక ఒప్పందాలు జరిగాయి. ఏకే–47 తుపాకులు మనదేశంలో తయారయ్యే విధంగా ఒప్పందాలు కుదిరాయి.

మన దేశం 2018లో రష్యాతో కుదుర్చుకొన్న 520 కోట్ల డాలర్ల రక్షణ ఒప్పందం ప్రకారం ఐదు ఎస్‌–400 క్షిపణి రక్షణ కవచాల్ని మనం 2020 చివరి నాటికి దిగుమతి చేసుకోవాల్సి ఉంది, కానీ చెల్లింపులలో జాప్యం కారణంగా ఈ ప్రక్రియ ఇప్పుడు ప్రారంభమైంది. శత్రు దేశాల నుండి ప్రయోగించే క్షిపణులను ధ్వంసం చేయగల సమర్థత ఈ ఎస్‌–400 రక్షణ క్షిపణుల సొంతం. నూటికి నూరుపాళ్ళు సామర్థ్యం చూపే రక్షణ కవచాలుగా ఇవి పేరుగాంచాయి. అమెరికా థాడ్‌ వ్యవస్థ కంటే చాలా నమ్మదగ్గవిగా ప్రపంచ మిలటరీ ప్రావీణ్యుల అభిప్రాయం. ఎస్‌–400 రక్షణ క్షిపణులు 30 కిలోమీటర్ల ఎత్తులో 400 కిలోమీటర్ల పరిధిలోవున్న శత్రుక్షిపణులను ధ్వంసం చేసే శక్తిని కల్గి ఉంటాయి. అంతేగాక ఒకేసారి 300 క్షిపణులపై దాడి చేయగలవు. ఇప్పటికే టర్కీ, చైనా దేశాలు ఎస్‌–400 వ్యవస్థల్ని దిగుమతి చేసుకొన్నాయి. మధ్యప్రాచ్యం, ఆసియా పసిఫిక్, ఆఫ్రికాలలో మరొక 7 దేశాలు దిగుమతి చేసుకోవటానికి రష్యాతో సంప్రదింపులు జరుపుతున్నాయి.

ఎస్‌–400 వ్యవస్థ ఒక పెద్ద బ్యాటరీ, దీర్ఘశ్రేణి రాడార్‌తోనూ, లక్ష్య గుర్తింపు రాడార్‌ను కలిగి ఉండి ప్రతీ లాంచర్‌కి నాలుగు ట్యూబులు ఉంటాయి. కమాండర్‌ పోస్టు వాహనంలో 8మందితో కూడిన రెండు బెటాలియన్స్‌ ఉంటాయి. కమాండర్‌ పోస్టు, రాడార్లు, లాంచర్లు అసమానమైన రాళ్ళురప్పలు ఉండే భూభాగంపై  కదిలే సామర్థ్యాన్ని కల్గిఉంటాయి. ఈ వాహనాలు మల్టీయాక్సిల్స్, మల్టీ వీల్స్‌ కల్గి ఉంటాయి. మన ఇండియన్‌ ఎయిర్‌ఫోర్సుకు చెందిన 100 మంది నిపుణులు ప్రస్తుతం రష్యాలో శిక్షణ పొందారు. 

రష్యాతో ఎస్‌–400 చర్చలు జరపవద్దని ట్రంప్‌ హయాం నుండి అమెరికా ప్రభుత్వం మన దేశ రక్షణ శాఖపై ఒత్తిడి చేస్తూనే ఉంది. గతంలో ఇరుదేశాల రక్షణ విదేశాంగ మంత్రుల సమావేశాల్లో రష్యాతో కుదిరిన ఒప్పందాన్ని మానుకోమని ఆనాటి అమెరికా విదేశాంగ మంత్రి పాంపియో భారత్‌పై గట్టి ఒత్తిడి తెచ్చినా ఫలితం లేకపోయింది. మార్చి నెలలో భారత్‌లో పర్యటించిన అమెరికా రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ మాట్లాడుతూ ‘కాట్సా’ (కౌంట రింగ్‌ అమెరికా అడ్వర్సరీస్‌ త్రూ శాంక్షన్స్‌ యాక్ట్‌) ఆంక్షల ప్రేరణకు గురికాకుండా భారత్‌ చర్యలు చేపట్టాలని సూచించాడు. 2016లో ఎస్‌–400 చర్చలు జరుగుతున్నప్పుడు ‘కాట్సా’ చట్టం అమెరికాదనీ, ఇవేమీ ఐక్యరాజ్యసమితి ఆంక్షలు కావనీ, ఆ చట్టంతో మా దేశానికేమిటి సంబంధమనీ అప్పటి రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ దీటుగా సమాధానమిచ్చారు. ఈ మధ్య మోదీ ప్రభుత్వం అమెరికాతో మిలటరీపరంగా లాజిస్టిక్స్‌ ఒప్పందాల వంటివి అనేకం చేసుకొంది. ‘క్వాడ్‌’ కూటమిలో కూడా భారత్‌ ప్రవేశించి విదేశాంగ, రక్షణ విధానాలను అమెరికా వైపునకు మొగ్గు చూపుతూ తన చిరకాల మిత్రుడు రష్యాకు దూరమవుతున్నట్లుగా వస్తున్న విమర్శల నుండి బయటపడడానికి కూడా ఎస్‌400 ఒప్పందం తోడ్పడుతుందని భావిస్తోంది.
 
ఎస్‌–400 వంటి రక్షణ వ్యవస్థల దిగుమతి పెరిగేకొద్దీ అసలు క్షిపణుల ఉపయోగమే ఉండదు. చైనా, భారత్‌ రెండు వైపులా ఎస్‌–400లను స్థాపించుకొంటే ఒకరిపై ఒకరు క్షిపణులను ప్రయోగించినా అవి గాలిలోనే ఎస్‌–400 సహాయంతో ధ్వంసమౌతాయి గనుక ఇక క్షిపణుల తయారీ, మోహరింపులకు అర్థం లేదు. మరోవైపు శత్రువుల నుండి వచ్చే క్షిపణులను ఛేదిస్తూనే సమాంతరంగా క్షిపణులను కూడా ప్రయోగించవచ్చు గనుక క్షిపణుల రక్షణ వ్యవస్థ లేకుంటే నష్టపోతారు. రష్యా వ్యతిరేక నాటో యుద్ధకూటమిలోని 28 దేశాల్లోని టర్కీ నేడు రష్యా నుంచి ఎస్‌–400లను దిగుమతి చేసుకొం దంటే, ఈ వ్యవస్థకున్న ప్రాధాన్యం అర్థమవుతోంది. అమెరికా మిత్ర దేశమైన సౌదీ అరేబియా కూడా ఎస్‌–400 వ్యవస్థల కోసం సంప్రదింపులు జరుపుతూండటం గమనార్హం.


బుడ్డిగ జమిందార్‌ 
వ్యాసకర్త అసోసియేట్‌ ప్రొఫెసర్‌

కె.ఎల్‌. యూనివర్సిటీ ‘ 98494 91969 

మరిన్ని వార్తలు