నిజాలకు పాతరేసి.. అబద్ధాన్ని అందలం ఎక్కిస్తే...

5 Jan, 2022 13:26 IST|Sakshi

సందర్భం 

సోషల్‌ మీడియా వేదికగా కొందరు ముస్లిం మహిళలను లక్ష్యంగా చేసుకొని వారి గౌరవానికి, ప్రైవసీకి తీవ్ర విఘాతం కలిగించారు. సామాజిక మాధ్యమాల ఖాతాల్లోంచి ముస్లిం మహిళల ఫొటోలను సేకరించి, ఓ యాప్‌లో వేలానికి పెట్టడం కలకలం రేపింది. ‘బుల్లీబాయ్‌’ పేరుతో రూపొందించిన బ్లాగ్‌లో ముస్లిం మహిళల ఫొటోలను విక్రయానికి పెట్టారు. వందల సంఖ్యలో ఫొటోలు ఆ యాప్‌లో ఉన్నాయి. ‘బుల్లీబాయ్‌ ఆఫ్‌ ది డే’ పేరుతో రోజుకు ఒక ముస్లిం మహిళ ఫొటోను వేలం వేయటం ఈ యాప్‌ ప్రత్యేకత. (ఇందుకు కారకుల్లో ఒకరిని అరెస్ట్‌ చేయడంతో ప్రస్తుతానికి ఈ ఎపిసోడ్‌కి తెర పడింది). సలీ డీల్స్‌కు క్లోనింగే బుల్లీబాయ్‌ అనుకుంటున్నారు. బుల్లీబాయ్‌ తరహాలోనే ‘సలీ డీల్స్‌’ పేరుతో ఆర్నెల్ల క్రితం గిట్‌హబ్‌లో ఓ బ్లాగ్‌/యాప్‌ ఇలాంటి చర్యలకే ఒడి గట్టింది. మతరాజకీయాలు చేస్తూ, ముస్లింలను లక్ష్యంగా చేసుకొని సాంకేతికతతో ముస్లిం వ్యతిరేక భావవాతావరణం కల్పిస్తూ కొందరు రెచ్చగొడుతున్నారు.

ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మెజారిటీ మతవాద ప్రతినిధులు తమ ‘భావజాలాన్ని’ నమ్మేలా సృష్టిస్తున్న వాతావరణంలో.. మైనారిటీలు వాస్తవాల్ని, సత్యాన్ని కాపాడుకోవడం కష్టం అవుతోంది. ఎందుకంటే అధికారంలో ఉన్నవారు తమ అభిప్రాయాలే నిజం అంటూ భ్రమ కల్పిస్తున్నారు. తాము ప్రచారం చేయదలచుకున్న ఫేక్‌ న్యూస్‌ను నమ్మేలా ‘భావవాతావరణా’న్ని మీడియా ద్వారా సృష్టిస్తున్నారు. ఈ ట్రెండ్‌ గత ఐదేళ్ళుగా దేశంలో బాగా పెరిగిపోతోంది. ముస్లింల జనాభా బాగా పెరిగిపోతోందని.. ముస్లిం పురుషులు నలుగురిని పెళ్ళి చేసుకుంటున్నారనీ.. ఇలా అనేక అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు. ఈ మతవాదులు చేస్తున్నది గోబెల్స్‌ ప్రచారం. ఒక అబద్ధాన్ని వందసార్లు ప్రచారం చేస్తే 101వ సారి నిజం అవుతుందన్నది గోబెల్స్‌ సిద్ధాంతం.

వాస్తవానికి దేశంలో ఇప్పుడున్న స్థితి ఏమిటంటే... 35 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 29 చోట్ల హిందువులే మెజారిటీగా ఉన్నారు. లక్షద్వీప్‌ (లక్ష మంది), జమ్ము–కశ్మీర్‌ (కోటీ 30 లక్షల మంది)ల్లో మాత్రమే ముస్లింలు మెజారిటీ. పంజాబ్‌లో సిక్కులు; నాగాలాండ్‌ (20 లక్షలు), మిజోరం (10 లక్షలు), మేఘాలయ (30 లక్షలు)ల్లో క్రైస్తవులు మెజారిటీగా ఉన్నారు.

2021 నాటికి దేశంలో 110 కోట్ల మంది హిందువులు ఉండగా, ముస్లింల జనాభా 20 కోట్లు మాత్రమే ఉన్నట్లు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. అంటే.. 80 శాతం హిందువులుంటే, 20 శాతం ముస్లింలు ఉన్నారు! వాస్తవం ఇలా ఉండగా.. ముస్లింల సంఖ్య పెరిగిపోతుందంటూ దుష్ప్రచారం చేస్తూ ఇదే నిజం అని నమ్మించేలా భావ వాతావరణం కల్పిస్తున్నారు. మనుషుల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన మత విషయాన్ని పబ్లిక్‌ చర్చకు పెట్టి, రెచ్చగొడుతూ ఓట్లు రాల్చుకుంటున్నారు. ఇటీవల ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జరిగిన ’ధర్మ సంసద్‌’ సమావేశం నడిచిన తీరు ముస్లింలపై జరుగుతున్న అసత్య ప్రచారానికి అద్దం పడుతోంది. 

ఈ ధర్మసంసద్‌లో హిందూ సాధువులు.. హిందూ మతాన్ని కాపాడుకోడానికి ఆయుధాలు చేపట్టాలని, ముస్లిం... ప్రధానమంత్రి కాకుండా అడ్డుకోవాలని, ముస్లిం జనాభాను పెరగనివ్వకూడదని ఇచ్చిన పిలుపును ఏవిధంగా అర్థం చేసుకోవాలి? మత విద్వేషం నిజాన్ని కప్పేస్తుంది. ఈ దేశంలో పుట్టి పెరిగిన ముస్లింలను శత్రువులుగా ముద్రవేయడాన్ని దేశభక్తికి కొలమానంగా  చూడటం, రాజ్యాంగం ప్రసాదించిన హక్కులకు ముస్లింలను దూరం చేయాలనుకోవడం కరెక్టేనా? ప్రజలకు వాస్తవాల ఎరుకను కలుగ జేయవలసిన బాధ్యత లౌకికవాదులందరికీ ఉంది.

- డా. ఎంకే ఫజల్‌
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్, హైదరాబాద్‌  

>
మరిన్ని వార్తలు