ప్రైవేట్‌పై చైనా కొరడా మతలబు?!

9 Oct, 2021 00:26 IST|Sakshi

విశ్లేషణ

మావో అనంతర పాలకులు కమ్యూనిస్టు పార్టీలో, ఆర్థిక కార్యకలాపాల్లో ప్రైవేట్‌ వాణిజ్యవేత్తలకు చోటు కల్పించడం, రాజ్యాంగాన్ని మార్చడంద్వారా చైనాను వృద్ధి బాట పట్టించారు. ప్రైవేట్‌ రంగాన్ని ప్రోత్సహించే ఆర్థిక విధానాలు చైనాను ఆర్థిక దిగ్గజంగా మార్చినప్పటికీ, పట్టణ–గ్రామీణ, తీరప్రాంత– మైదాన ప్రాంతాల మధ్య విభజనలు బాగా పెరిగాయి. గత మూడు దశాబ్దాలుగా చైనా సమాజంలో ఒక నయా సంపన్న వ్యవస్థ బలపడి కమ్యూనిస్టు పార్టీకి, దాని సిద్ధాంతానికి ప్రమాదకరంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రైవేట్‌ రంగాన్ని నియంత్రించడానికి చైనా అధ్యక్షుడు షీ జిన్‌ పింగ్‌ చేస్తున్న ప్రయత్నాలు సోషలిస్టు సిద్ధాంతానికి తిరిగి మళ్లడం, సమాజంలోని వ్యత్యాసాలను తగ్గించడం అనే లక్ష్యానికి అనుగుణంగా ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ, ఆర్థిక కొలమానాల్లో అత్యున్నత స్థానంలో ఉంటున్న చైనా ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ బలిష్టంగానే ఉంది తప్ప కుప్పగూలిపోయే స్థితిలో మాత్రం లేదు.

చైనా ఆర్థిక వ్యవస్థలో ఇటీవలి పరిణామాలు, ప్రత్యేకించి అలీబాబా గ్రూప్, ఎవెర్‌ గ్రాండే వంటి ప్రైవేట్‌ కంపెనీలు ఎదుర్కొన్న సమస్యలు... చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ త్రీ రెడ్‌ లైన్‌ పాలసీపై, ప్రైవేట్‌ రంగంపై ప్రభుత్వ వైఖరి, దాని ఉద్దేశాలపై ప్రశ్నల్ని లేవనెత్తుతున్నాయి. చైనా స్థూల దేశీయోత్పత్తిలో 60 శాతం, సాంకేతిక ఆవిష్కరణల్లో 70 శాతాన్ని ప్రైవేట్‌ రంగమే అందిస్తోంది. 1995లో ప్రైవేట్‌ రంగం చైనాలో 18 శాతం ఉద్యోగా లను కల్పించగా 2018లో అది 87 శాతానికి పెరిగింది. చైనా ఎగు మతులు ఇదే కాలానికి గాను 34 శాతం నుంచి 88 శాతానికి పెరి గాయి. పై ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ముందు చైనా ఆర్థిక వ్యవస్థ ఎలా నిర్మాణమైందో మనం అర్థం చేసుకోవడానికి అయిదు అంశాలను పరిశీలించాలి. 

మొదటిది: 1950లు, 60లలో మావో సేటుంగ్‌ పాలనలో నిఖా ర్సైన కమ్యూనిస్టు సైద్ధాంతిక పునాదిపై, అటు సోవియట్‌ సహాయం, ఇటు స్వావలంబనకు పిలుపివ్వడం అనే రెండింటి సమ్మేళనంతో, దేశంలో పారిశ్రామిక పునాదిని నిర్మించడంపై చైనా గట్టిగా కృషి చేసి మరీ విజయం సాధించింది. అయితే 1970లు, 80లలో డెంగ్‌ జియాంవో పింగ్‌ అంతర్జాతీయ సహకారంతో ఆర్థికాభివృద్ధిపై ఎక్కు వగా దృష్టిపెట్టారు. 1990లలో నాటి దేశాధ్యక్షుడు జియాంగ్‌ జెమిన్‌ సైద్ధాంతిక, ఆర్థిక రంగాల్లో సంస్కరణలతో చైనాను అత్యధిక వృద్ధి స్థాయికి తీసుకెళ్లారు. కమ్యూనిస్టు పార్టీలో, ఆర్థిక కార్యకలాపాల్లో ప్రైవేట్‌ వాణిజ్యవేత్తలకు చోటు కల్పించడం, ఈ మేరకు రాజ్యాం గంలో కూడా మార్పులు తీసుకోవడం ద్వారా చైనాను వృద్ధి బాట పట్టించారు. ప్రైవేట్‌ యాజమాన్యానికి పలు హక్కులు కల్పిస్తూ ఒక నిబంధనను చేర్చారు. ప్రైవేట్‌ వ్యాపారులు కమ్యూనిస్టు పార్టీ నియం త్రణలో పనిచేయాల్సి ఉందని, పార్టీ పాలనకు వారు బేషరతుగా లోబడి ఉండాలని షరతు కూడా విధించారు. 

