కరిమింగిన వెలగపండులా దేశ ఆర్థిక వ్యవస్థ

28 Sep, 2022 13:54 IST|Sakshi

దేశంలో ఈ 8 ఏళ్లల్లో బిలియనీర్ల సంఖ్య అనూహ్యంగా పెరగడం, వారి కారణంగా దేశ స్థూల ఉత్పత్తిలో పెరుగుదల కనిపించి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలలో భారత్‌ 5వ స్థానాన్ని ఆక్రమించడం ఎన్డీఏ ప్రభుత్వం ఒక ఘనతగా చెప్పు కొంటోంది. ఓ దశాబ్దం క్రితం వరకు భారత్‌ ఆర్థిక వ్యవస్థ 11వ స్థానంలో ఉండేది. ఇప్పుడది 5వ స్థానా నికి ఎగబాకింది. అది కూడా కోవిడ్‌ సృష్టించిన ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించి, అప్పటివరకు ఐదవ స్థానంలో ఉన్న బ్రిటన్‌ను వెనక్కు నెట్టి ఆ స్థానంలో నిలబడింది కనుక అది విజయంగా ఎన్డీఏ భావిస్తోంది. దేశంలో అదుపు తప్పిన ధరలు, నిరుద్యోగం, దిగుమతులలో వృద్ధి, ఎగుమతులలో క్షీణత, రూపాయి పతనం, తగ్గుతున్న విదేశీ పెట్టుబడులు... ఇన్ని సమస్యల నేపథ్యంలో దేశం ప్రపంచంలోనే 5వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందన్న విషయం విస్మరించరానిది. 

బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థను భారత్‌ దాటడం అన్నది నిజానికి ప్రస్తుత యూరప్‌ సంక్షోభ పరిస్థితులలో గొప్ప విజయమేమీ కాదు. బ్రిటన్‌లో చాలాకాలంగా ద్రవ్యోల్బణం రెండంకెలు దాటింది. బ్రిటన్‌లోని అన్ని వర్గాల ఉద్యోగులు, ముఖ్యంగా రైల్వే కార్మికులు, రేవు కార్మికులు, పోస్టల్‌ కార్మికులు అధిక వేతనాలను డిమాండ్‌ చేస్తూ సమ్మె బాట పట్టారు. తమ కొనుగోలు శక్తి గణనీయంగా పడిపోయిన దృష్ట్యా వేతనాలు పెంచాలని వారు కోరుతున్నారు. ఉపాధ్యాయులు, బ్యాంకు ఉద్యోగులు, చివరకు వైట్‌ కాలర్‌ ఉద్యోగులుగా పేర్కొనదగ్గ ఉన్నత స్థాయి ఉద్యోగులు కూడా సమ్మెబాట పట్టడంతో ఇది వరకు ఎన్నడూలేని రీతిలో బ్రిటన్‌ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఒక్క బ్రిటన్‌ లోనే కాదు.. స్పెయిన్, జర్మనీ, బెల్జియం తదితర సంపన్న యూరోపియన్‌ దేశాలలో పరిస్థితులు ఏమంత మెరుగ్గా లేవు. జర్మనీలో ఇటీవల పైలెట్లు సమ్మె చేయడంతో వంద లాది విమానాల రాకపోకలు నిలిచిపోయి, దేశ ఆర్థిక వ్యవస్థకు తీరని నష్టం కలిగింది.

భారతదేశంలో చాలాకాలం క్రితమే పలు కార్మిక చట్టాలను రద్దు చేశారు. లాభాలలో నడుస్తున్న పబ్లిక్‌ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నారు. అయినప్పటికీ ఇక్కడి కార్మికులు, రాజకీయ పార్టీలవారు ఏమీ చేయలేని నిస్సహా యస్థితిలో ఉన్నారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్‌ ధరలు అనూహ్యంగా పెరిగినా ప్రజలు మౌనంగానే భారాన్ని మోస్తున్నారు. నిర్మాణరంగంలో ఇసుక, స్టీలు, సిమెంటు ధరలు 40 శాతం కంటే మించి పెరిగాయి. ఇక జీఎస్టీని అత్యధికంగా దాదాపు అన్ని వస్తువులపై విధించడంతో పేద ప్రజలు సైతం ధరాఘాతానికి గురవుతున్నారు. కొన్ని రకాలైన ఎరువుల ధరలు 40 నుంచి 80 శాతం మేర పెరగడంతో రైతులపై అదనపు భారం పడింది.

