సమూహ రోగనిరోధక శక్తి సాధించామా...!

11 Oct, 2020 01:28 IST|Sakshi

ప్రపంచవ్యాప్తంగా 3.72 కోట్ల కేసులు, దేశవ్యాప్తంగా మెుత్తం 70 లక్షల కేసులు దాటుతున్నాయి.  రెండు తెలుగు రాష్ట్రాలలో రోజు రోజుకు కరోనా పాజిటివ్‌ కేసులు నేటికీ (2,000–10,000ల మధ్య) నమోదు అవుతూనే ఉన్నాయి. భద్రతా ప్రమాణాలు పాటించి రూపొందించిన వ్యాక్సీన్‌ మార్కెట్‌లోకి రావడానికి మరి కొన్ని మాసాలు ఎదురుచూడవలసినదే అనే భావన సర్వత్రా వినిపిస్తున్నది. ఈ సందిగ్ధ సమయంలో కోవిడ్‌–19ను ‘హెర్డ్‌ ఇమ్యూనిటీ’ (మంద లేదా సమూహ రోగనిరోధక శక్తి) ద్వారా మాత్రమే కరోనా వ్యాప్తిని నియంత్రించవచ్చనే ఆశలు ఫలించే క్షణాలు ఆసన్నమైనాయనే వార్తలు సంతోషాన్ని కలిగిస్తున్నాయి. 

ఇటీవల న్యూఢిల్లీ మరియు ముంబాయ్‌లలో సెరో నిర్వహించిన సర్వే ప్రకారం కొన్ని ఆర్థిక సామాజిక సమూహాలలోనే హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధ్యమని, ఇది కూడా స్వల్పకాలం వరకు మాత్రమే ఉంటుందని, దీర్ఘకాలం రక్షించగల రోగనిరోధకశక్తి అభివృద్ధి ఉండదని తేలింది. హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధనకు ఎంత శాతం ప్రజలు వ్యాధినిరోధకశక్తిని పొందాలనే స్పష్టత కూడా అంచనా వేయలేకపోతున్నామని సెరో సర్వే నిపుణులు తెలుపుతున్నారు. పిల్లల్లో, యువతలో ఇమ్యూనిటీ లెవల్స్‌ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వారి ద్వారా హెర్డ్‌ ఇమ్యూనిటీ అభివృద్ధి చేయవచ్చని భావిం చారు.

కాని ఇలాంటి హెర్డ్‌ ఇమ్యూనిటీని కరోనా వైరస్‌తో దేశమంతట సాధించడం అంత సులభం కాదని పరిశోధనలు తెలిపినా, ఒక ప్రాంతంలోని జనాభాలో కనీసం 60 శాతం లేదా అంత కన్న ఎక్కువ ప్రజల్లో యాంటీబాడీలు అభివృద్ధి చెందితే హెర్డ్‌ ఇమ్యూనిటీ స్థాయికి ఆ ప్రాంతం చేరినట్లే అని వైపాలజిస్టులు అభిప్రాయ పడుతున్నారు. జనాభాలో వైరస్‌ను తట్టుకొనే యాంటీబాడీలు వృద్ధి చెందినప్పటికీ, అవి ఎక్కువ కాలం ఉండవని తేల్చారు. ఒక ప్రాంతంలోని జనాభాలో ఎంత మందిని వైరస్‌ సోకింది, ఎంత మంది రోగనిరోధకశక్తిని పొందారనే దాని పైననే ఇది ఆధారపడి ఉంటుందని తెలిపారు.

సంపూర్ణ ఆరోగ్యవంతుల శరీరంలో కోవిడ్‌– 19  వైరస్‌కు వ్యతిరేకంగా ఆంటీబాడీలు ఏర్పడితేనే హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధ్యమవుతుంది. సమతుల పోషకాహారం లేకుండా రోగనిరోధక శక్తి పెరగడం అసాధ్యం. దేశంలో నెలకొన్న పోషకాహార లోపం, అవిద్య, కడుపేదరికం, కరోనా కబళించిన వృత్తి ఉద్యోగాలు లాంటి సమస్యల వల్ల సులభంగా వైరల్‌ ఇమ్యూనిటీ సాధించడం కష్టమే అయినప్పటికీ మన ఆహారపు అలవాట్లు, జీవనశైలి, వృత్తులు, ప్రతికూలతలను తట్టుకునే శక్తి వంటి కారణాలతో భారత్‌లోని కొన్ని ప్రాంతాల్లో హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధ్యమని తెలుస్తోంది. భారత్‌లో కోవిడ్‌–19 వ్యాధి సోకిన వారిలో 1.80 శాతం మాత్రమే మరణిస్తున్నారనే విషయం మనందరికి ఊరటను ఇస్తున్నది. హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధించినా, ప్రతి ఒక్కరు జీవనశైలిలో తగు జాగ్రత్తలు తీసుకుంటూనే, రోగనిరోధకశక్తిని పెంచే ఆహారాలను ఆశ్రయించి, కరోనా కోరలను పీకడానికి సిద్దంగా ఉంటామని ప్రతిజ్ఞ చేద్దాం. 
డా. బుర్ర మధుసూదన్‌ రెడ్డి,
విశ్రాంత ప్రధానాచార్యులు, ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాల , కరీంనగర్‌ ‘ 99497 00037

మరిన్ని వార్తలు