చట్టం కంటే ప్రజాచైతన్యం ముఖ్యం

27 Jul, 2021 00:46 IST|Sakshi

సందర్భం

ప్రభుత్వాలు చేసే చట్టాల వల్ల తమకు మేలు జరుగుతుందని ప్రజలు భావించాలి. అప్పుడే  ఆశించే ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఈ వాస్తవం ఏడు దశా బ్దాల స్వతంత్ర భారతంలో పదేపదే రుజువైనప్పటికీ, ఆయా వర్గాలను సంతృప్తి పర్చడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు పలు సందర్భాలలో మొక్కుబడి చట్టాలు తెచ్చిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఇటీవల తెచ్చిన వ్యవసాయ చట్టాల వల్ల గొప్ప మేలు కలుగుతుం దని కేంద్రం పేర్కొంటున్నప్పటికీ, రైతులు సాను కూలంగా స్పందించడం లేదు. ఎన్డీఏ తెచ్చిన పలు చట్టాలపై ఇప్పటికే ప్రజాబాహుళ్యంలో విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో ‘జనాభా నియంత్రణ’పై చట్టం తేవడానికి అధికార బీజేపీ అడుగులు వేయడం మరో వివాదానికి తెరలేపింది. 

ఇప్పటికే బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తర ప్రదేశ్, అస్సాం రాష్ట్ర ప్రభుత్వాలు జనాభా నియం త్రణ బిల్లులను తమ శాసనసభల్లో ప్రవేశపెట్టాయి.  ‘ఉత్తర ప్రదేశ్‌ జనాభా (నియంత్రణ, స్థిరీకరణ, సంక్షేమం) బిల్లు 2021’ ముసాయిదాను యోగీ ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రజానీకం ముందుంచి, వారి సలహాలు, సూచనలను ఆహ్వా నించింది. కాగా, యూపీ తరహాలోనే జనాభా నియంత్రణ బిల్లును తెచ్చి దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు కేంద్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. జనాభా నియంత్రణకు సంబంధించి 2020 డిసెంబర్‌లో సుప్రీంకోర్టులో దాఖలైన ఓ ప్రజా ప్రయోజన వాజ్యంలో కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్లో చైనా తరహాలో బలవంతంగా కుటుంబ నియంత్రణ చట్టాన్ని తెచ్చే ఉద్దేశమేదీ తమకు లేదనీ, వివిధ స్వచ్ఛంద విధానాల ద్వారా కుటుంబ నియంత్రణ చర్యలతోనే దేశంలో సంతానోత్పత్తి వృద్ధిరేటును కనిష్టంగా 2.1 శాతం సాధించే క్రమంలో ఉన్నామనీ తెలిపింది. జనాభా నియంత్రణపై కేంద్ర ప్రభుత్వ విధానం ఇంత విస్పష్టంగా ఉన్నదని తెలిసినప్పటికీ, పార్లమెం టులో కొందరు అధికార బీజేపీ నేతలు ప్రైవేటు మెంబర్స్‌ బిల్‌ రూపంలో జనాభా నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టాలని పట్టుబడటం వెనుక పలు అనుమానాలు కలుగుతున్నాయి. 

ప్రస్తుత భారత్‌ జనాభా ప్రపంచ జనాభాలో 6వ వంతు. దేశంలో ప్రతి 20 రోజులకు లక్ష చొప్పున జనాభా పెరుగుతోంది. 135 కోట్ల జనాభా కలిగిన భారతదేశం, 142 కోట్ల జనాభాతో ప్రపంచంలో తొలిస్థానంలో ఉన్న చైనాను దాటడా నికి ఎక్కువ సమయం పట్టదు. స్వాత్రంత్యం లభించిన తొలినాళ్లల్లోనే దేశంలో తీవ్ర ఆహార ధాన్యాల కొరత ఏర్పడింది. అప్పుడున్న 30 కోట్ల జనాభాకు తిండిగింజలను విదేశాల నుండి దిగు మతి చేసుకొన్నది. అటువంటి నేపథ్యంలోనే, నెహ్రూ ప్రభుత్వం 1951లో కుటుంబ నియంత్రణ విధానాన్ని ప్రారంభించింది. అయితే, దీన్ని  బల వంతంగా అమలు చేయలేదు. తర్వాతి ప్రభు త్వాలు కూడా ప్రజలపై నిర్బంధంగా రుద్ద లేదు. ఒక్క ఎమర్జెన్సీ సమయంలోనే చెదురుమదురుగా బలవంతపు ఆపరేషన్లకు పాల్పడిన అమానుష సంఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రజల్లో చైతన్యం కల్పిస్తూ ‘మేమిద్దరం– మాకిద్దరు’ అనే నినాదంతో సాగిన కుటుంబ నియంత్రణ కార్య క్రమాలు సత్ఫలితాలు అందించాయి. ఫలితంగానే, 1950–55 మధ్యకాలంలో సంతానోత్పత్తి వృద్ధి రేటు 5.9 శాతం ఉండగా, అది క్రమంగా 4 శాతా నికి, తదుపరి 3 శాతానికి  తగ్గుతూ 2.2 శాతం వద్ద స్థిరపడింది. 2025 నాటికి 1.93 శాతంకు తగ్గిం చేలా చర్యలు తీసుకుంటున్నారు.

