వాణిజ్య బంధాన్ని పెనవేయగలరా?!

5 Nov, 2022 00:41 IST|Sakshi

విశ్లేషణ

భారతదేశంతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడం బ్రిటన్‌కు కూడా ప్రయోజనకరమే. అందుకే బ్రిటన్‌ కొత్త ప్రధాని రిషీ సునాక్‌ తన ప్రసంగంలో రెండు దేశాల మధ్య సంబంధాలను రెండు వైపుల నుంచి మరింతగా బలపరచవలసిన ఆవశ్యకత గురించి మాట్లాడారు. అయినప్పటికీ భారత్‌–యు.కె. వాణిజ్య సంబంధాలకు కీలకమైన ఎఫ్‌.టి.ఎ.పై శ్రద్ధ వహించడానికి ఆయనకు పరిస్థితులు అనుకూలిస్తాయా అన్నది సందేహమే. ఒకటి మాత్రం వాస్తవం. ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాల అంశానికి అధిక ప్రాధాన్యతనిస్తూ భారత్‌ సునాక్‌పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఆ ఆశలు నెరవేరతాయా లేదా అనేది... క్షీణిస్తున్న బ్రిటిష్‌ ఆర్థిక వ్యవస్థను సునాక్‌ దృక్పథం ఏ మేరకు మెరుగుపరుస్తుందన్న దానిపైనే ఆధారపడి ఉంటుంది.

భారతదేశంతో బ్రిటన్‌ ఆర్థిక సంబంధాలు   గొప్ప ముందడుగుకు సిద్ధంగా ఉన్న తరుణంలో ఆ దేశంలోని రాజకీయ గందరగోళం బ్రిటన్‌ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషీ సునాక్‌ రాకకు దారి తీయడం భారత్‌కు అనేక విధాలైన వాణిజ్య అనుకూలతల్ని తెచ్చిపెట్టే పరిణామమే. ఇరుదేశాల మధ్య ప్రతిపాదిత ‘స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం’ (ఎఫ్‌.టి.ఎ.) ఈ ఏడాది జనవరి నుంచీ చర్చల స్థాయిలోనే ఉంది. చర్చలు ఫలవంతమై, ఒప్పందం అమల్లోకి రావడం కోసం రెండు దేశాలు కూడా ఎంతో ఉత్సుకతతో నిరీక్షిస్తూ ఉన్నాయన్నది నిజం. 

బోరిస్‌ జాన్సన్‌ స్థానంలో లిజ్‌ ట్రస్‌ కొత్త ప్రధానిగా వచ్చి నప్పటికీ ఎఫ్‌.టి.ఎ.పై చర్చలు అంతరాయం లేకుండా కొనసాగాయి. ట్రస్‌ ప్రభుత్వం స్పల్పకాల వ్యవధిలోనే అయినా శీఘ్రంగా అను సరించిన వినాశకర విధానాల కారణంగా యు.కె. మరింతగా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవడంతో, యు.కె.ను గట్టెక్కించే మార్గాలను అన్వేషించడం సునాక్‌ ప్రథమ కర్తవ్యం అయింది. ప్రధానిగా సునాక్‌ తన ప్రసంగంలో రెండు దేశాల మధ్య సంబంధాలను రెండు వైపుల నుంచి మరింతగా బలపరచవలసిన ఆవశ్యకత గురించి మాట్లాడినప్పటికీ, భారత్‌–యు.కె. వాణిజ్య సంబంధాలకు కీలకమైన ఎఫ్‌.టి.ఎ.పై శ్రద్ధ వహించడానికి ఆయనకు పరిస్థితులు అనుకూలిస్తాయా అన్నది సందేహమే. 2023 వరకైనా ఈ ప్రతిపాదిత ఒప్పందం అప్రస్తుత అంశంగా మూలన పడే అవకాశముంది.

ఎఫ్‌.టి.ఎ. సంభవమయ్యేందుకు ఉన్న అవకాశాలు ప్రధానిగా ట్రస్‌ నిష్క్రమించడానికి ముందే సన్నగిల్లాయి. వీసాల గడువు ముగిసి పోయినా కూడా దేశంలోనే ఉండిపోయే అలవాటున్న భారతీయుల వలసలను ఈ ఒప్పందం సులభతరం చేస్తుందని ఆ దేశ విదేశాంగ మంత్రి సుయెల్లా బ్రేవెర్‌మాన్‌ అనడంతోనే చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు చర్చల వాతావరణాన్ని దెబ్బ తీశాయి. అయినప్పటికీ, గతవారం బ్రిటన్‌ రాజకీయ పరిస్థితులు నాటకీయంగా మారే వరకు కూడా ఎఫ్‌.టి.ఎ.ని ఖరారు పరచు కోవాలన్న దృఢ సంకల్పం ఇరువైపులా కనిపించింది. అసలు ఎందుకు ఈ ఒప్పందం విషయమై భారత్‌–బ్రిటన్‌ గట్టి పట్టుతో ఉన్నాయన్న ప్రశ్నకు తగిన సమాధానమే ఉంది. మొదట బ్రిటన్‌ వైపు నుంచి చూద్దాం.

