BC Census: బీసీ జన గణనతోనే న్యాయం

30 Dec, 2022 12:04 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

అభిప్రాయం

జనాభా కులాలుగా విడగొట్ట బడిన దేశం మనది. ఆధిపత్య కులాలు దేశంలోని భూమి, ఇతర వనరులు; విద్య, ఉద్యోగ అవకాశాలను అధికంగా అను భవిస్తున్నాయి. సంపద వారి చేతుల్లో ఉన్నందు వల్ల చదువు కోగలరు కాబట్టి... ఉద్యోగావకాశాలూ సహజంగా వారికే అధికంగా లభిస్తాయి. అయితే దేశంలో సంఖ్యాపరంగా వీరి సంఖ్య తక్కువ. బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల జనాభా అధికంగా ఉంది. రాజ్యాంగం అందరికీ సమాన అవ కాశాలు వాగ్దానం చేసింది. అవకాశాల్లో సమాన భాగం కాకపోయినా... కనీస భాగం పొందాలంటే రిజర్వేషన్లు ఒక్కటే మార్గమని రాజ్యాంగ సభ భావించి రాజ్యాం గంలో అందుకు తగిన ఏర్పాటు చేసింది. 

అయితే ఇటీవల కాలంలో కొత్త కులాలనూ, వర్గాలనూ రిజర్వేషన్‌ వర్గాల్లో కలపడంతో రిజర్వేషన్‌ వర్గాల వారికి అవకాశాలు పలుచబడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కులాల జన గణన జరిగితే ఎవరి దామాషా ప్రకారం వారు అవకాశాలను పొందవచ్చుగదా అనే ఆలోచన బయలుదేరింది. ముఖ్యంగా వందలు, వేలా దిగా ఉన్న బీసీ కులాలు ఈ డిమాండ్‌ను బలంగా విని పిస్తున్నాయి. ఇలా కుల గణన జరిగితే ఒనగూరే ఇతర ప్రయోజనాలనూ వారు పేర్కొంటున్నారు. వెనుక బడిన మెజార్టీ ప్రజల సంక్షేమానికి తగిన పథకాల రూపకల్పనకు ఈ డేటా చాలా అవసరం. విద్య, ఉద్యోగ రంగాల్లో ఎవరి వాటా వారు పొందడానికి వీలు కలుగుతుంది. ఇప్పటివరకు రిజర్వేషన్‌ ఫలాలు అందని ఎన్నో వందల కులాలను వెలుగులోకి తీసుకురావచ్చు. ఫలితంగా అత్యధిక పేదలు ఉన్న బీసీల్లో తమ వాటా తమకు లభిస్తుందన్న సాంత్వన లభిస్తుంది. ఎవరి వాటా వారికి లభిస్తే సామాజిక అశాంతి తగ్గి శాంతి భద్రతలు మెరుగవుతాయి. ప్రభుత్వం తన దృష్టిని అభివృద్ధి కార్యక్రమాలపై నిలపడానికి అవకాశం ఏర్పడుతుంది. కులగణనపై సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం... కులాల వారీగా వెనుకబడిన తరగతుల జనగణన చేపట్టడం పాలనపరంగా కష్టమని తెలిపింది. దీంతో బీసీలు బాగా అసంతృప్తికి లోనయ్యారు.

1931 కులగణన తర్వాత బీసీ జనగణన జరగలేదు. అయితే 1979లో జనతా ప్రభుత్వం బీపీ మండల్‌ సారథ్యంలో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులవారిని గుర్తించి వారి అభివృద్ధికి సిఫార్సులు చేయమని ఒక కమిటీని నియమించింది. ఈ మండల్‌ కమిషన్‌ 1980లో సమర్పించిన నివే దికలో భారత్‌ మొత్తం జనాభాలో 52 శాతం వెనుక బడిన తరగతులవారేననీ, వారికి 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలనీ సిఫార్సు చేసింది. బీసీల సమగ్ర అభివృద్ధి కోసం అనేక సిఫార్సులు చేసినా అవన్నీ అటకెక్కాయి. 27 శాతం రిజర్వేషన్లు మాత్రమే అత్యంత దారుణ వ్యతిరేక పరిస్థితుల్లో అమలులోకి వచ్చాయి.

నిజానికి ఇప్పుడు బీసీల జనాభా మరింతగా పెరిగి ఉండాలి. వారూ వీరూ చెప్పే లెక్కలన్నీ కాకి లెక్కలే. ఒక్కసారి కుల గణన జరిపితే అభివృద్ధి ఫలాల్లో ఎవరి వాటా వారు అడగడానికి వీలు ఉంటుంది. సామాజిక న్యాయం సాకారమవుతుంది. (చదవండి: కులాంతర వివాహాలు శాస్త్రబద్ధమే)


- డాక్టర్‌ పరికిపండ్ల అశోక్‌ 
సామాజిక కార్యకర్త

మరిన్ని వార్తలు