దయలేని బడ్జెట్‌

5 Feb, 2023 04:26 IST|Sakshi

కేంద్ర బడ్జెట్‌లో పేదలకు, రైతులకు ఒరగబెట్టింది ఏమీ లేదు. గత బడ్జెట్‌లో దేశంలోని రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేస్తామని బీరాలు పలికింది. ఆ వాగ్దానాల్లో ఎన్ని నెరవేరాయో ఆర్థిక మంత్రి తెలపాల్సి ఉంది. ఇక, ఈసారి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 33 శాతం కోత విధించారు. యువతకు, రైతులకు, నిరుపేదలకు ప్రయోజనాలు కలిగించని క్రూరమైన బడ్జెట్‌ ఇది. 

బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి ఇది చివరి సంపూర్ణ బడ్జెట్‌. దీనిపై ప్రజలు చాలా ఎక్కువగానే ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వారి ఆశలపై నీళ్లు చల్లారు. ఒక్కమాటలో చెప్పాలంటే 2023–24 కేంద్ర బడ్జెట్‌... వంచనాత్మక బడ్జెట్‌గా మారిపోయింది. మన దేశ యువతకు, రైతులకు, కార్మికులకు, మహిళలకు, షెడ్యూల్డ్‌ తెగలకు, నిరు పేదలకు ఎలాంటి ప్రయోజనాలను కలిగించని, ప్రకటించని క్రూరమైన బడ్జెట్‌గా దీన్ని చెప్పాల్సి ఉంటుంది. ద్రవ్యోల్బణం తనిఖీ, ఉపాధి కల్పన వంటి చర్యల గురించి ప్రస్తావించడంలో బడ్జెట్‌ విఫలమైంది. పైగా ఇవి ఇప్పుడు చాలా ప్రధానమైనవి. అయితే 2024 లోక్‌సభ ఎన్నికలపై ఒక కన్ను వేసి ఈ బడ్జెట్‌ని సిద్ధం చేసినట్లు అర్థమౌతోంది. కానీ మధ్యతరగతిపై పడుతున్న ఒత్తిడిని అర్థం చేసుకున్నానని ఆర్థిక మంత్రి చేసిన ప్రకటన రాజకీయ గిమ్మిక్కుగా మారిపోయింది. ఎందుకంటే మధ్యతరగతికి భారంగా పరిణమించిన ధరల పెరుగుదల నుంచి ఉపశమన చర్యలకు సంబంధించి ఎలాంటి తక్షణ, నిర్దిష్ట చర్యలను బడ్జెట్‌ ప్రకటించలేదు మరి.

అత్యవసర వస్తువులపై జీఎస్టీని తగ్గించడం ద్వారా తమ చేతుల్లో కాసింత నగదు ఉండటానికి ఈ బడ్జెట్లో చర్యలు తీసుకుంటారని ధరల పెరుగుదల భారాన్ని మోస్తున్న సాధారణ పౌరులు ఆశలు పెట్టుకున్నారు. ఆలాగే కొన్ని అవసరమైన రాయి తీలు కూడా ప్రకటిస్తారనుకున్నారు. కానీ అసలైన సమస్యను ఎవరూ ముట్టలేదు. ప్రభుత్వం పెద్ద పెద్ద గణాంకాలు వల్లె వేస్తూ, పథకాలకు ఆకర్షణీయమైన పేర్లను పెట్టి ప్రజలను బుజ్జగించడానికి ప్రయ త్నించింది. ఆర్థిక వృద్ధిపై అంతర్జాతీయ షట్‌డౌన్‌ ప్రభావం, ఆరోగ్య, విద్యా ఫలితాలను మెరుగుపర్చడం వంటి సమస్యలపై బడ్జెట్‌ ఎలాంటి దృష్టీ పెట్టలేకపోయింది. పైగా నూతన పన్ను విధానం ప్రకారం ఆదాయ పన్ను రాయితీని ఏడు లక్షల రూపాయలకు పెంచామనీ, పన్ను శ్లాబ్‌లు మార్చామనీ ప్రభుత్వం గొప్పగా చేసిన ప్రకటన కూడా వేతన జీవులకు పిడుగుపాటులా తగిలింది. ఎందుకంటే ఈ రాయితీకి 80–సి కింద ఎలాంటి మినహాయింపూ ఇవ్వలేదు. దీర్ఘకాలంలో వ్యక్తుల సామాజిక భద్రత కోసం అవసరమైన పొదుపులను ఇది నిరుత్సాహపరుస్తోంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం బీమా రంగాన్ని చావు దెబ్బ తీస్తుంది. అంతే కాకుండా బీమా ఏజెంట్ల ఉద్యోగాలను దెబ్బ తీస్తుంది. రాజకీయంగా ప్రభావితం చేసే అతి కొద్దిమందికి ప్రత్యక్ష ప్రయోజనాలు ఇస్తూ, అత్యధిక ట్యాక్స్‌ శ్లా్లబ్‌ మాత్రం తగ్గించారు. 

