Chandra Pulla Reddy: పీడితుల బాంధవుడు

19 Jan, 2022 12:45 IST|Sakshi
చండ్ర పుల్లారెడ్డి

అణగారిన కులాలపై పెత్తందార్ల అణచివేత పోకడలను ధిక్కరించిన అరుణపతాక చండ్ర పుల్లారెడ్డి. 1917 జనవరి 19న కర్నూలు జిల్లాలో జన్మించారు. ఇంజనీరింగ్‌ చదువు కోసం చెన్నై వెళ్ళిన పుల్లారెడ్డి కమ్యూ నిస్టు దిగ్గజం పుచ్చలపల్లి సుందరయ్యతో పరిచయం ఏర్పడటంతో కమ్యూనిస్ట్‌ భావజాలానికి ఆకర్షితులయ్యారు. ఆ రోజుల్లో తెలంగాణలో ఉధృతంగా సాగుతున్న సాయుధ పోరాటంలో పాల్గొనేందుకు వెళుతుండగా నిర్బంధానికి గురయ్యారు. జైల్లో ఉన్నపుడు సాయుధ పోరాటాన్ని విరమించాలన్న పార్టీ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. (చదవండి: సమసమాజ విప్లవ తపస్వి.. జ్వాలాముఖి)

1952 ఎన్నికల్లో కర్నూలు జిల్లా నంది కొట్కూరు అంసెంబ్లీ నియోజకవర్గం నుండి కమ్యూనిస్ట్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలు పొందారు. 1964లో పార్టీ చీలిక సందర్భంలో పుచ్చలపల్లి సుందరయ్య నాయకత్వంలో మార్క్సిస్టు పార్టీలో చేరారు. ఇండో–చైనా యుద్ధ సమయంలో చైనాకు అనుకూలంగా మాట్లాడారని నాటి ప్రభుత్వం ఆయనను నిర్బంధించింది. తర్వాత బెంగాల్లో చారు మజుందార్‌ ప్రభావంతో సాయుధ పోరాటం వైపు మళ్లారు. ఆయన రాసిన ‘వీర తెలంగాణ విప్లవ పోరాటాలు–పర్య వసానాలు’ కార్యకర్తలను ఎంతో చైతన్యపరచింది. (చదవండి: సైన్సును మతం నుంచి వేరుచేసిన శాస్త్రవేత్త)

1970లో అంటరాని తనం తీవ్రంగా ఉన్నపుడు... అదిలాబాద్, కరీంనగర్‌ జిల్లాలలో దళితుల పక్షాన అగ్రవర్ణాలు భూస్వాములతో రాజీలేని పోరాటం చేశారు. దళితులు చెప్పులు వేసుకోరాదని, 2 గ్లాసుల పద్ధతిని విధించిన భూస్వాముల ఆంక్షలను నిరసించారు. దీంతో ప్రభుత్వం వెట్టిచాకిరీని రద్దు చేస్తూ, చట్టాన్ని తెచ్చింది. నిరంతరం సమరశీల ఉద్యమాలను నిర్మిస్తూ, పీడిత వర్గాల కోసం తుదిశ్వాస వరకు పోరాడిన ఈ అరుణ పతాక 1984 నవంబర్‌ 9వ తేదీన అజ్ఞాతంలో తనువు చాలించారు.  (చదవండి: పారిశ్రామిక విప్లవానికి పునాది)

– డా. ఎస్‌ బాబూరావు, సీనియర్‌ జర్నలిస్ట్, కావలి

మరిన్ని వార్తలు