బాబు ‘రైతు విన్యాసాలు’ ఫలించవు!

27 Sep, 2021 00:41 IST|Sakshi

సందర్భం

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఇటీవల ‘రైతు కోసం తెలుగుదేశం’ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం వెయ్యి ఎలుకల్ని తిన్న ‘పిల్లి’ పునీతం కావడానికి గంగాస్నానం ఆచరించిన చందంగా ఉంది. సదరు కార్యక్రమానికి, ‘మీడియా కోసం తెలుగుదేశం’ అనే పేరు పెడితే సరిపోయేదేమో! చంద్రబాబు చేసే కార్యక్రమాలన్నీ మీడియా స్పేస్‌ ఆక్రమించడానికే కదా? ‘రైతు’ అనే పదం పలకడానిక్కూడా చంద్రబాబుకు అర్హత లేదు. చంద్రబాబు చేసిన తప్పిదాల్ని రైతులు మర్చిపోతారా? మరోసారి మోసపోవడానికి సిద్ధపడతారా?

1995–2004 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు తీసుకొన్న రైతు వ్యతిరేక విధానాల వల్ల ఆనాడు రాష్ట్రం అల్లకల్లోలం అయింది. ‘వ్యవసాయం దండగ’ అని ప్రచారం చేశారు. వ్యవసాయంపై ఆధారపడిన వాళ్లు బయటపడి సేవారంగంలో అవకాశాలు అందుకోవాలని ఓ గొప్ప సలహా ఇచ్చారు. కృష్ణానది మిగులు జలాలపై గల హక్కులను సద్వినియోగపర్చుకోలేదు. ఏ ఒక్క భారీ సాగునీటి ప్రాజెక్టునూ నిర్మించలేదు. కర్ణాటక ప్రభుత్వం కృష్ణానదిపై అక్రమంగా ఆల్మట్టి డ్యావ్‌ు ఎత్తు పెంచుకొంటుంటే... నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించి కృష్ణా డెల్టా రైతాంగాన్ని ముంచారు.

వ్యవసాయ అనుబంధ రంగాలను దెబ్బతీశారు. సహకార రంగంలోని లాభాలు ఆర్జిస్తున్న చక్కెర కర్మాగారాలను, స్పిన్నింగ్‌ మిల్లులను మూత వేయించి, ఆ సంస్థలకు చెందిన విలువైన భూముల్ని కారుచౌక ధరలకు అయినవారికి కట్టబెట్టారు. రైతులు పెద్దయెత్తున ఆత్మహత్యలు చేసుకొంటున్న నేపథ్యంలో మానవత్వం లేకుండా విద్యుత్‌ చార్జీలను భారీగా పెంచారు. పెంచిన విద్యుత్‌ చార్జీలను తగ్గించాలని ఉద్యమించిన వారిపై బషీర్‌బాగ్‌లో కాల్పులు జరిపించి ఐదుగురి ఉసురు తీశారు. ఆ కాల్పుల్లో 70 మందికి బుల్లెట్‌ గాయాలైతే ఆ సంఘటనపై కనీసం విచారం వ్యక్తం చేయలేదు.

ఆనాడు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షనేతగా ఉన్న వైఎస్‌ రాజశేఖరరెడి.్డ.. ‘‘మేం అధికారంలోకి వస్తే వ్యవసాయరంగానికి ఉచిత విద్యుత్‌ ఇస్తాం’’ అని హామీ ఇస్తే చంద్రబాబు దానిని ఎద్దేవా చేశారు. విద్యుత్‌ రంగం కుప్పకూలుతుందని, కరెంట్‌ తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుందని బెదిరించారు. అయితే, నాడు రైతులు చంద్రబాబు మాటలు నమ్మలేదు. ఎన్నికలలో చంద్రబాబును ఓడించి తమ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకొన్న వర్గాలలో రైతాంగమే ప్రథమస్థానంలో నిలిచింది. 2004 లో చంద్రబాబు ప్రతిపక్షంలోకి వచ్చాక, స్వరం మార్చి, మళ్లీ ఓట్ల కోసం ‘యూటర్న్‌’ తీసుకొని, ‘అధికారంలోకి వస్తే 12 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తాం’ అంటూ తమ 2009 ఎన్నికల మేనిఫెస్టోలో ఆ వాగ్దానాన్ని చేర్చారు. కానీ రైతులు నమ్మలేదు.

అయితే, 2014లో రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో– ‘‘అధికారంలోకి రాగానే బేషరతుగా రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తాం; బంగారంపై తీసుకొన్న రుణాలతో పాటుగా’’ అంటూ చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాన్ని రైతులు నమ్మారు. ప్రభుత్వ ఆదాయాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిన నేపథ్యంలో మాఫీ సాధ్యమని చంద్రబాబు చెబితే నిజమేనని అనుకున్నారు. మాఫీ అర్హతకు పంట రుణాలు తీసుకొన్న కటాఫ్‌ తేదీని మార్చి 31, 2014గా తీసుకొంటామన్నారు. అధికారంలోకి రాగానే తన సహజ ప్రవృత్తిని బయట పెట్టుకొన్నారు. బంగారంపై తీసుకొన్న రుణాల మాఫీ మాట మర్చిపోయారు.