వేగంగా పెరుగుతున్న నిరుద్యో గాన్ని తాజా బడ్జెట్‌ ప్రస్తావించలేదు. రాష్ట్రాల, దేశ ఆర్థిక వ్యవస్థను ఉద్దీపింపజేసే అతి ముఖ్యమైన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూడా 33 శాతం కోత విధించారు. ఈ ఒక్క అంశాన్ని చూసినా చాలు ఈ బడ్జెట్‌ పేదల వ్యతిరేక మైనదని రుజువవుతుంది. రాష్ట్ర ప్రభుత్వాల ఆందోళనలు, డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు. జీఎస్టీ పరిహారాన్ని విడుదల చేయాలని ఛత్తీస్‌గఢ్‌ చేసిన డిమాండ్, కేంద్ర పన్నుల బకాయలు, బొగ్గు రాయల్టీల బదిలీ వంటి అంశాలను గాలికి వదిలేశారు. బొగ్గు రాయల్టీల రేటును ఈ సంవత్సరం అసలు పెంచలేదు. దీన్ని చివరిసారి 2014లో మాత్రమే పెంచారు. ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్, జగదల్‌పూర్, సర్‌గుజా వంటి ప్రాంతాలు డిమాండ్‌ చేసిన కొత్త రైళ్లను అసలు ప్రకటించలేదు.

2022 చివరికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని కేంద్ర ప్రభుత్వం గత బడ్జెట్‌ సమయంలో హమీ ఇచ్చింది. ప్రతి పేదవాడికీ ఇల్లు నిర్మించి ఇస్తామనీ, 60 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామనీ కూడా వాగ్దానం చేసింది. కానీ గత బడ్జెట్‌లో ఇచ్చిన వాగ్దానాలు ఏ మేరకు నెరవేరాయో ఆర్థిక మంత్రి మనకు చెప్పాల్సిన అవసరం ఉంది. దేశ జీడీపీకి వ్యవసాయం 14–15 శాతం మేరకు దోహదం చేస్తోంది. కానీ కనీస మద్దతు ధరను చట్టబద్ధం చేయడం లేదా రైతులకు గ్యారంటీ ఆదాయాన్ని కల్పిస్తామనే మాట కూడా తాజా బడ్జెట్లో కనిపించలేదు.

కేంద్ర ప్రభుత్వం ఆవు పేడను ఉపయో గించుకునేందుకు ఇప్పుడు గోవర్ధన్‌ పథకాన్ని ప్రారంభించింది. ఇది ఛత్తీస్‌గఢ్‌ నమూనాకు వట్టి అనుకరణ మాత్రమే. రెండు రూపాయ లకు కిలో ఆవు పేడను కొనడం ద్వారా గత రెండేళ్లుగా ‘గోదాన్‌ న్యాయ్‌ యోజన’ను ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తూ వస్తోంది. దశలవారీగా ఈ పథ కాన్ని అమలు చేయడం ద్వారా ఛత్తీస్‌గఢ్‌ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో నిలకడైన పురోగతిని రాష్ట్రం ప్రభుత్వం సాధించింది. ఇప్పుడు ఛత్తీస్‌గఢ్‌ రైతులు వానపాము ఎరువును తయారు చేస్తున్నారు. రసాయనిక ఎరువులపై ఆధారపడటం తగ్గించుకున్నారు. పైగా ఈ పథకంతో ముడిపడి ఉన్న మహిళల ఆదాయం కూడా పెరిగింది. కట్టుదప్పిన పశువుల ద్వారా పంటలకు కలుగుతున్న నష్టం సమస్య గురించి తాజా బడ్డెట్‌ అసలు ప్రస్తావించలేదు. అలాగే సీఎన్జీ, పెట్రోల్, డీజిల్‌ వంటి ఇంధనాల ధరలు చుక్కలనంటు తున్నప్పటికీ ప్రత్యామ్నాయ ఇంధన వనరుల గురించి బడ్జెట్‌ నిర్దిష్టంగా  ఏమీ పేర్కొనలేదు. 

2023–24 ఆర్థిక సంవత్సరంలో బయోగ్యాస్, గ్రీన్‌ గ్రోత్‌ (మన సంక్షేమానికి అతి కీలకమైన సహజ వనరులు, పర్యావర ణానికి నష్టం కలిగించని అభివృద్ధి)పై దృష్టి పెడతామని బడ్జెట్‌ పేర్కొంది. కానీ వరి నుంచి ఇథనాల్‌ ఉత్పత్తికి అనుమతి కోరుతూ ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం వరుసగా ప్రయత్నిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం దానికి అనుమతులు ఇవ్వకుండా ఇప్పటికీ పెండింగులో ఉంచుతోంది. ఈ సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించారు. కానీ ఈ బడ్జెట్‌లో చిరుధాన్యాల కనీస మద్దతు ధర గురించి అసలు ప్రస్తావించలేదు. కానీ ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో మేము 52 రకాల పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటించాము. 


భూపేశ్‌ బఘేల్‌ 
వ్యాసకర్త ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి

మరిన్ని వార్తలు