తెలుగు కథా సింగం

26 Feb, 2021 01:21 IST|Sakshi
సింగమనేని నారాయణ

నివాళి 

నిలువుటద్దం సైజులో మహాప్రస్థానాన్ని, ఆ పుస్తకాల్ని ఏనుగుపై చెన్నపట్నంలో ఊరేగించా లని శ్రీశ్రీ కోరుకున్నాడు. పూర్వం వావిళ్ళ వారు ప్రచురించిన తెలుగు మహాభారతాన్ని ఆ విధంగా ఊరేగించారట. నిలువుటద్దం సైజు కాకపోయినా, ఏనుగుపై ఊరేగింపు లేకపో యినా, మహాప్రస్థానాన్ని జెయింట్‌ సైజులో ముద్రించాలని శ్రీశ్రీ ప్రింటర్స్‌ విశ్వేశ్వరరావు సంకల్పించి పని మొదలుపెట్టారు. విజయవా డలో మాటల సందర్భంలో ఈ విషయం చెప్పి, ఆ పుస్తకాన్ని సింగమనేని నారాయణతో ఆవిష్కరించాలని అన్నాడు. సింగమనేని రెండు నెలలుగా అనారోగ్యంతో పోరాటం చేస్తున్నాడు కదా అంటే, అనంతపురం వెళ్ళి ఆయన ఇంట్లోనే ఆ కార్యక్రమం పూర్తి చేద్దామ న్నాడు. గుంటూరు రాగానే సింగమనేనితో ఫోన్‌లో మాట్లాడాను. నేనూ వస్తున్నానంటే తిరుపతి నుండి కోట పురుషోత్తం, సాకం నాగరాజను కూడా పిలవమన్నాడు. తర్వాత రెండుసార్లు ఆయనే ఫోన్‌ చేసి ఎప్పుడొస్తారని అడిగాడు. కానీ ఆయనే మా కోసం ఆగలేదు.

శ్రీశ్రీ శత జయంతి సందర్భంగా 2010లో నా ఆధ్వర్యంలో గుంటూరులో అన్ని వామపక్ష రాజకీయ పక్షాల, ప్రజా సంఘాల ఐక్యతతో ఒక భారీ ఊరేగింపు, బహిరంగ సభ నిర్వ హించాం. ముఖ్య అతిథిగా ఎవర్ని పిలవాలనే చర్చవస్తే సింగమనేని కంటే అర్హతలున్న సాహితీవేత్త కనబడలేదు. తిరుపతిలో శ్రీశ్రీ కాంస్య విగ్రహం ఆవిష్కరించాలంటే కూడా వాళ్ళకూ ఆయన పేరే స్ఫురించింది. తెలుగు రాష్ట్రాల్లో శ్రీశ్రీపై సాధికారత ఎవరికుందంటే స్ఫురించే రెండు పేర్లు: సింగమనేని, సింగం పల్లి (అశోక్‌కుమార్‌). కాకుంటే సింగమనేని అనర్గళ వక్త.పంచెకట్టుపైన సి. నారాయణ రెడ్డి గేయానికి బొమ్మ గీయమని అడిగితే బాపు కచ్చితంగా ధవళవస్త్ర ధారణలో ఉండే సింగమ నేనిని వేసేవారు.

సింగమనేని నారాయణ గొప్ప కథకుడే కాదు, విమర్శకుడు కూడా. కథావరణం, సంభాషణ, మున్నుడి, పరిమితం, మధు రాంతక రాజారాం లాంటి విమర్శన గ్రం«థాలు రాశాడు. చాసో, కేతు, రారా వంటి వారిపై గొప్ప విమర్శనా వ్యాసాలు రాశాడు. ఆయన కథలు ‘నీకూ నాకూ మధ్య నిశీధి’, ‘జీవఫలం చేదునిజం’, ‘జూదం’, ‘అనంతం’, ‘సింగమ నేని కథలు’ సంపుటాలుగా వచ్చాయి. ఆయన రాసినవి మొత్తం నాలుగు డజన్లు దాటక పోయినా ‘జూదం’, ‘తరగతి గదిలో తల్లి’ రెండు చాలు ఆయన్ని సమకాలీన కథకుల్లో అగ్రశ్రేణికి చేర్చటానికి.

