సంక్షేమ రాజ్య స్థాపనే రాజ్యాంగ లక్ష్యం

10 Aug, 2022 08:55 IST|Sakshi

రాష్ట్రంలోనే కాక దేశ వ్యాప్తంగా మరో విష ప్రచారానికి తెరలేచింది. పేదవాళ్లకు అందుతున్న నగదు బదిలీలు, సంక్షేమ పథకాలకు అడ్డుకట్ట వేయకపోతే కొన్ని రాష్ట్రాల్లో శ్రీలంక ఆర్థిక సంక్షోభం తరహా పరిణామాలు ఉత్పన్నం అవుతాయట. అందువల్ల కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్, సుప్రీంకోర్టు... ఇత్యాది ఉన్నత రాజ్యాంగ వ్యవస్థలు తక్షణం జోక్యం చేసుకొని ఆయా రాష్ట్రాలకు ముకుతాడువేసి సంక్షేమ పథకాలను నిలుపుదల చేసి పేదవాణ్ణి శిక్షించాలని కోరుతున్నారు కొందరు.
చదవండి: ఇవి అనుచితం ఏమీ కాదు!

ఎంత దుర్మార్గం ఇది! శ్రీలంక ఆర్థిక సంక్షోభానికి కారణం అక్కడి పేద, మధ్య తరగతి వర్గాలకు ఆ ప్రభుత్వం అందించిన రాయితీలు, సంక్షేమ పథకాలు ఎంతమాత్రం కాదు. ఈ వాస్తవం శ్రీలంక ప్రజలకు తెలుసు. అధికారంలో ఉన్న వారు అమలు చేసిన సంక్షేమ పథకాల వల్లే తమ దేశం దివాళా తీసిందని అక్కడి ప్రతిపక్ష పార్టీలు విమర్శించడాన్ని ఏవరైనా చూశారా, చదివారా?

మోకాలికీ, బోడి గుండుకూ ముడిపెట్టే చందంగా శ్రీలంక దేశంలోని సంక్షుభిత రాజకీయ పరిణామాలను మన దేశంలోని ఆంధ్రప్రదేశ్‌తోసహా మరికొన్ని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితికి ముడిపెడుతున్నారు కొందరు కుహనా మేధావులు. ప్రజల ఆదరణ పొందిన ప్రభుత్వాలపై పనిగట్టుకొని బురద జల్లేందుకు అల్లిన ఇటువంటి కథనాలలో వాస్తవం లేదు.

శ్రీలంక ఆర్థిక, రాజకీయ సంక్షోభాన్ని బూచిగా చూపి ఇక్కడి పేదవాడి కంచంలోని అన్నం ముద్దను లాగేయాలనీ, పేద విద్యార్థులకు అందే నాణ్యమైన విద్యను దూరం చేయాలనీ, మధ్యతరగతి వర్గాలకు అందిస్తున్న నగదు బదిలీ వంటి పథకాలను రద్దు చేయాలనీ గగ్గోలు పెడుతున్నారు. న్యాయస్థానాలకు ఎక్కుతున్నారు. తాము కట్టే పన్నులన్నీ బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికే ఖర్చు చేసి... అభివృద్ధి పనుల్ని అటకెక్కిస్తున్నారనే వాదనతో సంపన్న వర్గాలను పేద వర్గాల వారిపై ఎగదోసి, ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు.

ఏపీ లాంటి ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల వల్ల ఖర్చు తప్ప సంపద పెరగదని కొందరు పెదవి విరుస్తున్నారు. వారి దృష్టిలో అసలు సంపద అంటే ఏమిటి? సంపద అంటే పేదవర్గాల ఆర్థికాభివృద్ధే సంపద. అందుకే, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మానవాభివృద్ధి, కుటుంబ సంక్షేమమే నిజమైన సంపద అని మనసా వాచా నమ్ముతూ ఆ దిశలోనే నవరత్నాలను ప్రకటించి అమలు చేస్తున్నారు. ఇదే సమయంలో అభివృద్ధి కార్యక్రమాలను ఎక్కడా ఆపలేదు.

ప్రముఖ ఆర్థిక చరిత్ర కారుడు డేవిడ్‌ రాండెస్‌ 21వ శతాబ్దిలో ప్రపంచం ఎదుర్కొనే ఏకైక ప్రమాదం ‘ధనిక పేద ప్రజలను విడదీసే సంపద, ఆరోగ్యాల మధ్య ఏర్పడే అంతరం మాత్రమే’ అని పేర్కొన్నాడు. సమాజంలో సంపద పెరగాల్సిందే. అందులో రెండో అభిప్రాయం ఎవరికీ ఉండదు. సగటు జాతీయోత్పత్తి పెరిగితే దానిని అభివృద్ధికి కొలమానంగా గుర్తించే ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ తదితర ఆర్థిక సంస్థలు వేసే లెక్కలు తప్పని తేలింది. పేదరిక నిర్మూలనకూ, దిగువ మధ్య తరగతి వర్గాల జీవన ప్రమాణాల మెరుగుదలకూ జాతీయ ఆదాయాన్ని పెంచడం ఒక్కటే మార్గం కాదని అంతర్జాతీయంగా రుజువైంది.