‘అన్ని సమస్యలకు మూలం అధిక జనా భాయే’ అనే భావన ఒకప్పుడు ఉండేది. తర్వాత ‘అన్ని సమస్యలను పరిష్కరించగలిగేది జనాభాయే’ అనే సిద్ధాంతం ఊపిరి పోసుకుంది.  మానవ వనరుల్ని పూర్తిస్థాయిలో వినియోగించు కొనే దిశగా సమర్థమైన కార్యాచరణ అమలు చేసిన తర్వాతనే చైనా ఆర్థిక వ్యవస్థ బలీయమైన శక్తిగా రూపొందింది. అంతకుముందు ‘ఒకే బిడ్డ’ విధా నాన్ని నిర్బంధంగా అమలు చేయడంతో చైనాలో యువత సంఖ్య గణనీయంగా తగ్గి, వైద్య ఆరోగ్య సౌకర్యాలు అవసరమైన వృద్ధుల సంఖ్య పెరగ డంతో తన విధానాన్ని సవరించుకొంది. ఇద్దరు బిడ్డల విధానాన్ని ప్రవేశపెట్టింది. ఎక్కువ మంది పిల్లలను కనే కుటుంబాలకు ప్రోత్సాహకాలు కూడా అందిస్తోంది. మహిళా సాధికారత, గ్రామీణ ప్రాంతాలలో విద్య, ఆరోగ్యం, మౌలిక సదు పాయాల కల్పన, ప్రతి ఒక్కరికి అర్హతలను అను సరించి నైపుణ్యాలలో శిక్షణ ఇప్పించడం, అభి వృద్ధి కార్య కలాపాలను వికేంద్రీకరించడం, తది తర చర్యలను తీసుకొన్నట్లయితే పెరుగుతున్న జనాభా విలువైన వనరుగా రూపొందుతుంది. 

యూపీ, అస్సాం రాష్ట్రాలలో అధికారంలో ఉన్న బీజేపీ కుటుంబ నియంత్రణ చట్టాలు రూపొందించి, కొన్ని వర్గాల జనాభాను నియం త్రించాలనుకోవడం వెనుక రాజకీయ కోణం ఉంది. దేశంలో కొన్ని రాష్ట్రాలలో హిందువుల జనాభా సంఖ్యను దాటుకొని ముస్లింల జనాభా పెరిగి పోతోందని కొంతకాలంగా చాంధసవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూపీలో ముస్లిం జనాభా పెరుగుతోందన్న కారణంగానే ఆ రాష్ట్రం చట్టం ద్వారా జనాభాను నియంత్రించా లనుకొం టోందని అక్కడి ప్రతిపక్షాలు ఆరోపిస్తు న్నాయి. యూపీ మోడల్‌ను జాతీయ స్థాయిలో అనుసరించి నట్లయితే, కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుంది. ఇద్దరు బిడ్డల విధానం వల్ల, ఆడపిల్లలను పిండ దశలోనే తొలగించి వేసే అవకాశం ఉంది. ఇంకా అనేక సామాజిక సమస్యలు ఉత్పన్నం అయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో, ‘జనాభా నియంత్రణ బిల్లు’పై విçస్తృతమైన చర్చ జరగాలి. మెజార్టీ ప్రజల అభిప్రాయాల మేరకే నిర్ణయం చేయాలి. ‘చట్టం కంటే ప్రజా చైతన్యం’ ముఖ్యం. 


సి. రామచంద్రయ్య 
వ్యాసకర్త శాసన మండలి సభ్యులు, ఆంధ్రప్రదేశ్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌

మరిన్ని వార్తలు