అనేకమంది ప్రముఖ రచయితల రచన లకు తను ముందుమాటలు రాసినా, తన రచనలకు మాత్రం సాధారణమైన స్నేహితుల చేత ముందుమాట రాయించుకున్న ‘పరిమి తుడు’. ఆయన కథని చదవటం ద్వారా పాఠ కుడు ఎంత ఆస్వాదిస్తాడో, వర్ధమాన రచ యిత కథ ఎలా రాయాలో అంత తెల్సు కుంటాడు. అనంతపురం జిల్లా కరువుని, నీళ్ళులేని సాగుని, ముఠాకక్షల స్వరూప స్వభావాల్ని ప్రపంచానికి చూపగలిగాడు. అనేక కథా సంకలనాలకు సంపాదక బాధ్యత వహించాడు. ప్రసిద్ధ సంస్థలకు కథల పోటీల న్యాయ నిర్ణేతగా వ్యవహరించాడు. తెలుగులో కథల కోసం ఒక స్కూలు నడపాలన్నా, ఒక అకాడమీ పెట్టాలన్నా దానికి ప్రిన్సిపాల్‌గా ఉండే యోగ్యత ఉన్న ఒకే ఒక్కడు సింగమ నేని.

రచన వేరు, వ్యక్తిగత జీవితం వేరు అనే సిద్ధాంతం ప్రబలంగానే వుంది. ప్రగతిశీల విప్లవ వాదాల్ని రచనల్లో ప్రవచిస్తూనే, ఒకనొక ప్రముఖుడు హస్తసాముద్రికాన్ని, జ్యోతి ష్యాన్ని నమ్ముతానన్నాడు. అంతకంటే ప్రము ఖుడైన మరో ప్రగతిశీలి దయ్యాల్ని, భూతాల్ని, పునర్జన్మల్ని నమ్ముతానన్నాడు. యజ్ఞోపవీ తాన్ని ధరిస్తూ విప్లవ ప్రవచనాల్ని చెప్పిన వారూ వున్నారు. ఈ కోవకు చెందక రచనా, రచయితా ఒకే కుదురు నుండి జనించినట్లు కన్పించే అరుదైన వ్యక్తుల్లో సింగమనేని ఒకరు. మార్క్సిస్టు ప్రాపంచిక దృక్పథం నుండే ప్రతి రచననూ ఆవిష్కరించిన నిబద్ధుడు. ఎప్పుడో చిన్న వయస్సులో పడిన తరిమెల నాగిరెడ్డి ప్రభావాన్ని చివరి క్షణం వరకు నిలుపుకొని, రచనల్లో సామాజిక ప్రయోజనాన్ని కాంక్షిం చటమే కాదు జీవితంలోనూ ఆ విలువల్ని నిలుపుకున్నాడు.

అనంతపురం వెళ్ళిన సాహితీవేత్తలు, స్నేహితులు ఆయన ఇంట ఆతిథ్యం అందు కోకుండా  రావటం అసాధ్యం. వారి శ్రీమతి గోవిందమ్మ ఆయనను మించిన అతిథేయ. మర్యాద, మంచి తనాల్ని కూడా భరించటం కష్టమైన పనే అని వాళ్లింట్లోనే అర్థమవుతుంది. అనంతపురం వెళ్ళిన ప్రతిసారీ ఒకటే ఫోన్లు. తినటానికి ఏమీ పెట్టమంటేనే వస్తాననే షర తుపై అంగీకారం కుదిరినా ఏనాడూ వాళ్ళు మాటపై నిలబడలేదు. సింగమనేని పూర్తిపేరు సింగమనేని నారాయణ చౌదరి. కులాన్ని స్ఫురింపజేసే ‘చౌదరి’ని తొలగించుకున్నాడు. అనంతపురం జిల్లా మారూరుబండ మీద పల్లెలో 26–6– 1943న జన్మించిన సింగమనేని 25–2– 2021న తన 78వ యేట కథను ఒంటరి చేసి వెళ్ళి పోయాడు. కానీ తెలుగు కథ ఉన్నంత కాలం ఉంటాడు.

రచయిత
చెరుకూరి సత్యనారాయణ, న్యాయవాది

మరిన్ని వార్తలు