ఐరోపా సమాఖ్య నుంచి ఆ దేశం బయటికి వచ్చేయడంతో సమాఖ్యలోని తక్కిన దేశాలతో ఉన్న అనుసంధాన వారధులను బ్రిటన్‌ తనకై తను కూల్చుకున్నట్లయింది. పర్యవసానమే... ఒక ప్రధాన ఆర్థిక వ్యవస్థతో బ్రిటన్‌ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోక తప్పని పరిస్థితి రావడం. ఆ సమయంలో భారత్‌ కంటే ముందుగా అమెరికా తన వాణిజ్య భాగస్వామిగా బ్రిటన్‌తో చేతులు కలుపుతుందనే అంతా భావించారు. అయితే అందుకు విరుద్ధంగా ఎఫ్‌.టి.ఎ.పై చర్చలు జరపడానికి ప్రస్తుతం తనకు ఆసక్తి లేదని అమెరికా స్పష్టం చేసింది. 

భారతదేశంతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడం బ్రిటన్‌కు అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఒకటి, భారత్‌ ఇప్పుడు ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవత రించింది. మొన్నటి వరకు యు.కె. ఉన్న ఐదవ స్థానంతో సమానమైన స్థాయి ఇది. కనుక బ్రిటిష్‌ పరిశ్రమలకు భారత్‌ భారీ మార్కెట్‌ను చూపిస్తుంది. రెండవది... విస్కీ, స్పిరిట్స్‌ వంటి బ్రిటన్‌కు మాత్రమే పరిమితమైన మేలిమి ఉత్పత్తులపై ఉండే భారీ దిగుమతి సుంకాలు తగ్గించడం ద్వారా వాటి మార్కెట్‌ను మెరుగుపరుస్తుంది. ప్రతి ఫలంగా భారత్‌ వృత్తిపరమైన నైపుణ్యం కలిగిన కార్మికులకు సుల భంగా వీసాలు వచ్చేలా బ్రిటన్‌కు డిమాండ్‌లు పెట్టవచ్చు.

అలాంటి సౌలభ్యం వీసాల జారీ విధి విధానాల్లో లేనప్పటికీ, వాణిజ్య వ్యాపా రాలకు అవసరమైన చలనశీలత ఆ మేరకు వెసులుబాట్లను కల్పించే అవకాశం ఉంటుందని అనుకోవచ్చు. ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్‌ వైదొలగనంత వరకు కూడా పొరుగున ఉన్న ఐరోపా దేశాలతో వీసా అడ్డంకుల సమస్య ఉండేది కాదు కనుక ఆ దేశాల నుంచి ప్రవాహంలా వచ్చే వారి వల్ల బ్రిటన్‌కు నైపుణ్యం కలిగిన కార్మికుల అవసరం తీరేది. ఇప్పుడీ ఎఫ్‌.టి.ఎ. కుదిరితే వృత్తిపరమైన కార్మికుల డిమాండ్‌లో కొంత భాగం భారతదేశం నుండి తీరవచ్చు. సరిగ్గా ఈ అంశం దగ్గరే వలసల సమస్యలపై సునాక్‌ మంత్రివర్గంలోని బ్రేవర్‌మాన్‌ చేసిన వ్యాఖ్యలు చర్చలు నిలిచిపోవడానికి కారణం అయ్యాయి. 

కీలక మార్కెట్లలో తక్కువ సుంకాల పరంగా ఎగుమతిదారులకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉన్నందున, ఎఫ్‌.టి.ఎ.ను ఖాయం చేసుకునేందుకు భారతదేశం కూడా సమానమైన ఆత్రుతతో ఉంది. అదే సమయంలో చైనా నుండి తృతీయ దేశాల ద్వారా ప్రవేశించే చౌక దిగుమతులను నివారించే ప్రయత్నంలో అతిపెద్ద బహుపాక్షిక సమూ హమైన ‘ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం’ (ఆర్‌.సి.ఇ.పి.) నుండి దూరంగా ఉండి, సభ్య దేశాలకు అందుబాటులో ఉన్న ప్రాధాన్యతా సుంకాలను భారత్‌ కోల్పోయింది. ఈ వైకల్యాన్ని అధిగ మించడానికి, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవడం కోసం భారత్‌ ప్రయత్నిస్తోంది. అందువల్లే బ్రిటన్‌తో వాణిజ్య ఒప్పందం అన్నది అత్యంత సంభావ్యత కలిగిన ఒక ముందడుగుగా పరిగణన పొందుతోంది. 