రెండు: ఈ విధానాల ఫలితంగా, 1978 నుంచి 2003 నాటికి ఎగుమతుల పరిమాణం 28 రెట్లకు పెరిగింది. 1952 నుంచి 1978 కాలంలో ఎగుమతుల్లో సాధించిన రెండు రెట్ల వృద్ధితో పోలిస్తే ఇది భారీ స్థాయి వృద్ధి అని చెప్పాలి. 1978–2003 కాలంలో సంస్కరణలు అమలు చేసి, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని ఆకర్షించడానికి సుంకాలు, పన్నులు, వాణిజ్య ప్రోత్సాహకాలను ప్రతిపాదిస్తూ నాలుగు ప్రత్యేక ఆర్థిక మండళ్లను నెలకొల్పారు. ఎగుమతులను, అత్యున్నత టెక్నాల జీని దిగుమతి చేసుకోవడాన్ని ప్రోత్సహించడమే వీటి లక్ష్యం. దీంతో 1952లో చైనా జీడీపీలో పారిశ్రామిక రంగ వాటా 8 శాతం మాత్రమే ఉండగా, 2003 నాటికి 52 శాతానికి పెరిగింది. ప్రపంచ జీడీపీలో చైనా వాటా 1952లో 4.6 శాతం ఉండగా 2003 నాటికి 15 శాతానికి పెరిగింది. ఇక పారిశ్రామికోత్పత్తిలో విదేశీ మదుపు సంస్థల వాటా 1990లో 2.3 శాతం ఉండగా 2003 నాటికి అది 35.9 శాతానికి అమాంతంగా పెరిగిపోయింది.

మూడు: 2003 నుంచి 2013 వరకు ఒక దశాబ్ది కాలంలో చైనా వార్షిక వృద్ధి రేటు 10.3 శాతంగా నమోదైంది. 2007 నాటికి 14.2 శాతం నమోదుతో ప్రపంచంలోనే అత్యన్నత వృద్ధి రేటును చైనా సాధించింది. 2008–2019 దశాబ్దంలో ఆర్థిక మాంద్య కాలంలో చైనా సగటు వృద్ధి రేటు 7.99 శాతానికి నమోదైంది. ఇది ఆ దశాబ్దంలో ఏ దేశమూ సాధించినంత అధిక వృద్ధి రేటు. 2004లో చైనా వస్తుతయారీ రంగం 625 బిలియన్‌ డాలర్ల విలువను నమోదు చేయగా 2019 నాటికి అది 3,896 బిలియన్లకు అమాంతంగా పెరిగింది. ఈ అసాధా రణమైన వృద్ధిరేటు వల్ల చైనా 2011లోనే ప్రపంచ తయారీరంగ కార్ఖానాగా మారింది. ఆ నాటికి ప్రపంచ తయారీరంగ ఉత్పత్తిలో చైనా వాటా 28.4 శాతంగా నమోదైంది. 2010లో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చైనా ఆవిర్భవించింది.

నాలుగు: ఆర్థిక రంగ సంస్కరణలు ప్రైవేట్‌ భాగస్వామ్యానికి చోటు కల్పించినప్పటికీ, చైనా ప్రభుత్వరంగ సంస్థలు మొత్తం జీడీపీలో 23 నుంచి 27 శాతం వాటాను సాధించాయి. ఇవి పారి శ్రామిక రంగంలో 21 శాతం వాటాను కలిగి ఉండగా, నిర్మాణ రంగంలో 38.5 శాతం, హోల్‌సేల్, రిటైల్‌ రంగంలో 39 శాతం వాటాను, రవాణా, నిల్వ రంగంలో 77 శాతం వాటాను సాధించాయి. ఇక మొత్తం ద్రవ్యరంగంలో 88 శాతం, రియల్‌ ఎస్టేట్‌ కార్యకలాపాల్లో 24.6 శాతం ప్రభుత్వ రంగ సంస్థల ఆధిపత్యంలో ఉన్నాయి. 2000 సంవత్సరంలో ఫార్చ్యూన్‌ 500 జాబితాలో ప్రపంచ వ్యాప్తంగా 27 ప్రభుత్వ రంగ సంస్థలకు చోటు దక్కగా చైనా నుంచి 9 సంస్థలు స్థానం సంపాదించాయి. 2017 నాటికి ఈ జాబితాలో మొత్తం 102 ప్రభుత్వ రంగ సంస్థలకు గాను 77 సంస్థలు చైనాకు సంబంధించినవే ఉండటం గమనార్హం. 