లబ్ధిదారుల సంఖ్యను తగ్గించడానికి రుణమాఫీ కటాఫ్‌ తేదీని మార్చి 31, 2014 నుంచి డిసెంబర్‌ 31, 2013కు కుదించారు. అయినప్పటికీ మాఫీ చేయాల్సిన బకాయిలు రూ. 89,000 కోట్లు ఉండగా, రద్దు చేయాల్సిన రుణాలు కేవలం రూ. 24,000 మాత్రమేనని తేల్చారు. ఆ మొత్తమైనా ఏకకాలంలో చెల్లించారా? ఐదు విడతలలో చెల్లిస్తామని చెప్పి, ఆ మాట మీద కూడా నిలబడకుండా ఐదేళ్లల్లో రూ. 13,000 కోట్లు మాత్రమే చెల్లించి 2019 ఎన్నికల నాటికి రూ. 11,000 కోట్ల మేర బకాయి పెట్టి రైతుల్ని నిలువునా వంచించారు.

రాష్ట్ర రైతాంగానికి చంద్రబాబునాయుడు ఏదో ఒక సందర్భంలోనైనా తప్పుచేశానని ఒప్పుకొని ఉంటే కొందరైనా ఆయనను క్షమించేవారేమో! కానీ, చంద్రబాబులో నిజాయితీ లేదు.  చంద్రబాబు 5 ఏళ్ల పాలన రాష్ట్ర రైతాంగానికి పీడకలగా మిగిలింది. కరువే భయపడి పారిపోయేట్లు అనంతపురం జిల్లాను కోనసీమగా మారుస్తానంటూ ప్రగల్భాలు పలికారు. పొరుగురాష్ట్రాల మాదిరిగా రైతాంగానికి ‘బోనస్‌’ ఇవ్వలేదు. 2014–19 మధ్య కాలంలో రాష్ట్రంలో వ్యవసాయంలో నెగెటివ్‌ గ్రోత్‌ నమోదయింది. అయితే, తెలివిగా చేపలు, రొయ్యలు, ఇతర మత్స్య సంపదలో కనిపించిన వృద్ధిని వ్యవసాయంలో కలిపి, వ్యవసాయరంగంలో తమ ప్రభుత్వం సాధించిన అభివృద్ధి అంటూ వాస్తవాలకు మసిపూసి మారేడుకాయ చేశారు.

చంద్రబాబు రెండు పర్యాయాలు ఉమ్మడి రాష్ట్రానికి, ఒకసారి విభజిత రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయ యోగ్యమైన భూముల్ని పారిశ్రామికీకరణ పేరుతో కారుచౌకగా వేలాది ఎకరాలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారు. కానీ పేదలకు 50 గజాల నివేశన స్థలం ఇవ్వడానికి కూడా ఆయనకు మనసు రాలేదు. అమరావతి రైతులకు గ్రాఫిక్స్‌ చూపి, 3 పంటలు పండే భూముల్ని లాఘవంగా వారి నుంచి తీసుకొని వారి జీవితాల్లో చిచ్చుపెట్టారు. వ్యవసాయరంగాన్ని చంద్రబాబు నిర్లక్ష్యం చేసిన స్థాయిలో దేశంలో వేరొకరు చేసిన దాఖలాలు లేవు.

కరోనా నేపథ్యంలో రాష్ట్రం, దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా సేవల, పర్యాటక రంగాలు కుప్పకూలాయి. ఆ రంగాలదే భవిష్యత్తు అని ప్రచారం చేసిన చంద్రబాబు వాటి గురించి ఇప్పుడేమీ మాట్లాడ్డం లేదు. ‘రైతేరాజు’ అని భావించి వ్యవసాయరంగానికి పెద్దపీట వేసిన వైఎస్‌ రాజశేఖరరెడ్డే నిజమైన దార్శనికుడని నేటి పరిస్థితులు నిరూపించాయి. కరోనా కష్టకాలంలో దేశాన్ని, రాష్ట్రాన్ని నిలబెట్టింది; ప్రజలకు తిండి గింజల కొరత లేకుండా చేసింది వ్యవసాయ రంగమే. రాజశేఖరరెడ్డికి నిజమైన వారసుడిగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు వ్యవసాయరంగానికి ఇస్తున్న ప్రాధాన్యం, దానివల్ల ఒనగూరుతున్న ఫలితాల్ని పొందుతున్న రైతాంగం... చంద్రబాబు విసిరిన వలకు ఎట్టి పరిస్థితులలో చిక్కుకోరు, మరోమారు మోసపోరు. చంద్రబాబు కృత్రిమ పోరాటాలకు కాలం చెల్లింది. బాబు చేసే ‘రైతు విన్యాసాలు’ ఇకపై ఫలించవు.


సి. రామచంద్రయ్య 

వ్యాసకర్త శాసన మండలి సభ్యులు,
ఆంధ్రప్రదేశ్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ 

మరిన్ని వార్తలు