ఇరుపక్షాలకు కూడా ప్రతిష్టాత్మకమైనదిగా ప్రాముఖ్యతను సంతరించుకున్నందునే ఈ భారత్‌–యు.కె. వాణిజ్య ఒప్పందం నిలిచి పోవడం నిరుత్సాహానికి కారణం అయింది. అంతేకాకుండా, రెండు దేశాల మధ్య వలసవాద యుగం నాటి నుండి ప్రత్యేకమైన సంబం ధాలు ఉన్నాయనే వాస్తవం విస్మరించలేనిది. స్వాతంత్య్రం వచ్చే నాటికి భారతదేశాన్ని బ్రిటన్‌ కడు పేదరికంలో వదిలి వెళ్లిందనే వాస్తవం ఆగ్రహం తెప్పించేదే అయినప్పటికీ, ఏళ్ల క్రమంలో సంభ వించిన రెండు దేశాల సంబంధాలలోని పరిణతి ఒకదానితో ఒకటి సమస్థాయికి చేరేందుకు దోహదపడింది. అందుకు ఒక కారణం ఏమిటంటే, ఆ దేశంలో ప్రవాస భారతీయుల అత్యంత ప్రభావవంత మైన పాత్ర. ఇప్పుడికైతే భారతీయ సంతతికి చెందిన వ్యక్తి ప్రధాన మంత్రి కావడం రెండు దేశాల అభివృద్ధిలో ఒక స్పష్టమైన మైలు రాయి.

అంతేకాకుండా, యు.కె.లో ప్రస్తుతం భారత్‌ రెండవ అతిపెద్ద విదేశీ పెట్టుబడిదారుగా ఉన్నదన్న వాస్తవం రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు దృఢతరం చేయగలిగినంత శక్తి గలది. బ్రిటన్‌లో 850 భారతీయ కంపెనీలు పనిచేస్తుండగా, భారత్‌లో 600 బ్రిటిష్‌ కంపె నీలు ఉండటం ఇందుకొక నిదర్శనం. భారతదేశంలో బయటి నుంచి పెట్టుబడులు పెట్టే ఆరవ అతిపెద్ద మదుపుదారు బ్రిటన్‌.  

భారత్‌–యు.కె. ఆర్థిక సంబంధాల భవిష్యత్తు పూర్తిగా కొత్త ప్రధానమంత్రి అనుసరించే దిశపైనే ఆధారపడి ఉంది. ఇరుదేశాల సంబంధాలను మరింత గాఢపరిచేందుకు సునాక్‌ స్పష్టమైన ఆసక్తి చూపుతున్నప్పటికీ, వీసా సమస్యలను సడలించడం అంటే, వలసలను ప్రోత్సహించడంతో సమానమని భావించే బ్రేవర్‌మాన్‌ వంటివారు ఆయన ప్రయత్నాలకు అవరోధం కావొచ్చు. ఈ నేపథ్యంలో.. ఆయన సుంకాలను తగ్గించడం, వీసా నియంత్రణలను సడలించడం వంటి చర్యల ద్వారా యు.కె.కి ఒనగూడే ఆర్థిక ప్రయోజనాల గురించి గట్టిగా చెప్పగలరా అన్నది రాబోయే కొద్ది నెలల్లో తేలిపోవచ్చు.

ఈ క్లిష్ట స్థితి నుంచి ఇండియా నేర్చుకోవలసిన పెద్ద పాఠం ఏమిటంటే.. మరిన్ని ప్రాంతీయ, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలను ఖరారు చేసుకోడానికి తన ప్రయత్నాలను వేగవంతం చేయడం. ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలను మరింతగా బలోపేతం చేసుకునే అంశానికి అధిక ప్రాధాన్యతనిస్తూ భారత్‌ కొత్త యు.కె. ప్రధానిపై ఆశలు పెట్టుకుందనడంలో సందేహం లేదు. అయితే ఆ ఆశలు నెర వేరతాయా లేదా అనేది మాత్రం.. క్షీణిస్తున్న బ్రిటిష్‌ ఆర్థిక వ్యవస్థను రిషి సునాక్‌ దృక్పథం ఏ మేరకు మెరుగుపరుస్తుందన్న దానిపైనే ఆధారపడి ఉంటుంది.
సుష్మా రామచంద్రన్‌
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌
(‘ది ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో)

మరిన్ని వార్తలు