పసిరిక క్రీనీడల్లో పంచమవేదం

29 Sep, 2020 07:59 IST|Sakshi

సందర్భం

మూడుసార్లు ముఖ్యమంత్రిగా పాలించి దళిత సామాజిక వర్గంలో కొంచెం కూడా నమ్మకాన్ని నింపలేకపోయిన పాలకుడు నారా చంద్రబాబు. ఆయనే నేడు ఆ సామాజిక వర్గం మీద అత్యాచారాలు జరిగిపోతున్నాయని యుద్ధప్రాతిపదికన శంఖారావం పూరించడం విడ్డూరం. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా సాగుతున్న  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వం మీద నిందలు వేయడం హాస్యాస్పదం. తెలుగుదేశం పాలనలో దళితులు ఎదుర్కొన్న అవమానాల చరిత్రను ఎవరూ మరిచిపోలేదు. 1985 జూలై 17న జరిగిన కారంచేడు నరమేధం తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళలోనే చోటుచేసుకుంది. ఆ గాయాలు మానకముందే 1986 జూలై 16న మంగళగిరి పట్టణానికి సమీపంలోగల నీరుకొండలో దళితులను వేటాడారు. ఒక దళిత వృద్ధుడ్ని తన ఇంట్లోనే హత్యచేసి, 30 మందిని పొలాల్లో క్షతగాత్రుల్ని చేశారు.

జనవరి 17, 1990న ప్రకాశం జిల్లా తిమ్మసముద్రంలో భూపంపిణీకి సంబంధించిన విషయమై అప్పటి తెలుగుదేశం నాయకులే దళితుల మీద బాంబులతో దాడి చేయించారనే అభియోగాల్ని ఎదుర్కొన్నారు. సుమారు ఏడువందల దళిత కుటుంబాలు పొరుగు ఊర్లకు పారి పోయి తలదాచుకోవలసి వచ్చింది. 1998 జూలై 16న కర్నూలు జిల్లా వేంపెంటలో దళితులపై దాడి జరిగింది. ఇది ఆధిపత్య కులాలు, అణగారిన కులాల మధ్య చోటుచేసుకున్న ఘటన అయినా నక్సలైటు గ్రూపుల మధ్య దాడిగా ప్రచారం చేయించారు. బాధితులు న్యాయంకోసం హైదరాబాద్‌ వెళ్ళి అప్పటి సీఎం బాబును కలిశారు. ‘నక్సలైటు శక్తులతో సంబంధంలేని దళితులుగా రండి, బయటకు పొండి’ అని ఆగ్రహంతో అవమానపరచి వారిని బయటకు పంపిం చారు. కర్నూలు జిల్లా ప్యాపిలిలో 2003 సెప్టెంబర్‌లో దళితులపై దాడులు జరిగాయి. దళితులు తమ వినాయక విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకువెళ్లే సమయంలో చోటుచేసుకున్న ఘటన ఇది. దళితులకు రక్షణ కల్పిం చడంలో బాబు ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది.
 
తదనంతరకాలంలో ‘ఎస్సీ వర్గీకరణ’ను తెర మీదకు తీసుకొచ్చారు చంద్రబాబు. అన్యాయానికి గురవుతున్న ఉపకులాలేవైనావుంటే వారికి న్యాయం జరగవలసిన అవసరం వుంది. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఉద్యమాన్ని తన రాజకీయ మనుగడకు వాడుకున్నది మాత్రం పచ్చనాయకుడే. ఇక ఇంగ్లిష్‌ మీడియం విషయంలో పరోక్షంగా బురదజల్లే ప్రయత్నం చేశారు. ఉన్నతవిద్యను గ్రామాలకు, పేదలకు చేరువ చేయాలని వైఎస్‌ రాజశేఖరరెడ్డి జిల్లాకో విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తే వాటిని నిర్లక్ష్యం చేసి ప్రైవేటు విశ్వవిద్యాలయాల అభివృద్ధికి కంకణం కట్టుకున్నారు. సీనియర్‌ దళిత ఐఏఎస్‌ అధికారి విజయకుమార్‌ని కూడా ఆయన దుర్భాషలాడారు. రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఏ ప్రతిపక్ష నాయకుడు ఇలా ఒక దళిత కులానికి చెందిన ఐఏఎస్‌ అధికారిని అవమానపరచిన సందర్భం లేదు.

2017 జూలైలో పశ్చిమగోదావరి జిల్లా గరగపర్రులో అంబేడ్కర్‌ విగ్రహాన్ని తొలగించిన ఘటనపట్ల అప్పటి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిం చింది. ఘటన చోటు చేసుకున్న ప్రాంతంలో హుటాహుటిన జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించారు. బాధితుల కష్టాలు విన్న తర్వాత ప్రతి కుటుంబానికి లక్ష నష్టపరిహారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అవకాశవాద రాజకీయాలకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పూర్తిగా వ్యతిరేకమని గడిచిన ఎన్నికల్లోనూ కూడా ఆయన నిరూపించారు. టికెట్ల ఎంపికలోనూ, నియామకాల్లోనూ సమతుల్యతను పాటించి పార్టీ శ్రేణుల విశ్వాసాన్ని చూరగొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏ కులాలైతే రాజకీయంగా వెనుకబాటుకు గురయ్యాయో వారికి ప్రాధాన్యతనివ్వడంలో జగన్‌మోహన్‌రెడ్డి సమన్యాయాన్ని పాటించారు.

అందుకే ఆయన 2019 ఎన్నికలప్పుడు ఇడుపులపాయలో సీట్లు ప్రకటించే సమయంలో ప్రస్తుత బాపట్ల లోక్‌సభ సభ్యుడు నందిగాం సురేష్‌ను తన సరసన కూర్చోబెట్టుకొని అతనితో ఇరవై ఐదు మంది లోక్‌సభ అభ్యర్థుల జాబితాను వెల్లడింపజేశారు. ఇక్కడే ఆయన తన రాజకీయ పరిపక్వతను చాటుకున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం నందిగాం సురేష్‌ ‘నేను కూలికెళ్ళిన ప్రాంతానికి నన్ను ఎంపీని చేశారు’ అని భావోద్వేగంతో కన్నీటి పర్యంతమయ్యారు. నాయకుడిని నిండా నమ్మిన కార్యకర్తకు జాతీయస్థాయిలో సముచితస్థానం కల్పించిన అధినాయకులు అరుదు. ఇలాంటి చరిత్రను కూడా చిన్నవయస్సులోనే జగన్‌ మోహన్‌రెడ్డి నమోదు చేసుకోగలిగారు.

వ్యాసకర్త ఫ్యాకల్టీ, జర్నలిజం అండ్‌ మాస్‌కమ్యూనికేషన్‌ విభాగం, ఏయూ,
విశాఖపట్నం ‘ మొబైల్‌ : 93931 11740 

మరిన్ని వార్తలు