పేదరికాన్ని సూటిగా ఎదుర్కోవడానికి ఆర్థిక, సామాజిక సంస్కరణలు చేపట్టి ఆయా వర్గాలను సాధికారులను చేయడం అనివార్యమని నోబెల్‌ బహుమతి గ్రహీత అమర్త్యసేన్, మరో ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త మక్‌బూన్‌ ఉల్‌హక్‌ వంటి వారు చాలా కాలం క్రితమే చెప్పారు. అందుకు ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యావిధానాలలో పూర్తిస్థాయిలో సంస్కరణలు చేయాలనీ; ఆరోగ్య రంగంలో రోగ నివారణ, వైద్యం, తల్లుల పౌష్టికాహారం, పర్యావరణ పరిరక్షణ, వృద్ధుల సంక్షేమం వంటివి అత్యంత ప్రాధాన్యత ఉన్న అంశాలనీ పేర్కొన్నారు.

ఆ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సంక్షేమ చర్యలు చేపట్టింది. రైతులు, అసంఘటిత కార్మికులు, చేతివృత్తులపై ఆధారపడిన వారి ఆదాయాల్ని పెంచడంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దృష్టి సారించింది. ఢిల్లీలో ఆవ్‌ుఆద్మీ ప్రభుత్వంగానీ, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వంగానీ ఆ బాటలోనే నడుస్తున్నాయి. తెలంగాణలోని కేసీఆర్‌ ప్రభుత్వం సైతం కొన్ని వినూత్న సంక్షేమ పథకాలతోపాటు ‘దళితబంధు’ వంటి ప్రయోగాత్మక పథకాలను అమలు చేస్తోంది.

నిజానికి, ప్రభుత్వాలకు భారత రాజ్యాంగం నిర్దేశించిన లక్ష్యం  సంక్షేమ రాజ్యస్థాపనే. ఈ ఏడు దశాబ్దాల కాలంలో కేంద్ర, రాష్ట్రాలు ఉమ్మడిగా కొన్ని లక్షల కోట్ల రూపాయలు సంక్షేమ, అభివృద్ధి రంగాలపై ఖర్చు చేశాయి. అయినప్పటికీ దేశంలో వ్యవసాయ రంగం తిరోగమనంలో ఉంది. నిరుద్యోగం గరిష్ఠ స్థాయికి చేరింది. ఖర్చు చేసిన నిధుల వల్ల అధికంగా ప్రయోజనం పొందిన వర్గాలేమిటి? ఎందుకు ఆర్థిక అంతరాలు అంతకంతకూ పెరిగాయి? సంపద పెంచామని చెప్పుకొంటున్న వారి పాలనలో ఎవరు బాగుపడ్డారు? ఏ ప్రాంతాలు అభివృద్ధి సాధించాయి? ఏ మేరకు ఆర్థిక, సామాజిక అసమానతలు తగ్గాయి? విద్య, వైద్యం ఖరీదుగా మారి పేద, మధ్యతరగతి వర్గాలకు అందని ద్రాక్షగా మారిపోవడానికి కారణం ఏమిటి? ఇందుకు అవలంభించిన విధానాలను సమీక్షించాల్సిన అవసరం లేదా?

అధికారంలో ఉండగా పేద వర్గాలను సాధికారులుగా చేయకుండా వారి సంక్షేమాన్నీ, అభివృద్ధినీ నిర్లక్ష్యం చేసినవారు... ఇపుడు ఆ వర్గాలు అభివృద్ధిబాటలో పయనిస్తూ తమను ఆదరించిన పార్టీకి కృతజ్ఞతాపూర్వకంగా మళ్లీ ఎన్నికలలో ఎక్కడ ఓట్లు వేస్తారేమోనని భయపడుతున్నారు. ఇపుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో, అక్కడ ఢిల్లీలో అమలు జరుగుతున్న వినూత్న సంక్షేమ కార్యక్రమాల్ని ఎలాగైనా నిలుపుదల చేయించాలని కొన్ని విఫల యత్నాలు జరుగుతున్నాయి. అదే జరిగితే, ఆ పార్టీల్ని ప్రజలు క్షమిస్తారా?!
 


సి. రామచంద్రయ్య 
వ్యాసకర్త ఏపీ శాసన మండలి సభ్యులు

మరిన్ని వార్తలు