Russia Ukraine War: మొబైల్‌ ఫోన్లు కొంప ముంచుతున్నాయి!

14 May, 2022 14:08 IST|Sakshi

యుద్ధంలో బాంబులు వేసుకోవడం మామూలే. ఆ బాంబులు ఎక్కడ వేయాలో నిర్ణయించడానికి రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధంలో సెల్‌ఫోన్‌ లను వాడుతున్నారంటే ఎవరికీ వింతగా తోచడం లేదు. అవి అధునాతనమయిన స్మార్ట్‌ ఫోన్‌లయినా; కేవలం కాల్స్, మెసేజ్‌లు మాత్రమే పంపగల సింపుల్‌ ఫోన్‌లయినా సైనికులందరికీ అందుబాటులో ఉండి సాయం చేస్తున్నాయి. ఇరుపక్షాల వారు ఎదుటివారి కదలికలను, స్థావరాలను గుర్తించడానికి ఈ ఫోన్‌లు సాయపడుతున్నాయి.

మొబైల్‌ ఫోన్‌లు అన్నీ దగ్గరలోని కమ్యూనికేషన్‌ టవర్‌కు సంకేతాలు పంపుతుంటాయి. వాటి ఆధారంగానే కాల్స్, మెసేజెస్‌ వీలవుతాయి. ఈ మధ్యన ఈ సంకేతాల ఆధారంగా నేరస్థులను, ఇతరులను అనుసరించి ఆరా తీయడం మామూలయింది. మూడు టవర్ల నుంచి సంకేతాలను ‘ట్రయాంగులేషన్‌’ అనే పద్ధతిలో విశ్లేషిస్తే, వాటిని పంపిన ఫోన్‌ ఉన్న స్థలం తెలిసిపోతుంది. దీంతో  రష్యా–ఉక్రెయిన్‌ సైన్యాలు దీన్ని అనువుగా వాడుకుని శత్రుపక్షం ఆచూకీ సులభంగా తెలుసుకుంటున్నాయి. ‘ఇదేదో, ఇదుగో నేను నీ లక్ష్యాన్ని’ అని వీపు మీద బొమ్మ గీసుకుని తిరుగుతున్నట్లయిందని అంటారు యూకేలోని సర్రె విశ్వవిద్యాలయం పరిశోధకులు అలన్‌ వుడ్‌వర్డ్‌.

ఇక రష్యావారు ఒక అడుగు ముందుకు వేసి ‘లియత్‌–3’ అనే సిస్టమ్‌ను తయారు చేశారు. ఇందులో మొబైల్‌ ఫోన్‌ టవర్స్‌లాగ పనిచేసే డ్రోన్స్‌ ఉంటాయి. అవి ఆరు కిలో మీటర్ల పరిధిలోనున్న సుమారు రెండు వేలకు పైగా మొబైల్‌ ఫోన్‌ల ఆచూకీ తెలుసుకునే శక్తి గలవి. ఈ రకంగా అధికారులను అనుసరించి మట్టుబెట్టిన సందర్భాల గురించి ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ పత్రికలో వివరంగా రాశారు.

ఇంటెలిజెన్స్, సర్వైలెన్స్, టార్గెట్‌ అక్విజేషన్, రీకన్నాయిజాన్స్‌ అంటే కంప్యూటర్‌ వాడకం సాయంగా గమ్యాలను గుర్తించే ‘ఇస్తార్‌’ సిస్టమ్‌లు ప్రస్తుతం అందరికీ అందుబాటులో ఉన్నాయి. కనుక క్షణాల్లో గమ్యాలను తెలుసుకుని మిసైల్స్‌ ప్రయోగించే వీలు కలుగుతున్నది. (క్లిక్: యుద్ధ నివారణే పాలకుల కర్తవ్యం!)

ఇక స్మార్ట్‌ ఫోన్‌లలో ‘జీపీఎస్‌’ అనే గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్‌ ఉంటుంది. అది సులభంగా ఎదుటివారికి అందరి స్థావరాల ఉనికినీ అందజేస్తుంది. అన్నింటికీ మించి యుద్ధరంగంలోని సైనికులను భయానికి గురిచేసే, సందేశాలు కూడా మొబైల్‌ ఫోన్‌లలో వస్తున్నాయి అంటారు ‘కోపెన్‌ హేగెన్‌ యూనివర్సిటీ’ పరిశోధకులు గొలోవ్‌షెంకో. మీవాడు చనిపోయాడంటూ తప్పుడు సమాచారాన్ని అందించిన సందర్భాలను ఆయన గుర్తు చేస్తున్నారు. ఈ బాధలు రెండు పక్షాల వారికీ తప్పడం లేదు. (క్లిక్: అందుకే రష్యాను సమర్థించక తప్పదు)

బాల్టిక్‌ స్టేట్స్‌లోనూ, అఫ్గానిస్తాన్‌లో కూడా ఈ రకం పద్ధతులను వాడి సైనికులను మానసికంగా వ్యథకు గురిచేసిన సందర్భాలను గురించి గొలోన్‌షెంకో వంటి పరిశోధకులు గుర్తు చేస్తున్నారు. రష్యా సైన్యం ఏప్రిల్‌ మొదటి తేదీన సుమారు 5 వేలమంది ఉక్రెయిన్, సైన్యాధికారులు, రక్షణ సిబ్బందికి మెసేజీలు పంపినట్టు సమాచారం. తాము కూడా ఇటువంటి సందేశాలు పంపుతున్నట్టు ఉక్రెయిన్‌ ఇంటీరియర్‌ అఫెయిర్స్‌ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఫోన్‌ వాడుతున్న ప్రతి సైనికుడూ ఒక డేటా పాయింట్‌గా నిలచి, తమ గురించి సమాచారం వెదజల్లుతున్నట్లే లెక్క. అది సైనికులకు ప్రాణాపాయం కలిగిస్తున్నది.

- డాక్టర్‌ కె.బి. గోపాలం
రచయిత, అనువాదకులు

మరిన్ని వార్తలు