చైనా ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులు 2017లో 22,310 బిలియన్‌ డాలర్లతో రికార్డు సృష్టించాయి. కాగా మొత్తం 7,676 బిలియన్‌ డాలర్ల కంటే ఎక్కువ విలువైన సరకులను అమ్మగలిగాయి. ప్రత్యేకించి బొగ్గు, ఇనుము పెద్దగా లేని లోహాలు, ఉక్కు, విద్యుత్తు, నిర్మాణ పరి శ్రమ వంటి రంగాల్లోకి చైనా భారీ పెట్టుబడులను తరలించింది. వీటిలో కొన్ని పరిశ్రమలను అధికోత్పత్తి సామర్థ్యతతో నిర్మించారు. చైనా 2000 సంవత్సరంలో ప్రపంచ వాణిజ్య సంస్థలో చేరింది. అప్పటినుంచి 2015 నాటికి 15 సంవత్సరాల వ్యవధిలో ఏటా 13 శాతం సగటు ఉత్పత్తి రేటుతో చైనా ఉక్కు ఉత్పత్తిని అతి భారీ స్థాయిలో కొనసాగించింది. ఒక్క ఉక్కు రంగంలోనే 2018లో 8.1 శాతం వృద్ధి రేటుతో 928 మిలియన్‌ టన్నుల ఉక్కు ఉత్పత్తిని, సిమెంట్‌ రంగంలో 895 మిలియన్‌ టన్నుల అధికోత్పత్తి సామర్థ్యాన్ని చైనా సాధించింది. ఇది ప్రపంచ అధికోత్పత్తి సామర్థ్యంలో 45 శాతా నికి ప్రాతినిధ్యం వహిస్తోంది.

అయిదు: చైనాలో బ్యాంకింగ్‌ వ్యవస్థ 2016 నాటికి యూరో పియన్‌ యూనియన్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థకంటే పెద్దదిగా మారింది. చైనా బ్యాంకుల సొంత ఆస్తుల విలువ 35 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ఇది చైనా జీడీపీకి 3 రెట్లు ఎక్కువ. 2001 నుంచి చైనా బ్యాంకులు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారీ స్థాయి మౌలిక వస తుల కల్పన ప్రాజెక్టుల నిర్మాణానికి రుణాలు అందించాయి. దీంతో అధికోత్పత్తి సామర్థ్యం కలిగిన చైనా ప్రత్యేక ఆర్థిక మండళ్లు నిర్మాణ రంగ సామగ్రిని ఈ దేశాలకు భారీగా పంపించగలిగాయి.

చైనా కమ్యూనిస్టు పార్టీ 2017లో నిర్వహించిన 19వ జాతీయ కాంగ్రెస్‌ సమావేశంలో మార్క్సిస్ట్‌ దృక్పథం, వైధానికం తోడుగా 2049 నాటికి చైనాను ఆధునిక సోషలిస్టు దేశంగా మలుద్దామని పిలుపు నిచ్చింది. ప్రైవేట్‌ రంగాన్ని ప్రోత్సహించే ఆర్థిక విధానాలు చైనాను ఆర్థిక దిగ్గజంగా మార్చినప్పటికీ, గత మూడు దశాబ్దాల్లో పట్టణ–గ్రామీణ, తీరప్రాంత–మైదాన ప్రాంతాల మధ్య విభజనలు పెరి గాయి. 2019 నాటికి ఈ విభజన భారీ స్థాయికి చేరుకుంది. తీర ప్రాంతాల్లో నివసించే ఒక శాతం జనాభా దేశ మొత్తం సంపదలో 13 శాతాన్ని అదుపులో ఉంచుకున్నది. దీంతో చైనా సమాజంలో ఒక నయా సంపన్న వ్యవస్థ బలపడి కమ్యూనిస్టు పార్టీకి, దాని సిద్ధాం తానికి ప్రమాదకరంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రైవేట్‌ రంగాన్ని నియంత్రించడానికి చైనా అధ్యక్షుడు షీ జిన్‌ పింగ్‌ చేస్తున్న ప్రయ త్నాలు సోషలిస్టు సిద్ధాంతానికి తిరిగి మళ్లడం, సమాజంలోని వ్యత్యా సాలను తగ్గించడం అనే లక్ష్యానికి అనుగుణంగా ఉన్నట్లు కనిపి స్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇప్పటివరకు చైనా ఆర్థిక వ్యవస్థ బలిష్టంగానే ఉంది తప్ప కుప్పగూలిపోయే స్థితితో అయితే లేదు.


డా. గద్దె ఓంప్రసాద్‌ 
వ్యాసకర్త అసోసియేట్‌ ప్రొఫెసర్‌
సిక్కిం సెంట్రల్‌ యూనివర్సిటీ ‘ మొబైల్‌: 79089 33741

మరిన్ని వార్తలు