PDP Bill: ‘గోప్యత’ బిల్లు మళ్లెప్పుడో!

5 Aug, 2022 13:02 IST|Sakshi

దేశంలోని పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నుంచి పరిరక్షించడమే లక్ష్యంగా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన వ్యక్తిగత సమాచార పరిరక్షణ (పీడీపీ) బిల్లును కేంద్రం ఉపసంహరించుకుంది. 2019 డిసెంబర్‌ 11న లోక్‌సభలో ప్రవేశపెట్టిన బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) పరిశీలనకు పంపారు. ఏళ్ల తరబడి సాగిన తర్జనభర్జనల అనంతరం జేపీసీ 81 సవరణలు ప్రతిపాదించింది. దీంతో కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ కొత్త బిల్లును మళ్లీ ప్రవేశపెడతామనీ, ప్రస్తుతానికి ఉపసంహరించుకుంటున్నామనీ ప్రకటించింది.

గోప్యత హక్కు ప్రాథమిక హక్కు అని 2017 ఆగస్టులో సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఆ తర్వాత రెండేళ్లకు ఈ బిల్లుకు కేంద్రం రూపకల్పన చేసింది. ఇది పౌరుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందని విపక్షాలు ఆరోపించాయి. ఇందుకు కారణం కేంద్ర దర్యాప్తు సంస్థలు, నిఘా ఏజెన్సీలకు ఈ చట్టం నుంచి పలు మినహాయింపులు లభించడమే. (క్లిక్‌:  పై కోర్టుల్లోనూ రిజర్వేషన్లు ఉండాలి)

ప్రజల వ్యక్తిగత సమాచారానికి గోప్యత కల్పించడం, ఓ ప్రాధికార సంస్థ ద్వారా రక్షణ కల్పించడం ఈ బిల్లు ఉద్దేశం. కానీ జాతీయ ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశాలు – జాతీయ భద్రత, శాంతి భద్రతలు, దేశ సార్వభౌమత్వం, సమగ్రతకు సంబంధించిన అంశాల్లో కేంద్ర ప్రభుత్వం తమ దర్యాప్తు సంస్థలకు ఈ చట్టం పరిధి నుంచి మినహాయింపు ఇస్తోంది. అయితే జేపీసీ వివిధ రంగాల నిపుణులు, భాగస్వామ్య సంస్థలతో చర్చించి బిల్లులో అనేక మార్పుచేర్పులు సూచించడంతో... ప్రభుత్వం తాత్కాలికంగా బిల్లును వెనక్కి తీసుకుంది. 

 – డా. ఎం. సురేష్‌ బాబు, ప్రజా సైన్సు వేదిక అధ్యక్షులు

మరిన్ని వార్తలు