దేశ ఆర్థికాభివృద్థి రేటును, స్థూల జాతీయోత్పత్తి పెరుగుదలను బ్రిటన్‌తో పోలుస్తున్న కేంద్ర ప్రభుత్వం... మానవాభివృద్ధి సూచికలలో మనం ఏ స్థానంలో ఉన్నామో ఎందుకు వెల్లడించడం లేదు? ఐక్యరాజ్యసమితి తాజాగా వెలువరించిన హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌ ఇండెక్స్‌లో భారత్‌ స్థానం 132 కాగా, బ్రిటన్‌ది 18వ స్థానం. ఐక్యరాజ్యసమితి వెల్లడించిన గణాంకాల ప్రకారం మన దేశంలో 22 శాతం ప్రజల సగటు ఆదాయం రోజుకు రూ. 160 మాత్రమే. దేశ జనాభాలో 27.9 శాతం మంది ఇంకా పేదరికంతో విలవిల లాడుతున్నారని తాజా సర్వే వెల్లడించింది. కొన్నేళ్లుగా దేశంలో ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. దేశంలోని 21.7 శాతం సంపద కేవలం ఒక శాతంగా ఉన్న బిలియనీర్ల చేతుల్లో ఉండగా, 19.8 శాతం సంపద మాత్రమే 40 శాతం మంది దేశ ప్రజల్లో ఉన్నట్లు సర్వేలో తేలింది. అసమానతలు అన్నవి ఆర్థికంగానే కాక ఇంకా లింగ (జెండర్‌) అసమానతలు, సామాజిక (సోషల్‌) అసమానతలు కూడా పెరుగుతున్నాయి. ఇవన్నీ నాణేనికి రెండో వైపు ఉన్న పార్శ్వం.

ఇక డాలర్‌తో రూపాయి విలువ క్షీణత ఇంత సుదీర్ఘంగా సాగడం దేశ చరిత్రలో ఎన్నడూ లేదు. ఇందుకు కారణం వాణిజ్యలోటు భారీగా పెరగడమే. గత సెప్టెంబర్‌లో 2020– 21 వాణిజ్యలోటు 11.7 బిలియన్ల డాలర్లు ఉండగా, ఈ ఆగస్ట్‌ 2022 నాటికి 28.7 బిలియన్ల డాలర్లకు చేరింది. అంటే లోటు వృద్ధిరేటు దాదాపు 250 శాతం. దిగుమతుల్లో వృద్ధి నానాటికీ పెరిగిపోతుండగా ఎగుమతుల వృద్ధిరేటులో క్షీణత నమోదవుతోంది. తాజా రాజకీయ కారణాలతో దేశం నుంచి ఎగుమతి అయ్యే బాస్మతియేతర, నాన్‌ పారాబాయిల్డ్‌ బియ్యంపై 20 శాతం ఎగుమతి సుంకం విధించడం ద్వారా బియ్యం ఎగుమతిని కేంద్రం నియంత్రించింది. మరోపక్క, ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న ప్రపంచంలోని పలు దేశాలు భారత్‌ నుంచి ద్విచక్రవాహనాలు, ఆటో మొబైల్‌ విడిభాగాలు మొదలైన వాటిని దిగుమతి చేసుకోవడం నిలిపివేశాయి. దీంతో ఎగుమతుల ద్వారా లభించే విదేశీ మారక ద్రవ్య ఆదాయం తగ్గింది. 

కేంద్రం అనుసరిస్తున్న ఆర్థిక విధానాల వల్ల కలుగుతున్న దుష్ఫలితాలేమిటన్నది నిజానికి ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన ‘ఆర్థిక సర్వే 2022’లోనే వెల్లడైంది. అధిక ధరల కారణంగా పేద, మధ్య తరగతి ప్రజల పొదుపు పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. ఒక్క ఏడాది కాలంలో, అంటే గత ఏడాదిలో ధనవంతులు 13 లక్షల కోట్ల సంపద ఆర్జించగా, 15 కోట్లమంది పేద, మధ్య తరగతి ప్రజల ఆదాయం 53 శాతం తగ్గిపోయినట్లు ఆర్థిక సర్వే వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం అంచనా వేసిన విధంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 8.5 శాతం ఆర్ధికాభివృద్ధి రేటు సాధించాలంటే జీడీపీలో 39 శాతం పెట్టుబడులు కీలక రంగాలలో పెట్టాలి. కానీ, ఈ రంగాలలో వస్తున్న ప్రైవేటు పెట్టుబడులు ఏ మాత్రం ఆశాజనకంగా లేవు.

ఇదిలా ఉండగా, గ్రామీణ ప్రాంత ప్రజలకు మేలు చేకూర్చే ‘మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం’కు కేటాయించే నిధులలో ప్రతి ఏటా కోత విధిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలకు అమలు చేస్తున్న వివిధ పథకాలలో కోత పడుతోంది. ఇదికాక, పేదలకు అందిస్తున్న గృహ నిర్మాణ పథకం మందగించింది. ఈ పరిణామాలన్నీ దేశంలోని పేదలు, దిగువ మధ్య తరగతి ప్రజల, రైతుల జీవనాన్ని దుర్భరం చేస్తున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ పైకి నిగనిగలాడుతున్నట్లు కనిపిస్తున్నా లోపల డొల్లమాదిరిగా ఉంది. మరోరకంగా చెప్పాలంటే దేశ ఆర్థిక వ్యవస్థ ‘కరి మింగిన వెలగపండు’లా ఉంది. 


- సి. రామచంద్రయ్య 
శాసన మండలి సభ్యులు, ఆంధ్రప్రదేశ్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌

మరిన్ని వార్తలు